Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : మీటర్

By:  Tupaki Desk   |   7 April 2023 11:07 PM
మూవీ రివ్యూ : మీటర్
X
'మీటర్' మూవీ రివ్యూ
నటీనటులు: కిరణ్ అబ్బవరం-అతుల్య రవి-సప్తగిరి-వినయ్ వర్మ-పృథ్వీ-పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం: సాయి కార్తీక్
ఛాయాగ్రహణం: వెంకట్ సి.దిలీప్
రచన: సూర్య
నిర్మాతలు: చిరంజీవి-హేమలత పెదమల్లు
దర్శకత్వం: రమేష్ కడూరి

తెలుగులో జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసబెట్టి సినిమాలు చేస్తున్న యువ కథానాయకుల్లో కిరణ్ అబ్బవరం ఒకడు. గత ఏడాది మూడు సినిమాలతో పలకరించిన అతను.. కొత్త ఏడాదిలో ఇప్పటికే 'వినరో భాగ్యము విష్ణు కథ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు అతను 'మీటర్' సినిమాతో థియేటర్లలోకి దిగాడు. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.


కథ:

అర్జున్ క‌ళ్యాణ్‌ (కిర‌ణ్ అబ్బ‌వ‌రం) ఒక కానిస్టేబుల్ కొడుకు. తండ్రి త‌న కొడుకు మంచి పోలీసాఫీస‌ర్ కావాల‌ని కోరుకుంటే.. పోలీస్ గా తండ్రి ప‌డ్డ క‌ష్టాలు చూసి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఖాకీ తొడ‌గ‌కూడ‌ద‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకుంటాడు. కానీ అత‌ను అనుకోకుండా ఎస్ఐ అవుతాడు. త‌న ప్ర‌మేయం లేకుండా మంచి పేరు కూడా వ‌స్తుంది. కానీ ఎలాగైనా ఆ ఉద్యోగం పోగొట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న  అర్జున్ హోం మినిస్ట‌ర్ బైరెడ్డి సాయంతో ఆ ప్ర‌య‌త్నంలో విజ‌య‌వంతం అవుతాడు. కానీ హోం మినిస్ట‌ర్ కు ఫేవ‌ర్ చేసే క్ర‌మంలో త‌న తండ్రినే కాల్చడం.. అత‌ను కోమాలోకి వెళ్ల‌డం.. ఒక వ్య‌క్తి చావుకు కార‌ణమ‌వ‌డంతో అర్జున్ లో మార్పు వ‌స్తుంది. మ‌ళ్లీ పోలీస్ అయి సిన్సియ‌ర్ గా డ్యూటీ చేయ‌డం మొద‌లుపెట్టి.. హోం మినిస్ట‌ర్ని ఢీకొడ‌తాడు. మ‌రి ఈ పోరాటంలో ఎవ‌రు గెలిచారు అన్న‌ది మిగ‌తా క‌థ‌.


కథనం-విశ్లేషణ:

ముఖ‌చిత్రం చూసి పుస్త‌కంలో ఏముందో అంచ‌నాకు రాకూడదని ఒక సామెత‌. 'మీట‌ర్' సినిమా ట్రైల‌ర్ చూసి ఇదేదో రొటీన్ మాస్ మూవీలా ఉందే అనిపించిన‌ప్ప‌టికీ.. మైత్రీ మూవీ మేక‌ర్స్ లాంటి పెద్ద సంస్థ‌లో కిర‌ణ్ రెడ్డి లాంటి కొంచెం పేరున్న హీరో చేసిన సినిమా కావ‌డంతో ఇందులో ఏదో ఒక విశేషం ఉండే ఉంటుంద‌ని.. ముందే ఒక అంచ‌నాకు రావ‌డం క‌రెక్ట్ కాద‌నుకుని థియేట‌ర్ల‌లోకి వెళ్లి కూర్చుంటే.. దిమ్మ దిగిరి బొమ్మ క‌నిపించ‌డానికి ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌దు. వంద‌ల కోట్లు పెట్టి 'పుష్ప' లాంటి క్రేజీ సినిమాలు తీస్తున్న మైత్రీ సంస్థ నుంచి 'మీట‌ర్' అనే చిత్రం ఎలా అన్ని ద‌శ‌ల‌నూ దాటి థియేట‌ర్ వ‌ర‌కు వ‌చ్చిందో ఎంత ఆలోచించినా అంతుబ‌ట్ట‌దు. కొన్ని ద‌శాబ్దాల ముందు చూసినా కూడా ఔట్ డేటెడ్ అనిపించే సినిమా ఇది. ఒక మామూలు పోలీస్.. పెద్ద పొలిటీషియన్ని ఢీకొట్టి అత‌ణ్ని ఆటాడించే క‌మ‌ర్షియల్ ఫార్మాట్లో ఈ రోజుల్లో సినిమా తీసి మెప్పించ‌గ‌లం అని న‌మ్మిన మీట‌ర్ టీంను చూసి న‌వ్వాలో ఏడ‌వాలో అర్థం కాదు. సినిమా మొత్తంలో బాగుంది.. కొత్తగా ఉంది అని చెప్పడానికి ఒక్క సన్నివేశం కూడా లేని సినిమా 'మీటర్'.

మన కమర్షియల్ సినిమాల్లో హీరోలు తమ పరిధిని మించి సాహసాలు చేస్తుంటారు. అవతల ఉన్నది ఎంతటి వాడైనా సరే.. సై అంటే సై అని ముందుకు వెళ్లిపోతారు. ఐతే వాళ్లు ఏం చేసినా కొంతలో కొంతైనా లాజిక్ ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారు. కొంచెం కన్విన్సింగ్ గా అనిపిస్తే అతి చేసినా తట్టుకుంటారు. కానీ 'మీటర్'లో హీరో చేసే అతికి అంతూ పొంతూ ఉండదు. అసలు హీరోకు ఇందులో హీరోకు అసలు ఎస్సైగా ఉద్యోగమే ఉండదు. అనుకోకుండా పొరపాటున అతడికి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేస్తుంది. అతను స్టేషన్ కు పోకున్నా.. డ్యూటీ చేయకున్నా.. డ్రగ్ మాఫియాను నడుపుతున్న గ్యాంగ్ అరెస్టయితే అతడికి క్రెడిట్ వచ్చేస్తుంది. పెద్ద కుట్ర చేస్తున్న టెర్రరిస్టులు దొరికిపోతే ఆ క్రెడిట్ కూడా ఇతడి అకౌంట్లోకే పడిపోతుంది. హోం మంత్రికి ఏదో పెద్ద సమస్య వస్తే ఈ చిన్న ఎస్సైకే ఫోన్ చేస్తాడు.. తర్వాతేమో హోంమంత్రికి ఎదురు తిరిగి అతడి కొడుకుని కిడ్నాప్ చేస్తాడు.. ఆ పిల్లాడిని కాపాడ్డానికి వెళ్లిన డీజీపీ సైతం హీరో కిడ్నాప్ అయిపోతాడు.. చదువుతుంటే ఏంటి ఇదంతా సిల్లీగా ఉందే అనిపిస్తోందా..? మరి తెరపై ఇదంతా చూస్తే ఇంకెంత సిల్లీగా ఉంటుందో అంచనా వేసుకోండి.


'మీటర్' సినిమాలో హీరో దగ్గర్నుంచి ఒక్కో క్యారెక్టర్ని తీర్చిదిద్దిన విధానం.. సినిమాల్లో పాత్రలు ఎలా ఉండకూడదో చెప్పడానికి ఒక ఉదాహరణ. తన అక్కకి పెళ్లి వల్ల అన్యాయం జరిగిందని తనకు ప్రపోజ్ చేసిన ప్రతి కుర్రాడి మీదా యాసిడ్ పోసేస్తుంటుంది హీరోయిన్. ఆమె నుంచి ఒక కుర్రాడిని తప్పించబోయి తనే యాసిడ్ బాధితుడు అవుతాడు తండ్రి. యాసిడ్ పడకముందు 30 ఇయర్స్ పృథ్వీగా ఉన్నవాడు.. తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని గౌతం రాజుగా మారిపోతాడు. అదేంటో చిత్రంగా ముఖంతో పాటు వాయిస్ కూడా మారిపోయి మనకి గౌతం రాజు గొంతే వినిపిస్తుంది. ఈ ట్రాక్ అంతా చూసి ప్రేక్షకులు పగలబడి నవ్వేసుకుంటారని అనుకున్నారేమో. కానీ ఈ రోజుల్లో ఇలాంటి సీన్లు పెట్టి నవ్వించవచ్చన్న మేకర్స్ ఆలోచనను చూసి నవ్వొస్తుంది. మగాడి ఊసే గిట్టని హీరోయిన్.. హీరో తన వెంట పడుతూ ఒక సాంగేసుకుని.. ఆ పాట మధ్యలో హిజ్రాలు మీద పడి ఇబ్బంది పడుతుంటే పుసుక్కున నవ్వేసి సాంగ్ అయ్యేసరికి అతడి ప్రేమలో పడిపోవడం 'మీటర్' సినిమాకే మేజర్ హైలైట్. రొమాంటిక్ ట్రాకే ఇలా ఉంటే.. ఇక హీరో-విలన్ మధ్య వార్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోండి. ఊరూ పేరు లేని వాళ్లు.. అసలు సినిమా అంటే ఏంటో తెలియని వాళ్లు ఏది పడితే అది తీసేసి మేమూ సినిమా తీశాం అనిపించుకుంటూ ఉంటారు. అలాంటి సినిమాలు రిలీజైన సంగతి కూడా తెలియదు. కానీ మైత్రీ మూవీ మేకర్స్ లాంటి బేనర్లో.. యువతలో కొంచెం ఫాలోయింగ్ ఉన్న హీరోతో చేసిన సినిమా ఈ క్వాలిటీతో ఉండటమే విడ్డూరం.


నటీనటులు:

కిరణ్ అబ్బవరం నటన గురించి మాట్లాడుకునే ముందు.. కెరీర్ ఆరంభంలో చేసిన సినిమాలతో వచ్చిన పేరును ఎంత వేగంగా పోగొట్టుకుంటున్నాడో చెప్పుకోవాలి. అతడి జడ్జిమెంట్ ఎంత దారుణంగా ఉంటోందో 'సెబాస్టియన్'.. 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని'.. ఇప్పుడొచ్చిన 'మీటర్' ఉదాహరణలుగా నిలుస్తాయి. ఈ సినిమా తర్వాత ప్రేక్షకులు అతడి మీద పూర్తిగా నమ్మకం కోల్పోతే అందుకు పూర్తిగా అతనే బాధ్యత వహించాలి. మొదట్లో సీమ యాసలో డైలాగులు చెబుతూ డిఫరెంట్ యాటిట్యూట్ చూపిస్తే.. కుర్రాడు ఏదో భిన్నంగా చేస్తున్నాడు అనిపించింది కానీ.. అతను ఒకే రకం నటనతో.. హావభావాలతో విసిగించేస్తున్నాడు. 'మీటర్'లో కిరణ్ 'నటించాడు' అని చెప్పడానికి ఒక్క సన్నివేశం కూడా లేదు. ఈ విషయంలో హీరోయిన్ అతుల్య అతడికి సరైన జోడీ అనిపిస్తుంది. విలన్ పాత్రధారి నటన గురించి చెప్పడానికి ఏమీ లేదు. వినయ్ వర్మ లాంటి టాలెంటెడ్ నటుడిని ఇందులో పూర్తిగా వృథా చేశారు. హీరో సహాయకుడి పాత్రలో సప్తగరి నుంచి కూడా ఏ మెరుపులు లేవు. పోసాని.. మిగతా నటీనటులంతా కూడా సాధారణ పాత్రల్లో కనిపించారు.


సాంకేతిక వర్గం:

'మీటర్'లో సాంకేతిక విలువలంటూ చెప్పుకోడానికి ఏమీ లేవు. సాయికార్తీక్ పూర్తిగా ఫామ్ కోల్పోయాడని పాటలు వింటే అర్థమవుతుంది. చాలా మొక్కుబడిగా పాటలు.. నేపథ్య సంగీతం ఇచ్చాడు. వెంకట్ సి.దిలీప్ ఛాయాగ్రహణంలోనూ మెరుపులు లేవు. పోస్టర్ మీద మైత్రీ మూవీ మేకర్స్ లోగో ఉందే తప్ప.. ఆ సంస్థ స్థాయికి ఏమాత్రం తగని విధంగా ఉన్నాయి నిర్మాణ విలువలు. ముఖ్య పాత్రలకు ఎంచుకున్న నటీనటుల దగ్గర్నుంచి.. లొకేషన్ల వరకు అన్ని విషయాల్లోనూ రాజీ పడ్డ విషయం తెరపై కనిపిస్తుంది. సూర్య రచన కానీ.. రమేష్ కడూరి దర్శకత్వం కానీ ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. ప్రతి సీన్లోనూ 'ఔట్ డేట్' ఫీల్ ఉండేలా వాళ్ల పనితనం సాగింది.

చివరగా: మీట‌ర్.. ప‌గిలిపోయింది

రేటింగ్-1/5