Begin typing your search above and press return to search.

ఆ క్షణం ఉద్వేగానికి గురయ్యా.. చిరు ‘కరోనా’ అనుభవం..

By:  Tupaki Desk   |   21 April 2020 10:53 AM IST
ఆ క్షణం ఉద్వేగానికి గురయ్యా.. చిరు ‘కరోనా’ అనుభవం..
X
దోమ సామాజిక జీవి.. అది ప్రధాని నుంచి సామాన్యుల వరకూ అందరినీ కుడుతుంది.. రక్తం పీలుస్తుంది. అలానే కరోనా వైరస్ కూడా అంతే.. దానికి తర తమ బేధాల్లేవు. అందరికీ సోకుతుంది. మెగా స్టార్ చిరంజీవి సైతం ఇటీవల కరోనాతో ఎదుర్కొన్న వ్యక్తిగత అనుభవాన్ని చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

కరోనా వైరస్ తో వచ్చిన లాక్ డౌన్ లో మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య, తల్లితో కలిసి వారి ఇంటికే పరిమితమయ్యారు. బయటకు వెళ్లకుండా నిబంధనలు పాటించారు. అయితే ఈ సమయంలోనే చిరంజీవి కుమార్తె, మనవరాళ్లు వచ్చారట.. తన మనవరాళ్లను చూసిన వెంటనే తన చేతుల్లోకి తీసుకోవాలని ముద్దాడాలని చిరంజీవి అనుకున్నారట.. కానీ కరోనా జాగ్రత్తలు గుర్తుకు వచ్చి.. వారిని దగ్గరకు తీసుకోకుండా బలవంతంగా దూరంగా పెట్టారట.. ఈ విషయాన్ని తలుచుకొని తనకు చాలా బాధ, ఆవేదన కలిగిందని చిరంజీవి చెప్పుకొచ్చారు.

ఒక తాతగా నా మనవరాళ్లను దగ్గరకు హత్తుకోలేక ఉద్వేగానికి గురైనట్టు చిరంజీవి ఆవేదన చెందారట.. దీంతో చిరంజీవి కుమార్తె వచ్చి ‘నాన్న మీరు ఈ ఇంట్లో లాక్ డౌన్ మొదలయ్యాక రెండు వారాలుగా ఒంటరిగా ఉన్నారు. మేము కూడా రెండు వారాలుగా మా ఇంట్లోనే ఒంటరిగా ఉన్నాం. కాబట్టి మనకు కరోనా సమస్య ఉండదు.. పిల్లలను దగ్గరకు తీసుకోండి’ అని చెప్పిందట..

అప్పుడు కానీ చిరంజీవి ధైర్యం చేసి మనవరాళ్లను కౌగిలించుకున్నాడట.. ఇలా తన కుటుంబంలో కరోనా భయానికి ప్రేమలు కూడా దూరం అవుతాయోనన్న భయం తనను వెంటాడిందని చిరంజీవి జ్ఞాపకాన్ని పంచుకున్నారు. ప్రపంచానికి మెగాస్టార్ చిరంజీవి అయినా ఆయన ఓ మనవరాలికి తాతే.. అందుకే సామాన్యులలాగానే ఆయన ప్రేమ, అప్యాయతలకు బంధీ అని ఈ ఘటనతో అర్థమైంది.