Begin typing your search above and press return to search.

'ఖిలాడి' తో మాస్ మహారాజా బాలీవుడ్ ఎంట్రీ..!

By:  Tupaki Desk   |   5 Feb 2022 6:27 AM GMT
ఖిలాడి తో మాస్ మహారాజా బాలీవుడ్ ఎంట్రీ..!
X
మాస్ మహారాజా రవితేజ హీరోగా 'రాక్షసుడు' ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ''ఖిలాడి''. 'ప్లే స్మార్ట్' అనేది దీనికి ట్యాగ్ లైన్. జయంతీలాల్‌ గడ (పెన్ స్టూడియోస్) సమర్పణలో హవీష్‌ ప్రొడక్షన్స్‌ - ఎ స్టూడియోస్‌ బ్యానర్స్ పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. 2022 ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేయనున్నారు. అయితే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ని అదే రోజున హిందీ భాషలో కూడా రిలీజ్ చేయబోతున్నారు.

'ఖిలాడీ' హిందీ వెర్షన్ ను ఫిబ్రవరి 11న ఉత్తరాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయంతిలాల్ గడా ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేయడంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ''కాలం మారింది. ఇప్పుడు ఒరిజినల్ కంటెంట్‌ కు డిమాండ్ ఉంది. ప్రేక్షకులు సినిమాని దాని స్వచ్ఛమైన రూపంలో చూడటానికి ఇష్టపడతారు. రవితేజకు భారతదేశం అంతటా ఉన్న పాపులారిటీతో పాటు 'ఖిలాడీ' కంటెంట్ చాలా ఎంటెర్టైనింగ్ గా ఉంది. అందుకే ఈ సినిమాని హిందీ భాషలో థియేట్రికల్ రిలీజ్ చేయాలని పెన్ స్టూడియోస్ భావించింది'' అని నిర్మాత పేర్కొన్నారు.

టాలీవుడ్ లో క్రేజీ హీరోగా రాణిస్తున్న రవితేజ.. ''ఖిలాడీ'' డబ్బింగ్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నారు. ఇకపై మాస్ రాజా చేసే ప్రతీ సినిమా హిందీలో కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అంతకంటే ముందే ఇప్పుడు ఖిలాడీగా నార్త్ ఆడియన్స్ ని పలకరించబోతున్నారు. తెలుగుతో పాటుగా హిందీలో రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. నార్త్ టెరిటరీలో ఈ చిత్రాన్ని పెన్ మరుధర్ డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు.

కాగా, ''ఖిలాడి'' సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారని ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ని బట్టి అర్థం అవుతోంది. స్పెషల్ పోస్టర్స్ - టీజర్ - సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రవితేజ సరసన మీనాక్షి చౌదరి మరియు డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్ - ఉన్ని ముకుందన్ - అనసూయ భరద్వాజ్ - ముఖేష్ రుషి - వెన్నెల కిషోర్ - రావు రమేష్ - మురళీ శర్మ - నికితిన్ ధీర్ - ఠాకూర్ అనూప్ సింగ్ - సచిన్ ఖేడేకర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. సుజిత్ వాసుదేవ్‌ మరియు జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గాంధీ న‌డికుడిక‌ర్‌ ఆర్ట్ డైరెక్టర్ గా.. అమ‌ర్ రెడ్డి ఎడిట‌ర్‌ గా వర్క్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సోద‌రుడు సాగ‌ర్‌ మరియు శ్రీ‌కాంత్ విస్సా కలసి డైలాగ్స్ రాసారు. ప్రముఖ ఫైట్ మాస్టర్స్ ద్వయం రామ్‌-ల‌క్ష్మ‌ణ్ మరియు అన్బు-అరివు ఇందులో యాక్ష‌న్‌ కొరియోగ్ర‌ఫీ చేసారు. గతేడాది ప్రారంభంలో 'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ.. ఈసారి 'ఖిలాడీ' మూవీతో సేమ్ రిజల్ట్ ని రిపీట్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.