Begin typing your search above and press return to search.

చనిపోయాక కూడా మైకేల్‌ జాక్సన్‌ నెం.1

By:  Tupaki Desk   |   1 Sep 2018 8:09 AM GMT
చనిపోయాక కూడా మైకేల్‌ జాక్సన్‌ నెం.1
X
తన సంగీతంతో - డాన్స్‌ లతో యావత్‌ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మైకేల్‌ జాక్సన్‌ 2009లో మృతి చెందిన విషయం తెల్సిందే. మైకేల్‌ జాక్సన్‌ మృతి చెంది దాదాపుగా పది సంవత్సరాలు కాబోతుంది. అయినా కూడా ఇంకా జనాలు ఆయన్ను ఆరాధిస్తూనే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగాయన సంగీతానికి స్టెప్పులు వేస్తూనే ఉన్నారు. మైకేల్‌ జాక్సన్‌ చనిపోక ముందు కంటే చనిపోయాక ఎక్కువ క్రేజ్‌ను దక్కించుకున్నాడు. అప్పట్లో సోషల్‌ మీడియా ఈ స్థాయిలో లేకపోవడంతో ఆయన పాటలు అందరికి చేరేవి కాదు. కాని ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీ కారణంగా ప్రతి ఒక్కరు కూడా మైకేల్‌ జాక్సన్‌ పాటలను ఇప్పటికి ఎంజాయ్‌ చేస్తున్నారు.

మైకేల్‌ జాక్సన్‌ చనిపోయాక కూడా తాను ట్యూన్‌ చేసిన పాటలతో - తాను చేసిన డాన్స్‌ లతో - మ్యూజిక్‌ - వీడియో ఆల్బమ్స్‌ తో వేల కోట్ల రూపాయలను అర్జిస్తున్నాడు. ఈ పాప్‌ మహారాజు రాయల్టీల రూపంలో వేల కోట్ల రూపాయలను సంపాదిస్తూ అందరిని ఆశ్చర్యంకు గురి చేస్తున్నాడు. చనిపోయిక పోర్బ్స్‌ జాబితాలో చేరిన అతి కొద్ది మందిలో మైకేల్‌ జాక్సన్‌ కూడా ఉన్నాడు. యూట్యూబ్‌ లో మైకేల్‌ జాక్సన్‌ వీడియోలకు వందల కోట్ల వ్యూస్‌ దక్కుతున్నాయి. కేవలం ఈ సంవత్సరంలోనే మైకేల్‌ జాక్సన్‌ వీడియోలను ఏకంగా 100 కోట్ల మంది వీక్షించారు.

యూట్యూబ్‌ ద్వారా ఇంకా ఇతరత్ర రాయల్టీల ద్వారా గత సంవత్సరం ఏకంగా 528 కోట్ల ఆదాయంను మైకేల్‌ జాక్సన్‌ కొడుకులు దక్కించుకున్నట్లుగా ఫోర్బ్స్‌ ప్రకటించింది. చనిపోయిన తర్వాత అత్యధిక సంపాదన కలిగిన సెలబ్రెటీగా మైకేల్‌ జాక్సన్‌ రికార్డును సృష్టించాడు. ఇప్పటి వరకు చనిపోయిన వారు, లేదంటే బతికి ఉన్న వారు ఏ ఒక్కరు కూడా ఇంత భారీ స్థాయిలో రాయల్టీలను పొందడం లేదు. మైకేల్‌ జాక్సన్‌ వీడియోలకు ప్రముఖ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఛానల్స్‌ వేల కోట్ల రాయల్టీలు చెల్లించి మరీ వాడుకుంటున్నాయి. మైకేల్‌ జాక్సన్‌ కెరీర్‌ ఆరంభం నుండి ఈ సంవత్సరం వరకు అమెరికాకు ఏకంగా 2 లక్షల కోట్ల రూపాయల పన్నును చెల్లించినట్లుగా ఫోర్బ్స్‌ పేర్కొంది.

ఇప్పటి వరకు ఏ సెలబ్రెటీ కూడా ఇంత భారీగా పన్నును చెల్లించలేదు అంటూ స్వయంగా అమెరికన్‌ ప్రభుత్వం వెళ్లడి చేసినట్లుగా సదరు కథనంలో పేర్కొనడం జరిగింది. మైకేల్‌ జాక్సన్‌ కు చెందిన ముగ్గురు కొడుకులు ఆయన రాయల్టీ ఆదాయంను షేర్‌ చేసుకుంటున్నారు. మైకేల్‌ జాక్సన్‌ క్రేజ్‌ ఎప్పటికి ఇలాగే ఉంటుందని, అన్ని తరాల వారికి ఆయన పాటలు నచ్చుతాయని మ్యూజిక్‌ ప్రియులు అంటున్నారు. ముందు ముందు మైకేల్‌ జాక్సన్‌ ఆదాయం పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ ఫోర్బ్స్‌ స్వయంగా పేర్కొనడం గమనించదగ్గ విషయం.