Begin typing your search above and press return to search.

#RC15.. శంక‌ర్ తో పనిచేయడం ఒక కల.. మెగా బాస్ ఎమోష‌నల్!

By:  Tupaki Desk   |   8 Sep 2021 2:30 PM GMT
#RC15.. శంక‌ర్ తో పనిచేయడం ఒక కల.. మెగా బాస్ ఎమోష‌నల్!
X
మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాథానాయ‌కుడిగా శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో RC15 బుధవారం ప్రారంభ‌మైంది. ఇంత‌కుముందే పోస్టర్ ని లాంచ్ చేయ‌గా వైర‌ల్ గా దూసుకెళ్లింది. ఈ పోస్ట‌ర్ లో ఆర్సీ 15లో న‌టిస్తున్న‌ కొంద‌రు ముఖ్య తారాగణం సిబ్బంది ఉన్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు కూడా సూట్ ధ‌రించి చ‌ర‌ణ్ -శంక‌ర్ - కియ‌రాల‌తో పాటు ఈ పోస్ట‌ర్ లో ఎంతో స్టైలిష్ గా క‌న‌ప‌బ‌డ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. పోస్ట‌ర్ లో నటులు రామ్ చరణ్- కియారా అద్వానీ- జయరామ్- సునీల్- అంజలి- నవీన్ చంద్ర ఉన్నారు. దర్శకుడు శంకర్- నిర్మాత దిల్ రాజు- సినిమాటోగ్రాఫర్ ఎస్ తిరునావుక్కరసు- మ్యూజిక్ కంపోజర్ ఎస్ థమన్ ఇతరులు కూడా ఉన్నారు.

లాంచ్ కార్యక్రమంలో రణవీర్ సింగ్- రామ్ చ‌ర‌ణ్‌- కియారా అద్వానీ త‌దిత‌రులు ఉన్నారు. శంకర్ తో కలిసి హిందీ రీమేక్ అన్నీయాన్ లో న‌టిస్తున్న ర‌ణ్ వీర్.. ఈరోజు ఎస్.వి.సి 50 లాంచ్ వేడుక‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి నాయ‌కానాయిక‌ల‌పై క్లాప్ కొట్టి ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఎస్ఎస్ రాజమౌళి కూడా లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ``మేము వస్తున్నాము !!! ఈరోజు #RC15 #SVC50 ముహూర్తం వేడుక`` అంటూ బోలెడంత హంగామా కొన‌సాగింది.

ఆస‌క్తిక‌రంగా ఈ వేడుక‌లో మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఎమోష‌న‌ల్ గా క‌నిపించారు. ఆయన చాలా సేపు శంక‌ర్ ష‌న్ముగంతోనే గ‌డిపారు. నిజానికి శంక‌ర్ తో సినిమా చేయాల‌న్న‌ది మెగాస్టార్ డ్రీమ్. ప‌లుమార్లు దానికోసం ప్ర‌య‌త్నించినా కుద‌ర‌లేదు. కానీ శంక‌ర్ తెర‌కెక్కించిన ది జెంటిల్ మేన్ హిందీ రీమేక్ లో చిరు న‌టించారు. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ కి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే అరుదైన అవ‌కాశం ద‌క్కింది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఈ సినిమా గురించి చిరు తాజాగా ట్వీట్ చేశారు. ``కొన్ని ప్రాజెక్ట్‌లు ప్రత్యేకమైనవి! ఇది అలాంటిది. ద‌ర్శ‌కుడు శంక‌ర్ తో పనిచేయడం ఒక కల. రామ్ చ‌ర‌ణ్ కి ఆ కల సాకారం కాబోతోంది. ఈరోజు సినిమా ప్రారంభమైంది. వారికి శుభాకాంక్షలు`` అని తెలిపారు. SVC మొత్తం బృందం చాలా ఉత్తమమైనది! #RC15 #SVC50 విజ‌యం సాధించాలి అని చిరు ఆకాంక్షించారు.

టైటిల్ ప్ర‌క‌టించాల్సి ఉంది:

RC15 సినిమాకు శంక‌ర్ టైటిల్ ఇదేనా?

రామ్ చరణ్ - శంకర్ పాన్ ఇండియా చిత్రానికి టైటిల్ ఏమిటి? అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్. నేటి లాంచింగ్ అనంత‌రం చ‌ర‌ణ్ - కియ‌రా జంట‌పై పాట‌ను చిత్రీక‌రించ‌నున్నార‌ని తెలిసింది. ఈ క్రేజీ చిత్రానికి శంక‌ర్ ఎలాంటి టైటిల్ ని ఎంపిక చేశారు? అంటే... కాస్త గ్రాంధిక‌మైన‌ టైటిల్ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. శంకర్ ఈ చిత్రానికి `విశ్వంభర` అనే టైటిల్ ని ఫైనల్ చేశార‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ దీనిని టీమ్ ప్ర‌క‌టించాల్సి ఉంది.

చ‌ర‌ణ్ ని మునుపెన్న‌డూ చూడ‌నంత విభిన్నంగా ఒక‌ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంలో శంక‌ర్ చూపించ‌నున్నారు. ఇందులో అత‌డు ఛాలెంజింగ్ యువ‌ ముఖ్య‌మంత్రిగా క‌నిపిస్తార‌ని ప్ర‌చారం ఉంది. శంకర్ గతంలోనూ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలు చేశారు. అర్జున్ క‌థానాయ‌కుడిగా ఒకే ఒక్క‌డు ఎంత‌టి సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యిందో తెలిసిందే. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ కోసం ఎలాంటి టైటిల్ ఎంపిక చేశార‌న్న‌ది ఉత్కంఠ‌గా మారింది. ఇది మెగాభిమానుల్లోకి దూసుకెళుతుందా? మాస్ కి క‌నెక్ట‌వుతుందా? అంటూ గుస‌గుస మొద‌లైంది.