Begin typing your search above and press return to search.

మార్చి టు మే... ఇక్క‌డ థియేట‌ర్లు ఖాలీలేవ‌మ్మా!

By:  Tupaki Desk   |   18 Feb 2022 10:30 AM GMT
మార్చి టు మే... ఇక్క‌డ థియేట‌ర్లు ఖాలీలేవ‌మ్మా!
X
క‌రోనా కార‌ణంగా చాలా వ‌ర‌కు బిగ్ మూవీస్ రిలీజ్ లు గంద‌ర‌గోళంలో ప‌డిపోయిన విష‌యం తెలిసిందే. ఫ‌స్ట్ వేవ్ మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి థ‌ర్డ్ వేవ్ వ‌ర‌కు వ‌రుస‌గా భారీ చిత్రాలు వాయిదా ప‌డుతూనే వున్నాయి. మ‌ధ్య‌లో కొన్ని థియేట‌ర్ల‌లో సంద‌డి చేసినా అంతుకు మించిన చిత్రాలు మార్చి నుంచి బాక్సాఫీస్ పై దండ‌యాత్ర‌కు సిద్ధ‌మ‌య్యాయి. డిసెంబ‌ర్ లో నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన `అఖండ‌` ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా అఖండ‌మైన విజ‌యాన్ని సాధించి బాక్సాణీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది.

ఇక ఈ మూవీ త‌రువాత వ‌చ్చిన చిత్రం `పుష్ప‌`. బ‌న్నీ - సుకుమార్ ల క‌ల‌యిక‌లో థియేట‌ర్ల‌లో సంద‌డి చేసిన‌ ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో ఊహ‌కంద‌ని రితిలో వ‌ర‌ల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ప‌క్కా మాసీవ్ స్టోరీగా రూర‌ల్ క‌థ‌తో రూపొంది ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌ల్ గా మారింది. బ‌న్నీ కెరీర్‌లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన చిత్రంగా నిల‌వ‌డ‌మే కాకుండా త‌న‌ని పాన్ ఇండియా స్టార్ గా నిల‌బెట్టింది. దీంతో ఇంత వ‌ర‌కు రిలీజ్ కు అనువైన స‌మ‌యం కోసం ఎదురుచూస్తున్న భారీ చిత్రాల‌కు ధైర్యం ఏర్ప‌డింది. ఇదే ఊపులో నేచుర‌ల్ స్టార్ నాని నటించిన `శ్యామ్ సింగ‌రాయ్‌` గ‌త ఏడాది డిసెంబ‌ర్ లోనే థియేట‌ర్ల‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఊహించిన‌ట్టుగానే భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

ఇలా అఖండ‌.. పుష్ప ఇచ్చిన ప్రోత్సాహంతో మ‌రిన్ని భారీ చిత్రాలు రిలీజ్ కోసం మార్చి టు జూన్ అంతా ఖ‌ర్చీఫ్ లు వేసేశారు. ఫిబ్ర‌వ‌రి నుంచే భారీ చిత్రాల హంగామా మొద‌లు కాబోతోంది. 24న త‌మిళ స్టార్ త‌ల అజిత్ న‌టించిన యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ `వ‌లిమై` రిలీజ్ కాబోతోంది. ఈ సారి ఈ మూవీతో పాన్ ఇండియాని టార్గెట్ చేశాడు అజిత్‌. త‌మిళ - తెలుగు - క‌న్న‌డ - హిందీ భాష‌ల్లో ఏక కాలంలో ఈ మూవీ రిలీజ్ కానుంది. సూప‌ర్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హెచ్ వినోద్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ స్టైలిష్ విల‌న్ కోలీవుడ్ కు ప‌రిచ‌యం అవుతున్న చిత్ర‌మిది కావ‌డం.. ట్రైల‌ర్ లో చూపించిన రేసింగ్ యాక్ష‌న్ గ‌ట్టాలు సినిమాపై భారీ హైప్ ని క్రియేట్ చేశాయి.

ఇక ఫిబ్ర‌వ‌రి 25 మోస్ట్ వాంటెడ్ హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రేజీ మూవీ `భీమ్లా నాయ‌క్‌` థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తోంది. గ‌త కొన్ని రోజులుగా రిలీజ్ విష‌యంపై గంద‌ర‌గోళం నెల‌కొన్న ఈ మూవీ స‌డ‌న్ గా బ‌రిలోకి దిగింది. ప‌వ‌న్ న‌టించి మ‌రో మాసీవ్ మూవీ కావ‌డం, ఇందులో రానా - నిత్యామీన‌న్ న‌టించ‌డం.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించ‌డ‌మే కాకుండా అన్నీ తానై తెర‌వెన‌క వుండి వ్య‌వ‌హ‌రించ‌డంతో ఈ మూవీ టాక్ ఆఫ్ ద ఇండ‌స్ట్రీగా మారింది. అంతే కాకుండా `గ‌బ్బ‌ర్ సింగ్‌` త‌రువాత అంత‌కు మించిన మాసీవ్ పాత్ర‌లో ప‌వ‌న్ న‌టించిన సినిమా కావ‌డం.. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌.. థ‌మ‌న్ అందించిన సాంగ్స్ ప్రేక్ష‌కుల్లో ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ని సెట్ చేశాయి. ఈ సినిమాతో బాక్సాఫీస్ వ‌ద్ద ఓ రేంజ్ లో మోత మోగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

`భీమ్లా ఎంట్రీ ఇచ్చిన రోజే బాలీవుడ్ మూవీ `గంగూబాయి క‌తియావాడీ` విడుద‌ల‌వుతోంది. అలియా భ‌ట్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌డం.. గంగూబాయి జీవిత క‌థ ఆధారంగా చేసిన సినిమా కావ‌డం.. సంజ‌య్ లీలా భ‌న్సాలీ నుంచి `ప‌ద్మావ‌తి` త‌రువాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. అయితే దీని ప్ర‌భావం తెలుగులో త‌క్కువ‌గానే వుండే అవ‌కాశం వుంది. ఎందుకంటే భీమ్లా హంగామా వుంటుంది కాబ‌ట్టి. భీమ్లా స‌డ‌న్ ఎంట్రీతో షాక్ లోకి వెళ్లిన `గ‌ని` టీమ్ ఈ మూవీని మార్చి 4 కు మార్చే అవ‌కావాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. వ‌రుణ్ తేజ్ బాక్స‌ర్ గా న‌టించిన ఈ చిత్రంలో క‌న్న‌డ స్టార్ ఉపేంద్ర‌.. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి.. బాలీవుడ్ హీరోయిన్ స‌యీ మంజ్రేక‌ర్ కీల‌క పాత్రల్లో న‌టిస్తుండ‌టంతో దీనిపై మంచి అంచ‌నాలే వున్నాయి. ఇదే రోజు శ‌ర్వానంద్ `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు`తో రావ‌డానికి రెడీ అయ్యాడు.. ఈ మూవీ రిలీజ్ ఏప్రిల్ 8కి మారుతుందా లేక `భీమ్లా వున్నా స‌రే వెన‌క్కి త‌గ్గేదేలే అని 25నే థియేట‌ర్ల‌లోకి వ‌స్తాడా అన్న‌ది చూడాలి.

ఇక ఇదే రోజు విశ్వ‌క్ సేన్ న‌టించిన `అశోకవనంలో అర్జున కల్యాణం` విడుద‌ల కాబోతోంది. కొత్త త‌ర‌హా క‌థ‌తో ఈ మూవీని రూపొందించారు. విశ్వ‌క్ మేకోవ‌ర్‌, క‌థ‌, క‌థ‌నాలు కొత్త‌గా వుండ‌టం ఈ మూవీకి ప్ల‌స్‌గా మార‌బోతున్నాయి. తెలుగు సినిమాల‌తో పాటు డ‌బ్బింగ్ సినిమాలు కూడా పోటీప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ రేసులో సూర్య న‌టించిన ఈటీ (ఎంతార్కుమ్ తునిధ‌వాన్‌` మార్చి 10న విడుద‌ల కాబోతోంది. ఈ సారి ఈ మూవీతో పాన్ ఇండియా ని టార్గెట్ చేశాడు సూర్య‌. ఈ మూవీ త‌మిళ - తెలుగు - క‌న్న‌డ - మ‌ల‌యాళ - హిందీ భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. ఆకాశం నీ హ‌ద్దురా.. జై భీమ్ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ ల‌తో ఫుల్ జోస్ లో వున్న సూర్య ఈమూవీతోనూ అదే మ్యాజిక్ ని రిపీట్ చేయ‌డం గ్యారెంటీ అంటున్నారు.

ఇక మార్చి 11న గ‌త మూడేళ్లుగా ప్ర‌భాస్ ఫ్యాన్స్‌.. సినీ ల‌వ‌ర్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న `రాధేశ్యామ్‌` వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుద‌ల కాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా, కీల‌క పాత్ర‌ల్లో `మైనే ప్యార్ కియా` ఫేమ్ భాగ్య‌శ్రీ, రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు న‌టించారు. డెస్టినీ విగ‌డ‌దీసిన ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో `టైటానిక్‌` చిత్రాన్ని మరోసారి ఇండియ‌న్ స్క్నీన్ పై స‌రికొత్త‌గా ఆవిష్క‌రించారా అనే స్థాయిలో ఈ మూవీని రూపొందించ‌న‌ట్టుగా ట్రైల‌ర్ స్ప‌ష్టం చేసింది. దీంతో ఈ మూవీపై అంచ‌నాలు స్కై హైకి చేరుకున్నాయి. ఇదే జోరులో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ `ఆర్ ఆర్ ఆర్‌` ప్ర‌పంచ సినిమాని అబ్బుర‌ప‌ర‌డానికి మార్చి 25న అత్య‌ధిక థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతోంది. తొలిసారి ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన బిగ్ మ‌ల్టీస్టార‌ర్ మూవీ కావ‌డం.. చ‌రిత్ర‌లో హీరోలుగా నిలిచిపోయిన అల్లూరి సీతారామ‌రాజు.. కొమ‌రం భీం ల క‌థ‌కు ఫాంట‌సీ అంశాల‌ని జోడించి మ‌రింత పవ‌ర్ ఫుల్ గా తెర‌కెక్కించిన మూవీ ఇది. ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా అని యావ‌త్ ప్ర‌పంచ వ్యాప్తంగా వున్న సినీ ల‌వ‌ర్స్ ఎదురుచూస్తున్నారు.

ఇక ఏప్రిల్ లోనూ బిగ్ మూవీస్ బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ పై దండ యాత్ర‌కు సిద్ధ‌మ‌య్యాయి. ఇందులో ప్ర‌ధానంగా నిలిచిన క్రేజీ చిత్రం `కేజీఎఫ్ 2` పై నే అంద‌రి క‌ళ్లున్నాయి. పార్ట్ 1తో ఊహించ‌ని విధింగా షాకిచ్చిన ప్ర‌శాంత్ నీల్ పార్ట్ 2 తో మ‌రో రేంజ్ ఎక్స్‌పీరియ‌న్స్ ని ఆడియ‌న్స్ కి అందించ‌బోతున్నాడ‌ని ఈ మూవీ టీజ‌ర్ తోనే హింట్ ఇచ్చేశాడు. రాఖీభాయ్ య‌ష్ న‌టించిన ఈ మూవీ అత‌ని కెరీర్ ని మ‌రో లెవెల్ కి చేర్చ‌డం ఖాయం. ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌నాల‌కు సిద్ధం అవుతోంది. ఇదే నెల‌లో మాస్ మ‌హారాజా ర‌వితేజ `రామారావు ఆన్ డ్యూటీ` అంటూ సంద‌డి చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ఈ మూవీ మార్చి 25నే వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించినా ఏప్రిల్ 15కు మారే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.

ఇక బాస్ మెగాస్టార్ కూడా డ్యూటీ ఎక్క‌బోతున్నారు. ఆయ‌న న‌టించిన `ఆచార్య‌` ఏప్రిల్ 29న రాబోతోంది. కొర‌టాల శివ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో చిరుతో క‌లిసి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతుండ‌టం ఈ సినిమా ప్ర‌త్యేక‌త‌. పూజా హెగ్డే, కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ లుగా న‌టించారు. భారీ స్థాయిలో హిందీలోనూ ఈ మూవీని విడుద‌ల చేస్తున్నారు. తండ్రీ కొడుకులు క‌లిసి న‌టించిన సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై అభిమానుల్లో.. సినీ ల‌వ‌ర్స్ లో మంచి ఎక్స్ పెక్టేష‌న్స్ వున్నాయి. గ‌త ఏడాది ట‌క్ గ‌జ‌దీష్‌.. శ్యామ్ సింగ‌రాయ్ చిత్రాల‌తో సంద‌డి చేసిన నేచుర‌ల్ స్టార్ నాని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి హంగామా చేయ‌బోతున్నాడు. త‌ను న‌టించిన `అంటే సుంద‌రానికి` మే 6న రాబోతోంద‌ని తెలుస్తోంది. ఈ డేట్ ని అధికారికంగా ప్ర‌క‌టించాల్సి వుంది. అడ‌ల్ట్ కామెడీ నేప‌థ్యంలో రానున్న ఈ మూవీ పై నాని భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు.

ఇదే నెల‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన `స‌ర్కారు వారి పాట‌` రాబోతోంది. ప‌ర‌శురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని మైత్రీ - 14 ప్ల‌స్ రీల్స్ - జీఎంబీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలో `పోకిరి` వైబ్స్ నిక‌నిపిస్తున్నాయి. చాలా కాలం త‌రువాత మ‌హేష్ మేకోవ‌ర్ కూడా కొత్త‌గా వుండ‌టం.. `పోకిరి` స్టైల్ ని గుర్తు చేయ‌డంతో ఈ మూవీపై అంచ‌నాలు భారీగానే ఏర్ప‌డ్డాయి. అందుకు త‌గ్గ‌ట్టే టీజ‌ర్ వుండ‌టంతో ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. ఈ మూవీ మే 12న వ‌ర‌ల్డ్ వైడ్ గా థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. ఇక ఇదే నెల‌లో గోపీచంద్ - మారుతిల `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` రిలీజ్ కు రెడీ అయింది. మే 20న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. గ‌త కొంత కాలంగా స‌రైన హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ ఈ మూవీతో ఎలాగైన స‌క్సెస్ ని సొంతం చేసుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో వున్నారు.

ఈ సినిమా త‌రువాత మే 27న అడివి శేష్ న‌టించిన `మేజ‌ర్‌` రాబోతోంది. ముంబై ఎటాక్స్ సంద‌ర్భంగా టెర్ర‌రిస్టుల‌తో వీరోచితంగా పోరాడిన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ లైఫ్ స్టోరీ ఆధారంగా సోనీ పిక్చ‌ర్స్ తో క‌లిసి సూప‌ర్ స్టార్ మ‌హేష్ నిర్మించిన చిత్ర‌మిది. దీంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. ఇదే రోజు `ఎఫ్ 3` వ‌చ్చేస్తోంది. విక్ట‌రీ వెంక‌టేష్ ,వ‌రుణ్ తేజ్ క‌లిసి న‌టించిన ఈ మూవీ `ఎఫ్ 2` కు సీక్వెల్ గా వ‌స్తోంది. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా వ‌స్తున్నీ మూవీపై కూడా మంచి బ‌జ్ వుంది. ఇదే రోజు యంగ్ హీరో పంజా వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన `రంగ రంగ వైభ‌వంగా` రాబోతోంది. కేతిక‌శ‌ర్మ హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రంతో `ఆదిత్య‌వ‌ర్మ‌` ఫేమ్ గిరీషాయ ద‌ర్శ‌కుడిగా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. ఇలా... మార్చి టు మే వ‌ర‌కు అంతా ఖ‌ర్చీఫ్ లు వేసేశారు.. ఈ భారీ లైన‌ప్ న‌ప్ ను చూసిన వారంతా మార్చి టు మే...ఇక్క‌డ థియేట‌ర్లు ఖాలీలేవ‌మ్మా! అంటున్నారు.