Begin typing your search above and press return to search.

ఐమ్యాక్స్ దగ్గర ఫ్యాన్స్ వర్బల్ వార్

By:  Tupaki Desk   |   11 Jan 2019 3:48 PM IST
ఐమ్యాక్స్ దగ్గర ఫ్యాన్స్ వర్బల్ వార్
X
గత రెండు మూడేళ్ళ నుంచి మీడియాతో పాటు యుట్యూబ్ ఛానల్స్ పుట్టగొడుగల్లా పెరుగుతుండటంతో పోటీ వల్ల కంటెంట్ కోసం రకరకాల పాట్లు పడుతున్నారు. సాధారణంగా తెలుగు ప్రజలు సినిమా ప్రియులు కాబట్టి సహజంగానే కొత్తవి వచ్చినప్పుడు థియేటర్ల దగ్గర సందడిగా ఉంటుంది. అందులోనూ చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి శుక్రవారం ప్రసాద్ ఐమ్యాక్స్ లో వేసే 8.45 షో మీడియా ప్రతినిధులకు మూవీ లవర్స్ కు బెస్ట్ ఆప్షన్ గా నిలిచిపోయింది.

దీన్ని అవకాశంగా తీసుకుని షో వదలటం ఆలస్యం బయటికి వస్తున్న జనం మొహం మీదకు మైకులు తీసుకుని వెళ్లి సినిమా రివ్యూలు అడిగే బాపతు పదుల నుంచి ఇప్పుడు వందల్లోకి చేరుకుంది. ఇప్పుడు ఇది ఫాన్స్ వార్ కు కూడా దారి తీస్తోంది. ఇవాళ వినయ విధేయ రామ విడుదల సందర్భంగా జరిగిన అభిప్రాయం సేకరణలో ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం జరగడం విశేషం. ఈ మధ్యకాలంలో నాగబాబు బాలయ్యను టార్గెట్ గా పెట్టుకుని చేసిన ఫేస్ బుక్ రచ్చ తెలిసిందే. దాని మీద ఇరు అభిమానులు మాటల దాడి గట్టిగానే చేసుకున్నారు. ట్రాలింగ్ కూడా భారీగా జరిగింది. ఇప్పుడు ఇది కాస్తా ఐమ్యాక్స్ కు కూడా పాకింది.

కొందరు అభిమానులు సినిమా గురించి రివ్యూ ఇస్తూ చరణ్ లాగా చిరంజీవి లాగా అవతలి హీరో చేసి చూపమని ఇంకో అభిమానిని ఎత్తి చూపుతూ అదే పనిగా ప్రస్తావించడం కాస్త వేడిని పెంచేలాగా అనిపించింది. ఇది కనక మెల్లగా వారం వారం మొదలవుతూ పోతే అభిమానులు గొడవలకు దిగినా ఆశ్చర్యం లేదు. గతంలో రవితేజ నేల టికెట్టు విడుదల రోజు సరిగ్గా ఇదే తరహాలో ఓ ప్రేక్షకుడికి మరో యుట్యూబ్ యాంకర్ కి పెద్ద గొడవ జరిగి అల్లరి పెద్దదైంది. ఇప్పుడు ఇలా పర్సనల్ గా హీరోలను టార్గెట్ చేసి కామెంట్లు చేయడం మొదలుపెడితే అలాంటి పరిణామాలు రిపీట్ కావడం ఖాయం.