Begin typing your search above and press return to search.

చారిత్రక కథలతో మెగా హీరోల జోరు!

By:  Tupaki Desk   |   18 Feb 2022 11:00 PM IST
చారిత్రక కథలతో మెగా హీరోల జోరు!
X
తెరపై ఏ కథను చెప్పాలన్నా అది ఏ కాలంలో జరుగుతోంది? ఎక్కడ జరుగుతోంది? అనే విషయాలను ప్రేక్షకులకు స్పష్టంగా చెప్పాలి. అప్పుడే సాధారణ ప్రేక్షకులకు కూడా అది కనెక్ట్ అవుతుంది. లేకపోతే థియేటర్లోని ప్రేక్షకుడు కథను అనుసరించలేక .. అందుకోలేక వెనకబడిపోతాడు. ఇక చారిత్రక నేపథ్యంతో కూడిన సినిమాలను తెరకెక్కించడం అంత ఆషామాషీ విషయమేం కాదు. చరిత్రలోకి వెళితే అప్పటి వాతావరణం .. నిర్మాణాలు .. వేషభాషలు చూపించాలి. ఆనాటి జీవనవిధానాన్ని సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించాలి.

చరిత్రలోని కథా వస్తువును చూపించాలంటే అందుకు భారీ మొత్తంలో ఖర్చు అవుతుంది. చారిత్రక నేపథ్యంతో కూడిన ఒక భారీ సినిమాను తెరకెక్కించే ఖర్చుతో సాంఘిక చిత్రాలు ఓ అరడజను నిర్మించవచ్చు. అంత బడ్జెట్ తో సినిమాలు నిర్మించడానికి ధైర్యం చేయాలంటే ఆ హీరోకి అంతకు మించిన వసూళ్లను రాబట్టే సత్తా ఉండాలి. అలాంటి సత్తాను చాటుకోవడంలో మెగా హీరోలు ఒకరి తరువాత ఒకరిగా పోటీపడుతున్నారు. చిరంజీవి చేసిన 'సైరా' చారిత్రక నేపథ్యంతో కూడుకున్నదే. 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' జీవితచరిత్రగా ఈ సినిమాను సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు.

నిజానికి సొంత బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా చిరంజీవికి లాభాలను తెచ్చిపెట్టలేదు. అయినా ఒక మంచి ప్రయత్నం చేశాననే సంతృప్తిని ఆయన పొందడం విశేషం. ఇక పవన్ కల్యాణ్ వెళ్లే రూట్ చూస్తే అక్కడ చారిత్రక కథలు కనబడవు. అయినా దర్శకుడు క్రిష్ ఆయన క్రేజ్ కి తగిన విధంగా మొగల్ కాలంలో జరిగే ఒక కథను సెట్ చేశారు. ఈ కథలో దొంగ పాత్రలో పవన్ కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి బయటికి వచ్చిన పవన్ లుక్ ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెంచేసింది. ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

ఇక చరణ్ కూడా ఈ సారి చరిత్రలోకి వెళ్లాడు. 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో ఆయన అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ఈ జనరేషన్ హీరోలకి ఇలాంటి ఒక పవర్ఫుల్ పాత్ర లభించడం అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి అరుదైన అవకాశం చరణ్ కి దక్కింది. నటుడిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే పాత్ర ఇది. అలాంటి ఈ పాత్రలో చరణ్ ఎలా చెలరేగిపోయాడనేది మార్చి 25వ తేదీన తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ఆ రోజునే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఇక ఇలాంటి ఒక చారిత్రక చిత్రంలో నటించే ఛాన్స్ బన్నీకి 'రుద్రమదేవి'లో వచ్చింది. వీరనారి రుద్రమదేవి జీవితంలో 'గోన గన్నారెడ్డి' పాత్ర ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుంది. అలాంటి ఒక పవర్ఫుల్ పాత్రను దర్శకుడు గుణశేఖర్ అద్భుతంగా డిజైన్ చేశారు. తెలంగాణ యాసతో ఆ పాత్రకి రాసిన డైలాగ్స్ ఆ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఆ పాత్రకు బన్నీ జీవంపోసి ఆ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాడు. ఇలా చారిత్రక నేపథ్యంతో కూడిన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడంలో మెగా హీరోలు ఉత్సాహాన్ని చూపుతున్నారు .. అభిమానుల్లో ఉత్తేజాన్ని పెంచుతున్నారు.