Begin typing your search above and press return to search.

జగన్ ఇచ్చిన సర్ ప్రైజ్ ను జన్మలో మరవలేను: చిరంజీవి

By:  Tupaki Desk   |   24 April 2020 3:40 PM IST
జగన్ ఇచ్చిన సర్ ప్రైజ్ ను జన్మలో మరవలేను: చిరంజీవి
X
కొన్ని నెలల క్రితం మెగా స్టార్ చిరంజీవి ఏపీలోని అమరావతికి వెళ్లి సీఎం జగన్ ను వ్యక్తిగతంగా కలిసివచ్చారు. ఆ సమావేశం పరమార్థం ఏంటనే దానిపై చాలా ఊహాగానాలు వచ్చినా చిరంజీవి కానీ - జగన్ కానీ దీనిపై స్పందించలేదు.

కాగా తాజాగా జగన్ ను ఎందుకు కలవాల్సి వచ్చిందనే దానిపై చిరంజీవి నోరు విప్పారు. చిరంజీవి మాట్లాడుతూ.. ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో నాకు దశాబ్ధాలుగా స్నేహపూర్వక సంబంధం ఉందని.. నేను కూడా సాక్షి దినపత్రిక ప్రారంభోత్సవంలో పాల్గొన్నానని’ అన్నారు. ఇక వైఎస్ భారతి ఆహ్వానం మేరకు సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డుల కార్యక్రమానికి కూడా హాజరయ్యానని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. భారతి తనను రిసీవ్ చేసుకున్న విధానం చూసి ముగ్ధుడయ్యానని.. నన్ను ఎంతో గౌరవించారని చిరంజీవి చెప్పుకొచ్చారు.

ఇక సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి తనను ఆహ్వానించారని కానీ దానికి హాజరు కాలేకపోయానని చిరంజీవి తెలిపారు. ఏపీ పోరుబిడ్డ సైరా నరసింహారెడ్డి సినిమాను తీసినప్పుడు ఏపీ నాయకులందరికీ చూపించాలని అనుకున్నానన్నారు. అందులో భాగంగానే సీఎం జగన్ కు చూపించాలని తాను జగన్ అపాయింట్ మెంట్ కోరానన్నారు. జగన్ తనను ఆఫీసుకు రమ్మనకుండా ఇంటికి ఆహ్వానించారని.. తన భార్య సురేఖతో వెళితే జన్మలో మరిచిపోలేని ఆతిథ్యాన్ని జగన్-భారతి ఇచ్చారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

ఇక జగన్ ఆహ్వానిస్తే వైసీపీలో చేరుతారా అన్న ప్రశ్నకు చిరంజీవి సమాధానమిచ్చారు. తాను రాజకీయాలు వదిలేసి సినిమాలు చేసుకుంటున్నానని.. ఏదైనా రాజకీయ అంశంపై తన అభిప్రాయాలను చెబుతున్నానని.. మూడు రాజధానులకు కూడా మద్దతిచ్చానని.. ప్రస్తుతానికి తాను రాజకీయాలుకు దూరం అని చిరంజీవి స్పష్టతనిచ్చారు.