Begin typing your search above and press return to search.

'కేజీఎఫ్‌ 2' నుంచి 'అధీరా' ఫస్ట్ లుక్...!

By:  Tupaki Desk   |   29 July 2020 10:45 AM IST
కేజీఎఫ్‌ 2 నుంచి అధీరా ఫస్ట్ లుక్...!
X
యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో 'కేజీఎఫ్‌ 2' ఒకటని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది దేశ వ్యాప్తంగా కన్నడ సినిమా స్థాయిని పెంచిన 'కేజీఎఫ్‌' కి సీక్వెల్ గా రానున్నది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రూపొందిన ‘కేజీఎఫ్‌' పాన్‌ ఇండియన్‌ చిత్రంగా అన్ని భాషల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నది. బాక్సాఫీస్‌ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టిన కన్నడ చిత్రంగా.. బాలీవుడ్ లో సత్తా చాటిన సౌత్ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా 'కేజీఎఫ్' నిలిచిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ సీక్వెల్ లో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్.. రవీనా టాండన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో విలన్స్ ని మించి సెకండ్ పార్ట్ లో విలన్స్ ని చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఈ క్రమంలో నేడు సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన 'అధీరా' పాత్రకు సంభందించిన ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర యూనిట్.

కాగా ప్రశాంత్ నీల్ అధీరా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ.. ‘అధీరా’ - వైకింగ్స్ యొక్క క్రూరమైన మార్గాల నుండి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాం. 'కేజీఎఫ్‌ చాప్టర్ 2'లో భాగమైనందుకు మీకు ధన్యవాదాలు. హ్యాపీ బర్త్ డే సంజయ్ బాబా. త్వరలో స్టార్ట్ అవబోయే మన క్రేజీ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నాము అని ట్వీట్ చేసారు. ఈ పోస్టర్ లో సంజయ్ దత్ 'అధీరా' లుక్ లో భయంకరంగా కనిపిస్తున్నారు. ముఖం మీద టాటూ.. డిఫరెంట్ హెయిర్ స్టైల్.. చేతిలో పెద్ద కత్తి పట్టుకొని ఆలోచిస్తున్నట్లు కూర్చున్నారు. మొత్తం మీద 'అధీరా' పాత్రని 'రాకీ భాయ్' పాత్రకి ధీటుగా తీర్చిదిద్దారని ఫస్ట్ లుక్ లోనే తెలుస్తోంది. కేజీఎఫ్‌ మొదటి భాగంలో అధీరా పాత్రకి సీన్స్ ఉన్నప్పటికీ ఆయన ఎవరనేది రివీల్ చెయ్యలేదు. ఇక కేజీఎఫ్‌ 2 లో మాత్రం మెయిన్ విలన్ గా చూపిస్తున్నారు. కోలార్ ఫీల్డ్ గ‌నుల నేపథ్యంలో మాఫియా క‌థతో తెర‌కెక్కుతున్న ‘కేజీఎఫ్‌ 2’ చిత్రాన్ని హెంబలే ఫిలిమ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రవీ బాస్రుర్ సంగీతం అందిస్తున్నారు.