Begin typing your search above and press return to search.

5 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీకి సిద్దమైన పవన్‌ హీరోయిన్‌

By:  Tupaki Desk   |   16 April 2021 4:30 AM GMT
5 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీకి సిద్దమైన పవన్‌ హీరోయిన్‌
X
ముద్దుగా బొద్దుగా ఉండి తెలుగు ప్రేక్షకులను కొన్ని సినిమాలతో అలరించి ఆకట్టుకున్న ముద్దుగుమ్మ మీరా జాస్మిన్‌ కు లక్‌ కలిసి రాకపోవడంతో ఆఫర్లు అంతగా రాలేదు. తెలుగులో ఈమె 2013 తర్వాత మళ్లీ సినిమాల్లో నటించిందే లేదు. తెలుగులో ఆఫర్లు కనుమరుగవ్వడంతో ఇతర భాషల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ వచ్చింది. అక్కడ కూడా ఆఫర్లు తగ్గడంతో దుబాయికి చెందిన సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగితో 2014లో వివాహం అయ్యింది. పెళ్లి తర్వాత కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించిన మీరా జాస్మిన్‌ సినిమాల్లో మళ్లీ బిజీ అవ్వలేక పోయింది. వైవాహిక జీవితంలో విభేదాల కారణంగా దుబాయి నుండి ఇండియాకు షిప్ట్‌ అయిన మీరా జాస్మిన్‌ మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వాలని తీవ్రంగా ప్రయత్నించింది. ఎట్టకేలకు ఆమె ప్రయత్నం ఫలించింది.

మీరా జాస్మిన్‌ సినిమాలకు పూర్తిగా దూరం అయ్యి దాదాపుగా అయిదు సంవత్సరాలు అయ్యింది. ఈ అమ్మడు ఈ అయిదు సంవత్సరాలు కూడా కనీసం మొహానికి మేకప్ వేసుకోలేదు. కెమెరా ముందుకు అయిదు సంవత్సరాలు రాకుండా ఉంటే ఖచ్చితంగా ప్రేక్షకులు మర్చి పోవడం ఖాయం. కాని మీరా జాస్మిన్‌ నటించిన సినిమాలు మరియు ఆమె పోషించిన పాత్రల కారణంగా ఆమె ను జనాలు ఇంకా కూడా గుర్తు పెట్టుకున్నారు. కనుక ఆమె కు మళ్లీ రీ ఎంట్రీ లభించింది. మలయాళం మూవీ తో మీరా జాస్మిన్‌ రీ ఎంట్రీకి సిద్దం అవుతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

మలయాళ దర్శకుడు సత్యన్‌ అంతికాడ్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో మీరా జాస్మిన్‌ నటించబోతుంది. ప్రముఖ నటుడు జయరామ్‌ మరియు మీరా జాస్మిన్‌ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా రూపొందబోతుంది. కాన్సెప్ట్‌ ఓరియంటెడ్ మూవీ అయిన ఈ ప్రాజెక్ట్‌ పై మీరా జాస్మిన్‌ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో మళ్లీ మలయాళంతో పాటు ఇతర భాషల్లో బిజీ అవ్వాలని ఆశ పడుతోంది.

హీరోయిన్ గా కాకున్నా క్యారెక్టర్ ఆర్టిస్టుగా అయినా కొనసాగాలని ఈమె ఆశ పడుతోంది. ఏ భాష నుండి ఆఫర్‌ వచ్చినా కూడా కాదనకుండా సినిమాను చేయాలని భావిస్తుంది. ప్రస్తుతం ఈమె రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ముగింపు దశకు చేరుకున్నాయి. త్వరలోనే సినిమాను పట్టాలెక్కించబోతున్నట్లుగా దర్శకుడు సత్యన్‌ ప్రకటించాడు. జాతీయ అవార్డు దక్కించుకున్న మీరా జాస్మిన్‌ మరోసారి ఈ సినిమాతో తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.