Begin typing your search above and press return to search.

కోకాపేట భూముల్లో చెల్లెళ్ల‌కు మెగాస్టార్ వాటా..!

By:  Tupaki Desk   |   9 March 2022 3:43 AM GMT
కోకాపేట భూముల్లో చెల్లెళ్ల‌కు మెగాస్టార్ వాటా..!
X
మెగాస్టార్ చిరంజీవి మార్చి 8న‌ అంత‌ర్జాతీయ‌ మ‌హిళాదినోత్స‌వం సంద‌ర్భంగా ఆడ‌ప‌డుచులంద‌రికీ శుభాకాంక్ష‌లు అంద‌జేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న త‌న భార్యామ‌ణి సురేఖ‌.. సోద‌రీమ‌ణులంద‌రికీ ప్ర‌త్యేకించి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఓ కార్య‌క్ర‌మంలో ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొన్ని ఆస‌క్తిక‌ర ర‌హ‌స్యాల గురించి బ‌హిరంగంగా మాట్లాడారు. అందులో వంద‌ల కోట్ల విలువ‌కు ఎగ‌బాకిన కోకాపేట భూములు ఆస్తుల గురించి చిరు స్వ‌యంగా ఏదీ దాచుకోకుండా వెల్ల‌డించారు.

ఆ ఆస్తుల్లో త‌న చెల్లెళ్ల‌కు వాటా ఇచ్చేందుకు త‌న భార్యామ‌ణి సురేఖ కార‌ణం ఎలా అయ్యిందో ఎంతో చ‌క్క‌గా చెప్పారు. త‌న మ‌న‌సు గురించి ఆయ‌న మాట్లాడిన తీరు .. త‌న ఎదుగుద‌ల వెన‌క సురేఖ త్యాగం గురించి చెప్పిన తీరు గుండెను ట‌చ్ చేసింది.

చిరు ప్ర‌సంగం ఇలా సాగింది. కోకాపేట‌లో నాకు కొన్ని ఎక‌రాల్లో భూములున్నాయి. అక్క‌డ ఇల్లు క‌ట్టుకుని లేదా ఫామ్ హౌస్ క‌ట్టుకోవాల‌ని అనుకున్నాను. పొలం పండించాల‌నుకున్నాను.. కానీ అక్క‌డ అంతా మారింది. స్మార్ట్ సిటీ వ‌చ్చేసింది. అక్క‌డ ఎక‌రం కోట్ల‌లోకి వెళ్లిపోయింది. నేను నా బిడ్డ‌ల్ని చెల్లెళ్ల బిడ్డ‌ల్ని అంద‌రి ఎదుగుద‌ల‌ను చూశాను. దానికోసం కొంత చేశాను. దేవుని ద‌య‌వ‌ల్ల అంతా బావున్నారు.

ఇక సురేఖ గెస్చ‌ర్ ఎంత ఉన్న‌తంగా ఉంటుంది అంటే ఒక మాట చెప్పాలి. నిజానికి కోకాపేట‌లో భూముల ధ‌ర‌లు అంతగా పెరిగాయి. త‌న‌కు బిడ్డ‌లు ఉన్నారు.. కుటుంబం ఉంది. కానీ కోకాపేటలో ఉన్న ఆస్తుల నుంచి నా చెల్లెళ్ల‌కు కొంత ఇవ్వాల‌ని సురేఖ అడిగింది. త‌న మ‌న‌సు ఎంత గొప్ప‌దో ఇది చెబుతుంది.. అంటూ మెగా ర‌హ‌స్యాన్ని రివీల్ చేశారు. తాను హీరోగా ఎంత బిజీగా ఉన్నా కుటుంబంలో అన్ని బాధ్య‌త‌ల్ని సురేఖ తీసుకున్నార‌ని తెలిపారు. త‌న త‌మ్ముళ్ల‌ను బాగు చేసిన మ‌హిళామ‌ణి సురేఖ‌. అలాగే త‌న చెల్లెళ్ల‌ను ఎంత‌గానో ఆద‌రించిన గొప్ప వ‌నిత సురేఖ‌.

నిజానికి వంద‌ల కోట్ల విలువ చేసే ఆస్తుల నుంచి కొంత వాటా ఇవ్వాల‌న్న ఆలోచ‌న ఈ రోజుల్లో ఎవ‌రికైనా ఉంటుందంటారా? ఆడ‌ప‌డుచుల్ని త‌న్ని త‌రిమేసే కోడ‌ళ్లే ఇప్పుడు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు. ఇంటి కొస్తే ప‌సుపు కుంకుమ చీర సారితో స‌రిపెట్టేస్తారు ఎవ‌రైనా. కానీ సురేఖ అమ్మ అలాంటి వారు కాదు. డ‌బ్బు ఆస్తులు అంటే ఆడ‌ప‌డుచులు అత్త మామ‌లు మ‌రుదులు అంద‌రినీ స‌రిగా చూసుకోవ‌డం.. నిజ‌మైన ప్రేమ‌కు నిర్వ‌చ‌న‌మిది.

చాలా మంది ప్రేమ పాఠాలు వ‌ల్లించినా కానీ ప్రాక్టిక‌ల్ గా ఆచ‌ర‌ణ ఉండ‌దు. ఆస్తుల వ్య‌వ‌హార‌మో లేదా ఇంకేదో వ‌చ్చేస‌రికి ఆ పాఠాలేవీ ఆచ‌ర‌ణ‌లో సాధ్యం కాద‌ని నిరూపిస్తారు.