Begin typing your search above and press return to search.

మెగా మారుతీ సినిమా అలా ఉండబోతోందా..?

By:  Tupaki Desk   |   18 July 2022 6:32 AM GMT
మెగా మారుతీ సినిమా అలా ఉండబోతోందా..?
X
'సైరా నరసింహా రెడ్డి' కోసం ఎక్కువ సమయం తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత వరుస సినిమాలను లైన్ లో పెడుతూ వస్తున్నారు. ఇప్పటికే 'ఆచార్య' చిత్రాన్ని రిలీజ్ చేయగా.. 'గాడ్ ఫాదర్' 'భోళా శంకర్' మరియు ఇంకా అధికారికంగా టైటిల్ ప్రకటించని 'వాల్తేరు వీరయ్య' సినిమాలు ఉన్నాయి. వీటి తర్వాత వెంకీ కుడుములతో ఓ మూవీ చేయనున్నారు. అదే క్రమంలో మారుతి దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చారు.

చిరంజీవి - మారుతి కాంబినేషన్ లో సినిమా రాబోతోందని చాలా కాలం క్రితమే వార్తలు వచ్చాయి. అయితే ప్రభాస్ తో దర్శకుడు ఓ ప్రాజెక్ట్ కమిట్ అవడంతో అందరి ఫోకస్ అటువైపు మళ్లింది. కానీ మెగాస్టార్ ఇటీవలే మారుతీ తో ఓ మూవీ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు స్వయంగా సభా వేదికగా ప్రకటించారు. దీంతో చిరు-మారుతి ప్రాజెక్ట్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందించనున్నారు.

మెగా మారుతీ మూవీ ఏ జోనర్ లో ఉంటుంది.. ఎలాంటి కథతో రాబోతున్నారు వంటి చర్చలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. అయితే చిరంజీవి తన కోసం పక్కా మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనింగ్ స్క్రిప్టు రెడీ చేయాలని మారుతీ కి సూచించినట్లు టాక్ వినిపిస్తోంది.

మెగాస్టార్ సినిమా అంటే హీరోయిన్ తో డ్యాన్స్ లు మరియు ఆయన మార్క్ కామెడీ మరియు ఫైట్స్ ఎక్సపెక్ట్ చేస్తారు అభిమానులు. అయితే 'ఖైదీ నెం. 150' తర్వాత చిరు మళ్లీ అలాంటి సినిమా చేయలేదు. 'సైరా నరసింహా రెడ్డి' అనేది హిస్టారికల్ మూవీ కావడంతో ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పటికీ.. ఇతర అంశాలకు అవకాశం లేకుండా పోయింది.

ఇటీవల వచ్చిన 'ఆచార్య' సినిమాలో చిరంజీవి కి అసలు హీరోయినే లేదు. కామెడీ చేయడానికి అవకాశం లేని సబ్టిల్ రోల్ లో మెగాస్టార్ కనిపించారు. రెజీనా తో ఒక స్పెషల్ సాంగ్ పెట్టారు కానీ.. చిరు నుంచి ఆశించే స్థాయిలో డ్యాన్సులు లేకపోవడంతో పెద్దగా ఆకట్టుకోలేదు. దీనికి తోడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

రాబోయే 'గాడ్ ఫాదర్' సినిమాలో కూడా ఫ్యాన్స్ కోరుకునే డ్యాన్సులు కామెడీ ఉండకపోవచ్చు. ఎందుకంటే అదొక పొలిటికల్ యాక్షన్ డ్రామా. ఇందులో చిరంజీవిది వయసు మీద పడిన పాత్ర. ఆయనకు జోడీ కూడా ఉండదు. ఇలా ఫ్యాన్స్ ఆశించే అంశాలు లేకుండానే సీనియర్ హీరో నుంచి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ ఓ పక్కా మాస్ మాసాలా కమర్షియల్ మూవీ చేయాలని భావిస్తున్నారట. ఇదే విషయాన్ని మారుతీ తో డిస్కస్ చేశారట. తన ఇమేజ్ కు తగ్గట్లుగా అభిమానులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉండేలా స్క్రిప్టు రెడీ చేయాలని సూచించారట.

ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు పెట్టింది పేరు డైరెక్టర్ మారుతీ. ఇప్పుడు చిరంజీవి ని దృష్టిలో పెట్టుకొని చిన్న మెసేజ్ తో పాటుగా పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఓ స్టోరీ లైన్ అనుకుంటున్నాడట. ఇది ఖచ్చితంగా అభిమానులను సంతృప్తి పరుస్తుందని దర్శకుడు భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మెగాస్టార్ తో సినిమా గురించి ఇటీవల మారుతి మాట్లాడుతూ.. చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తి తనతో సినిమా చేస్తానని చెప్పడం.. కొత్త ఉత్సాహాన్ని గొప్ప ఎనర్జీ ఇచ్చినట్లు ఉందని తెలిపారు. ఆయన మాటలు తనలాంటి దర్శకులకు ఎంతో ఎంకరేజ్మెంట్ మరియు స్ఫూర్తినిస్తాయని అన్నారు.

తన బలం ఏమిటి.. మెగాస్టార్ ని ఎలా చూపిస్తే బాగుంటుందనే దానిపై ఒక క్లారిటీ ఉందని.. డైరెక్టర్ గా కాకుండా ఒక ప్రేక్షకుడి కోణంలో ఆలోచిస్తానని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో మెగా మారుతీ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయి.