Begin typing your search above and press return to search.

''నల్లంచు తెల్లచీర'' గా మెగాస్టార్ 'దొంగ మొగుడు' రీమేక్..!

By:  Tupaki Desk   |   11 Jun 2021 9:00 PM IST
నల్లంచు తెల్లచీర గా మెగాస్టార్ దొంగ మొగుడు రీమేక్..!
X
ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్నో గొప్ప నవలా రచనలు చేసిన యండమూరి.. సుమారు ముప్పై సినిమాలకు కథలు అందించారు. చాలా టీవీ సీరియల్లు ఆయన నవలలు ఆధారంగా రూపొందాయి. ఈ క్రమంలో 'స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్' 'అగ్నిప్రవేశం' 'దుప్పట్లో మిన్నాగు' వంటి చిత్రాలకు యండమూరి దర్శకత్వం వహించారు. అయితే ఇప్పుడు సుదీర్ఘ విరామం తరువాత ''నల్లంచు తెల్లచీర'' అనే చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు.

యండమూరి వీరేంద్రనాధ్ రచించిన 'నల్లంచు తెల్లచీర' నవల ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి ''దొంగ మొగుడు'' సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. చిరు ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధిక - మాధవి - భానుప్రియ హీరోయిన్లుగా నటించారు. అయితే ఇప్పుడు అదే నవలను యండమూరి ''నల్లంచు తెల్లచీర'' పేరుతో వినూత్నమైన కథనాలతో తెరకెక్కిస్తున్నారు. ఓటీటీ కోసం రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కాబోతోంది.

ఊర్వశి ఓటీటీ సమర్పణలో సంధ్య స్టూడియోస్ - భీమవరం టాకీస్ బ్యానర్స్ పై రవి కనగాల - తుమ్మలపల్లి రామసత్యనారాయణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాళ్ళూరి నాగరాజు సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అమీర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా 'దొంగ మొగుడు' మాదిరిగానే ఉంటుందా.. లేదా పూర్తిగా వేరే విధంగా తీస్తున్నారా అనేది చూడాలి. ఏదేమైనా ఓ హిట్ సినిమా మళ్లీ ఓటీటీ కోసం రీమేక్ అవడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. మరి యండమూరి నుంచి వస్తున్న 'నల్లంచు తెల్లచీర' సినిమా ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.