Begin typing your search above and press return to search.

తగ్గేదేలే అంటున్న మెగాస్టార్..?

By:  Tupaki Desk   |   17 Oct 2022 4:06 PM GMT
తగ్గేదేలే అంటున్న మెగాస్టార్..?
X
2023 సంక్రాంతి పండగ కోసం క్రేజీ చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం 'ఆదిపురుష్' ను జనవరి 13న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తమిళ హీరో విజయ్ నటిస్తున్న బైలింగ్వల్ మూవీ 'వారసుడు' కూడా పొంగల్ సీజన్ లోనే రాబోతోంది. అలానే చిరంజీవి నటిస్తున్న 'మెగా154' సినిమా కూడా పెద్ద పండక్కి రాబోతోందని చాలా రోజుల క్రితమే ప్రకటించారు.

అయితే 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ ప్రచారంలో ఉన్న చిరంజీవి సినిమా కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని ఇటీవల సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని.. మెగా154 సినిమా అనుకున్న సమయానికే పూర్తవుతుందని నివేదికలు తెలిపాయి.

ఇటీవల 'గాడ్ ఫాదర్' సినిమాతో ప్రేక్షకులను అలరించిన చిరంజీవి.. ప్రస్తుతం తన 154వ చిత్రంపైనే ఫుల్ ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ అయింది. మూడు పాటలు మరియు కొద్దిగా టాకీ పార్ట్ మాత్రమే పెండింగ్ ఉన్నట్లుగా నివేదికలు పేర్కొన్నాయి. చిరంజీవి - శృతి హాసన్ మీద రెండు పాటలతో పాటుగా ఓ ఐటమ్ సాంగ్ ను షూట్ చేయాల్సి ఉందని అంటున్నారు.

సంక్రాంతి విడుదలకు ఇంకా దాదాపు 3 నెలల సమయం ఉంది కాబట్టి.. ఓవైపు షూటింగ్ మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేయడానికి టీమ్ అన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే డబ్బింగ్ పనులు కూడా మొదలు పెట్టినట్లు మేకర్స్ తెలిపారు. మిగతా చిత్రీకరణ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయడం ఖాయమని అంటున్నారు.

అదే సమయంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లోనే రూపొందే NBK107 సినిమాని కూడా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నారని రూమర్స్ వచ్చాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీన్ని పండుగ బరిలో నిలపాలని బాలయ్య యోచన చేస్తున్నట్లుగా చెప్పుకున్నారు.

అయితే సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' సినిమానే లాక్ అయినట్లుగా తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జనవరి 13వ తేదీన విడుదల అవుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో #Mega154ForSankranthi అనే హ్యాష్ ట్యాగ్ తో మెగా ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.

ఇదే నిజమైతే పొంగల్ రేసులో 'ఆది పురుష్' 'వారసుడు' సినిమాలతో పాటుగా 'మెగా154' మూవీ కూడా ఉంటుంది. గతంలో ఫెస్టివల్ సీజన్ లో ఒకేసారి రిలీజైన రెండు మూడు పెద్ద సినిమాలు హిట్టైన సందర్భాలు ఉన్నాయి. మరి ఈసారి బాక్సాఫీస్ వార్ లో ఏమి జరుగుతుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.