Begin typing your search above and press return to search.

మెగాస్టార్ వ్యాఖ్య‌ల‌ పై ఫిలింఛాంబ‌ర్ రివ్యూ భేటి!

By:  Tupaki Desk   |   6 Feb 2022 1:31 PM GMT
మెగాస్టార్ వ్యాఖ్య‌ల‌ పై ఫిలింఛాంబ‌ర్ రివ్యూ భేటి!
X
సినిమా టిక్కెట్స్ వివాదం స‌హా ప‌లు అంశాల‌పై ఇటీవ‌లే మెగాస్టార్ చిరంజీవి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. భేటి అనంత‌రం మెగాస్టార్ హామీతో ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన‌ట్లు క‌నిపించింది. ముఖ్య‌మంత్రి సినిమా వాళ్ల‌పై ఎంతో సానుకూలంగా ఉన్నార‌ని..అంతా తాము అనుకున్న‌ట్లే జ‌రుగుతుంద‌ని చిరంజీవి మీడియా ముఖంగా వెల్ల‌డించ‌డంతో ఇండ‌స్ర్టీ శాంతించింది.

అంత‌కు ముందు మంత్రి పేర్ని నానితో జ‌రిగిన స‌మావేశాల‌పై అసంతృప్తి నేప‌థ్యంలో జ‌రిగిన మెగాస్టార్-ముఖ్య‌మంత్రి భేటి సానుకూలంగా ఉండ‌టం..అటుపై తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ప్ర‌తినిధులు ఇండ‌స్ర్టీకి అంతా మంచే జ‌రుగుతుంద‌ని ఉద్ఘాటించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ నేప‌థ్యంలో మ‌రోసారి సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు టాలీవుడ్ లో కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. చిరు-జ‌గ‌న్ ల భేటి త‌ర్వాత జ‌రుగుతోన్న‌ టాలీవుడ్ స‌మావేశం ఇది. తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఆధ్వ‌ర్యంలో ప‌రిశ్ర‌మ‌లోని అన్ని సంఘాల ప్ర‌తినిధులు ఈ స‌మావేశంలో పాల్గొంటారు. చిరంజీవి ముఖ్య‌మంత్రి వ‌ద్ద ప్ర‌స్తావించిన అంశాల‌పై చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

అంటే సినిమా టిక్కెట్ ధ‌ర‌ల విష‌యంలో ప్ర‌భుత్వం ఇచ్చిన పాత జీవోని వెన‌క్కి తీసుకోవ‌డం...మూసివేసిన థియేట‌ర్ల‌కు తాత్క‌లికంగా అనుమ‌తులు ఇచ్చినా..వాటికి పూర్తి ప‌రిష్కారం..అలాగే థియేట‌ర్ల నిర్వ‌హ‌ణ భారం స‌హా ప‌లు అంశాలు చ‌ర్చ‌కు రానున్న‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌భుత్వం ఎలాంటి విధి విధానాలతో ముందుకు వ‌స్తుంది? వాటికి సంబంధించిన కార్య‌చ‌ర‌ణ వంటి అంశాల‌పై చాంబ‌ర్ ప్ర‌తినిధులు స‌మావేశం అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధానంగా టిక్కెట్ ధ‌ర‌లు పెంచుకునే వెసులుబాటు క‌ల్పిస్తే అన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దొరికిన‌ట్లే న‌ని ఛాంబ‌ర్ ప్ర‌తినిధులు భావిస్తున్నారు. మ‌రి ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్న‌ది వేచి చూడాలి. ఈనెల‌లోనే అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ రెడీ అవుతున్నాయి. ఈ లోపే ప్ర‌భుత్వం నిర్ణ‌యం వెల్ల‌డించే అవ‌కాశం ఉంది.