Begin typing your search above and press return to search.

జక్కన్న బ్రాండ్: 'మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లర్' కి ఆ మాత్రం ఎలివేషన్స్ అవసరమే..!

By:  Tupaki Desk   |   15 July 2021 3:09 PM GMT
జక్కన్న బ్రాండ్: మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లర్ కి ఆ మాత్రం ఎలివేషన్స్ అవసరమే..!
X
'బాహుబలి' తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లిన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. వెండితెరపై విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తూ మాస్టర్ స్టొరీ టెల్లర్ అనిపించుకున్నారు. ప్రస్తుతం ఇండియాలో నెం.1 డైరెక్టర్ రాజమౌళి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో రాజమౌళి అంటే ఒక బ్రాండ్ లా మారిపోయింది. జక్కన్న బ్రాండ్ చూసే కథ ఏంటని తెలియకుండానే స్టార్ హీరోలు సినిమా చేయడానికి రెడీ అవుతారు.. ఎంత డబ్బు అయినా పెట్టడానికి సిద్ధ పడుతుంటారు. ఆయన నేమ్ తోనే ఆ సినిమాని కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ చేస్తుంటారు. ప్రస్తుతం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియన్ సినిమా 'ఆర్.ఆర్.ఆర్' విషయంలోనూ అదే జరుగుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోగా తెరకెక్కనున్న సినిమా 'ఆర్ ఆర్ ఆర్'. విప్లవ వీరులు కొమురం భీమ్ - అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని ఫిక్షనల్ పీరియాడికల్ మూవీగా ఈ చిత్రాన్ని రాజమౌళి రూపొందిస్తున్నారు. డివీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు - హీరోల ఇంట్రో టీజర్స్ విశేష స్పందన తెచ్చుకుంటే.. లేటెస్టుగా వచ్చిన 'రోర్ ఆఫ్ RRR' అంచనాలు ఆకాశాన్ని అంటేలా చేసింది. దీనికి ముఖ్య కారణం దర్శకధీరుడు అని చెప్పాలి.

ఒక నిమిషం 48 సెకన్ల పాటు ఉన్న 'ఆర్ ఆర్ ఆర్ గర్జన' మేకింగ్ వీడియోలో సినిమా గురించి.. పాత్రల గురించి.. సాంకేతిక నిపుణుల గురించి.. ఇతర సిబ్బంది గురించి.. వాళ్లు పడిన కష్టం గురించి.. ఇలా ప్రతీదీ చెప్పే ప్రయత్నం చేశారు. భారీ యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణకు కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ - బ్లాజ్ ర్యాప్ తోడై ఈ వీడియోని మరో స్థాయికి తీసుకెళ్ళాయి. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే భారీ స్పందన తెచ్చుకున్న "రోర్ ఆఫ్ ఆర్ ఆర్ ఆర్" ప్రస్తుతం 4 మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్ లో టాప్ పొజిషన్ లో ఉంది.

ఈ వీడియోలో స్టార్ హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్.. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గన్ - అలియా భట్.. హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్ - రే స్టీవెన్‌ సన్‌ - అలిసన్‌ డూడి.. టాలెంటెడ్ నటుడు సముద్రఖని - శ్రియ.. ఇలా ఎందరు ఉన్నా జక్కన్న మాత్రమే ఇందులో హైలైట్ అయ్యారు. మాస్టర్ స్టోరీ టెల్లర్ అంటూ దర్శకుడు రాజమౌళి ని చూపిస్తూ ప్రారంభమైన ఈ వీడియోలో.. చివరి దాకా ఆయనకే ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చారు. కెప్టెన్ ఆఫ్ ది షిప్ గా 24 క్రాఫ్ట్స్ ని సమన్వయం చేసుకుంటూ టీమ్ ని ఎలా ముందుకు నడిపించాడో ఇందులో చూపించారు.

రాజమౌళి మీద ఫుల్ ఫోకస్ ఉండటంతో 'ఆర్ ఆర్ ఆర్' హీరోలిద్దరూ సైడ్ అయిపోవాల్సి వచ్చిందనే కామెంట్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. తారక్ - చరణ్ ఫ్యాన్స్ సైతం.. ఇది 'డైరెక్టర్ AV' మాదిరిగా ఉందని అంటుండటం గమనార్హం. ఎన్ని కామెంట్స్ వచ్చినా జక్కన్న ఈ ఎలివేషన్స్ కు అర్హుడనే చెప్పాలి. ఎందుకంటే RRR హీరోలిద్దరి కంటే ఈ సినిమా రాజమౌళి బ్రాండ్ తోనే ఎక్కువ మార్కెట్ అవుతుంది కాబట్టి. ఎన్టీఆర్ - చరణ్ ఇద్దరికీ కూడా ఇదే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. టాలీవుడ్ వరకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది కానీ.. ఉత్తరాదిలో మాత్రం రాజమౌళి పేరు చూసే జనాలు థియేటర్లకు వస్తారనడంలో అతిశయోక్తి లేదు.

నిజానికి మేకింగ్ వీడియోలో తెర వెనుక ఉండే వారి కష్టం కనిపిస్తే.. సినిమా విడుదల అయ్యాక తెరపై కనిపించే వారి శ్రమ తెలుస్తుంది. ఇప్పుడు 'రోర్ ఆఫ్ RRR' లో రాజమౌళి ఎక్కువగా ఫోకస్ అవడానికి కారణం కూడా అదే. అన్నిటినీ దగ్గర ఉండి చూసుకుంటూ.. ప్రతీ ఫ్రేమ్ పర్ఫెక్ట్ గా ఉండాలని జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టే.. మేకింగ్ లో ప్రతి చోట దర్శక ధీరుడు కనిపిస్తారు. ఏదేమైనా 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో మరో వెండితెర అద్భుతం చూడబోతున్నామని ఈ వీడియోతో రాజమౌళి శాంపిల్ చూపించారని చెప్పవచ్చు. ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తోందో చూడాలంటే అక్టోబర్ 13 వరకు వేచి చూడాల్సిందే.