Begin typing your search above and press return to search.

మెగా బ్రదర్ గా మాస్ రాజా..?

By:  Tupaki Desk   |   12 Nov 2021 6:40 AM GMT
మెగా బ్రదర్ గా మాస్ రాజా..?
X
మెగాస్టార్ చిరంజీవి - డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్ లో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. #MEGA154 అనే వర్కింగ్ టైటిల్ తో ఇటీవలే ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలో పూనకలు లోడింగ్ అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో నటించే ఇతర నటీనటుల వివరాలేమీ ప్రకటించలేదు.

కాకపోతే మెగాస్టార్ 154వ చిత్రంలో చిరంజీవి తమ్ముడిగా రియల్ లైఫ్ సోదరుడు పవన్ కళ్యాణ్ నటించనున్నారని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో పవన్ కాకుండా మరో హీరో నటించనున్నాడని అంటున్నారు. అది మరెవరో కాదు మాస్ మహరాజ్ రవితేజ. ఇందులో కీలకమైన పాత్ర కోసం ఇప్పుడు మేకర్స్ రవితేజ తో చర్చలు జరుపుతున్నట్లు టాక్ నడుస్తోంది.

చిరంజీవి కి రవితేజ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. 2000లో వచ్చిన 'అన్నయ్య' చిత్రంలో చిరు సోదరుడిగా కూడా నటించారు. ఇన్నేళ్లకు వీరిద్దరూ అన్నదమ్ములుగా నటించే అవకాశం ఉందని అంటున్నారు. దర్శకుడు బాబీ కి మాస్ రాజాకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. 'పవర్' సినిమాతో బాబీ ని డైరెక్టర్ ని చేసింది రవితేజనే. ఇప్పుడు రవితేజ అర డజను ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. మరి చిరు - బాబీ ల కోసం రవితేజ మెగా ప్రాజెక్ట్ లో భాగం అవుతారో లేదో చూడాలి.

కాగా, వైజాగ్ కోస్టల్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా #Mega154 చిత్రాన్ని రూపొందించనున్నారు. మాస్ మూల విరాట్ అంటూ రిలీజ్ చేసిన చిరంజీవి ఫస్ట్ లుక్ మెగా ఫ్యాన్స్ ని విశేషంగా అలరించింది.

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ మీద నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. జీకే మోహన్ సినిమాటోగ్రఫీ అందిస్తారు. త్వరలోనే నటీనటులు ఇతర సాంకేతిక నిపుణులు వివరాలు వెల్లడి కానున్నాయి.