Begin typing your search above and press return to search.

ఆ సినిమాలో నటించినందుకు నేను గర్వంగా ఫీలవుతా : మెగాస్టార్

By:  Tupaki Desk   |   7 May 2020 2:20 PM IST
ఆ సినిమాలో నటించినందుకు నేను గర్వంగా ఫీలవుతా : మెగాస్టార్
X
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌ లో మరపురాని చిత్రంగా నిలిచిపోయే చిత్రం 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ అద్భుతమైన చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌ పై అశ్వనీదత్ నిర్మించారు. చిరంజీవి జగదేకవీరుడుగా అలరిస్తే.. శ్రీదేవి అతిలోకసుందరిగా ప్రేక్షకులను మైమరిపించింది. మెగాస్టార్ చిరంజీవి నటన.. అతిలోక సుందరి శ్రీదేవి అందం.. రాఘవేంద్రరావు ప్రతిభ ఈ సినిమాను అత్యున్నత స్థానంలో నిలిపింది. తెలుగులో వచ్చిన క్లాసిక్ మూవీస్ లో 'జగదేక వీరుడు అతిలోక సుందరి'కి స్థానం ఉంటుంది. 1990 మే 9న విడుదలైన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమా 30 ఏళ్లు కంప్లీట్ చేసుకోబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి శుభాభినందనలు తెలియజేసారు మెగాస్టార్ చిరంజీవి. 'అద్భుతాన్ని ఎవరూ ప్లాన్ చేసి సృష్టించ లేరు.. అవి అలా జరిగి పోతుంటాయి అంతే.. సెల్యులాయిడ్‌ పై అలాంటి అద్భుతం జరిగినట్లైతే అది శాశ్వత జ్ఞాపకాలని మరియు శాశ్వత ఆనందాన్ని మిగులుస్తుంది' అంటూ మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేసారు మెగాస్టర్.

చిరు మాట్లాడుతూ.. సినిమా అనేది సమిష్ఠి కృషి ఫలితం అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జగదేకవీరుడు అతిలోకసుందరి సాధించిన విజయం. ఈ చిత్ర విజయంలో ప్రతి ఒక్కరి కృషి దాగుంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి టెక్నీషియన్.. నటీనటులు తమ ప్రతిభను కనబరిచినందుకే జగదేకవీరుడు అతిలోకసుందరి తెలుగు సినిమా క్లాసిక్స్‌ లో ఒకటిగా నిలిచిపోయిందన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో టాప్ 25 చిత్రాల్లో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు తప్పక స్థానం ఉంటుందని చెప్పుకొచ్చారు చిరు. క్లాసిక్ అంటే జనరేషన్ గ్యాప్ లేని సినిమా. ఇది పాత తరం సినిమా.. కొత్త తరం సినిమా అనే తేడా లేకుండా అన్ని తరాలను అలరించే టైమ్ లెస్ క్లాసిక్ సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి. ఏ తరం వాళ్లు ఈ సినిమా చూసినా.. ఇప్పటికీ కొత్తగా ఉంటుంది. ఇలాంటి గొప్పి సినిమాలో నటించే అవకాశం దొరకడం నా అదృష్టం గా భావిస్తానని మెగాస్టార్ చెప్పారు.

కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మూడు తెలియని విషయాలను అభిమానులతో పంచుకోనున్నట్టు నిర్మాత వైజయంతి మూవీస్ అశ్వినీదత్ ప్రకటించారు. అందులో మొదటి స్టోరీని నాని వాయిస్ ఓవర్‌ తో వింటేజ్ వైజయంతి వీడియో విడుదల చేసారు. బ్లాక్ బస్టర్లు ఎన్నో వస్తాయి. కానీ తరాలు మారినా.. ఎవర్ గ్రీన్ ఉండే బ్లాక్ బస్టర్ సినిమా లిస్టులో ఉండే మొదటి సినిమా 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. ఓ సినిమాను చూసే విధానాన్ని మార్చిన ఈ చిత్ర కథ ఎలా పుట్టింది అంటూ నాని ఆ విషయాలను పంచుకున్నారు.