Begin typing your search above and press return to search.

మెగా vs నందమూరి: దసరాకు వార్ తప్పదా..?

By:  Tupaki Desk   |   15 Jun 2022 4:38 AM GMT
మెగా vs నందమూరి: దసరాకు వార్ తప్పదా..?
X
టాలీవుడ్ లో రెండు పెద్ద సినీ ఫ్యామిలీలైన నందమూరి - మెగా హీరోల మధ్య ఎన్నో ఏళ్లుగా బాక్సాఫీస్ పోరు ఉందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో సంక్రాంతి, దసరా, దీపావళి, క్రిస్మస్ లాంటి పెద్ద పండుగలకు చిరంజీవి - బాలకృష్ణ నటించిన సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అనే విధంగా పోటీ వాతావరణం నెలకొల్పేవి.

మెగా - నందమూరి హీరోల సినిమాలు ఒకేసారి వస్తున్నాయి అంటే ఇరు వర్గాల ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే నడిచేది. ఇప్పుడంటే సోషల్ మీడియాలో ఫైట్ చేసుకుంటున్నారు కానీ.. అప్పట్లో ఇంటర్నెట్ పెద్దగా అందుబాటులో లేకపోవడంతో ప్రత్యక్షంగానే ఫ్యాన్స్ వార్‌ కి దిగేవారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని చొక్కాలు చించుకునేవారు.

దాదాపు మూడు దశాబ్దాలుగా మెగా వెర్సెస్ నందమూరి ఫ్యామిలీల మధ్య బాక్సాఫీస్ వార్ జరుగుతూ వస్తోంది. కాకపోతే గత కొన్నేళ్లలో మెల్లమెల్లగా రెండు కుటుంబాలకు చెందిన హీరోల మధ్య పోటీ వాతావరణం చల్లబడుతూ వస్తోంది. కానీ ఫ్యాన్స్ మాత్రం ఒకరిపై మరొకరు ఆధిక్యత చూపించుకోడానికి ఫైట్ చేస్తూ వస్తున్నాయి.

ఇటీవల 'ఆర్.ఆర్.ఆర్' సినిమా సక్సెస్ క్రెడిట్ కోసం రెండు వర్గాల అభిమానుల మధ్య జరుగిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు చాలా కాలం తర్వాత మెగా - నందమూరి హీరోలు బాక్సాఫీస్ బరిలో దిగేందుకు రంగం సిద్ధమవుతోందనిపిస్తోంది. చిరంజీవి - బాలయ్య నటించిన సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'గాడ్ ఫాదర్' అనే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్' కు అధికారిక రీమేక్. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మరియు సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాని 2022 దసరా పండక్కి విడుదల చేసే అవకాశం ఉంది.

అయితే అదే ఫెస్టివల్ సీజన్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న #NBK107 చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవ సంఘటనల ప్రేరణతో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న 'గాడ్ ఫాదర్' మరియు #NBK107 సినిమాలు రెండూ విజయదశమి కి పోటీపడే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ గ్యారంటీ అని చెప్పాలి. ఇందులో ఎవరు పైచేయి సాధిస్తారనేది పక్కన పెడితే.. ఖచ్చితంగా టిక్కెట్ కౌంటర్ల వద్ద ఫెస్టివల్ బ్లాస్ట్ అవుతుందని చెప్పాలి. అలానే సోషల్ మీడియాలో మరోసారి నందమూరి vs మెగా అభిమానుల సందడి కనిపించడం ఖాయం.

ఇకపోతే ఈ రెండు సినిమాలు ఇద్దరు సీనియర్ హీరోలకు కీలకమనే చెప్పాలి. వరుస ప్లాప్స్ తర్వాత 'అఖండ' సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన బాలకృష్ణ.. NBK107 తో దాన్ని కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు 'ఆచార్య' చిత్రంతో భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న చిరంజీవి.. 'గాడ్ ఫాదర్' తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. మరి ఈ సినిమాలు సీనియర్లకు ఎలాంటి విజయాలు అందిస్తాయో చూడాలి.