Begin typing your search above and press return to search.

త‌ల్లి బిడ్డ‌ల‌ను బ‌తికించిన `కార్మిక బాంధ‌వుడు` మెగాస్టార్

By:  Tupaki Desk   |   15 July 2021 8:56 AM GMT
త‌ల్లి బిడ్డ‌ల‌ను బ‌తికించిన `కార్మిక బాంధ‌వుడు` మెగాస్టార్
X
క‌రోనా మ‌హ‌మ్మారీ నుంచి సినీప‌రిశ్ర‌మ‌ను కాపాడేందుకు మెగాస్టార్ చిరంజీవి అప‌రిమిత‌మైన సేవ‌ల్ని అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఊహించ‌ని విప‌త్తులా మీద ప‌డిన వైర‌స్ మొద‌టి వేవ్ స‌మ‌యంలో క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)ని ప్రారంభించి వేలాది మంది కార్మికుల‌కు నిత్యావ‌స‌రాల్ని అందించిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ త‌ర‌పున అభిమానులు సేవ‌లు అందించగా వేలాది కుటుంబాలు రోడ్డున ప‌డ‌కుండా కాపాడ‌గ‌లిగారు.

సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఏకంగా క‌రోనా రోగుల మ‌ర‌ణాలు చూసి చ‌లించిన `చిరంజీవి- రామ్ చ‌రణ్` బృందం తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌తి జిల్లాలో ఆక్సిజ‌న్ బ్యాంకుల్ని నెల‌కొల్పి సేవ‌లందించారు. ఇందుకోసం స్వార్జిత‌మైన కోట్లాది రూపాయ‌ల్ని వెచ్చించి విదేశాల నుంచి ప‌రిక‌రాల్ని కొనుగోలు చేశారు. చిరంజీవి ట్ర‌స్ట్ ఆక్సిజ‌న్ బ్యాంకుల సేవ‌ల‌తో ఎంద‌రో క‌రోనా బాధితులు ప్రాణాల్ని కాపాడుకోగ‌లిగారు. వారంతా చిరంజీవి మేలును మ‌రువ‌లేదు. ఎల్ల‌పుడూ త‌మ ప్రాణాల్ని కాపాడిన ప్ర‌త్య‌క్ష‌ దైవం అంటూ త‌మ కృత‌జ్ఞ‌త‌ల‌ను తెలియ‌జేస్తున్నారు.

ఈ క్రైసిస్ క‌ష్ట‌కాలంలో ఆర్టిస్టులు స‌హా 24 శాఖ‌ల కార్మికుల్లో ఎవ‌రికి ఏ క‌ష్టం వ‌చ్చినా చిరు ఆదుకున్నారు. పేద ఆర్టిస్టుల‌కు క‌రోనాతో సంబంధం లేకుండా ఆర్థిక అవ‌స‌రాల‌కు ల‌క్ష‌ల్లో విరాళాలిచ్చి ఆదుకున్నారు. ఇలాంటి సాయంపైనా స‌ర్వత్రా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిసింది. చిరు ప్ర‌తి సేవాకార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ధ‌తు ల‌భించింది. ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తున్నా మీడియా ప‌ట్టించుకోక‌పోయినా అవేమీ ప‌ట్ట‌ని చిరు త‌న సేవాకార్య‌క్ర‌మాల్ని అప్ర‌తిహ‌తంగా కొన‌సాగించారు.

క‌ష్టంలో సినీకార్మికుల‌ను ఆదుకున్న చిరంజీవికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ సీసీసీ సేవ‌ల‌ను ఇక‌పైనా కొన‌సాగించాల‌ని కోరుతూ ఇంత‌కుముందు సినీప‌రిశ్ర‌మ‌ కార్మిక స‌మాఖ్య (ఫెడ‌రేష‌న్) చిరంజీవి కి లేఖ‌ను రాసింది.

తాజాగా సినీకార్మికుడు భాస్క‌ర్ కుటుంబాన్ని చిరంజీవి ఆదుకున్నార‌ని తెలుస్తోంది. త‌ల్లి బిడ్డ‌లు ర‌క్తం అంద‌క క‌ష్టంలో ఉంటే చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ నుంచి స‌కాలంలో ర‌క్తాన్ని అందించి వారి ప్రాణాల్ని కాపాడారు. దీనిపై స్పందిస్తూ కార్మిక స‌మాఖ్య మ‌రోసారి పాదాభివంద‌నాల‌ను తెలియజేసింది.

``చిరంజీవి గారూ.. మీరు మన సినీ కార్మికులకు ఎన్నో విధాలుగా సాయం చేస్తున్నారు. మీరు చేసే ప్రతి సేవ జీవితాంతం గుర్తుంటుంది. అందులో భాగంగా.. భాస్కర్ అనే సినీ కార్మికుని భార్య డెలివరీ సమయంలో చావు బ్రతుకులలో ఉండ‌గా తల్లి బిడ్డలకు రెండు ద‌ఫాలుగా బ్లడ్ ఇచ్చి బ్రతికించిన మీకు మా పాదాభివందనాలు`` అంటూ ఫెడ‌రేష‌న్ ఎమోష‌న‌ల్ గా లేఖ‌ను రాయ‌డం ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ర‌క్త‌దానం కోసం అర్ధరాత్రి వెళ్ళి అడిగినా వెంటనే స్పందించిన బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరపున అధ్య‌క్షుడు అనీల్ కుమార్ వ‌ల్ల‌భ‌నేని ధన్యవాదములు తెలియజేసారు.

ఒక మంచి ప‌నికి `నేను సైతం` అంటూ ముందుండే మెగాస్టార్ పై ఇరు రాష్ట్రాల తెలుగు ప్ర‌జ‌ల్లో ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. మీడియా ప్ర‌మోష‌న్స్ కి అతీతంగా సామాజిక మాధ్య‌మాల్లో చిరు సేవ‌ల‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. మునుముందు సీసీసీ త‌ర‌పున థ‌ర్డ్ వేవ్ పై ప‌రిశ్ర‌మ‌ను జాగృతం చేస్తూ హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.