Begin typing your search above and press return to search.

రకుల్ ఆ సినిమా వల్ల రోడ్ మీదకొచ్చి పడిందా..?

By:  Tupaki Desk   |   10 April 2020 11:10 AM GMT
రకుల్ ఆ సినిమా వల్ల రోడ్ మీదకొచ్చి పడిందా..?
X
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేము. "ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి.." ఈ సామెత సినిమా వాళ్ళకి బాగా సరిపోతుంది. వరుస ప్లాపులతో డీలా పడ్డ వాళ్ళు ఒక్క హిట్ సినిమాతో స్టార్ హోదాలోకి వచ్చేస్తారు. స్టార్ హోదా ఎంజాయ్ చేసిన వాళ్ళు ఒక్క ప్లాప్ మూవీతో కోలుకోలేని స్థితికి వెళ్ళిపోతారు. మళ్ళీ పుంజుకునే అవకాశం లేక కనుమరుగయ్యే వాళ్ళు సినీ ఇండస్ట్రీలో కోకోల్లలున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే మన టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదా ఎంజాయ్ చేసిన ఒక బ్యూటీ ఇప్పుడు అవకాశాల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసే అవకాశం వచ్చింది. ఆమె ఎవరో కాదు హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. చిన్న సినిమాల హీరోయిన్‌ గా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోల సరసన నటించి లక్కీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. కానీ టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుత పరిస్థితి ఏంటో చెప్పనక్కర్లేదు. గత రెండు సంవత్సరాలుగా ఈ అమ్మడి కెరీర్ డౌన్ ఫాల్ లో ఉంది. ఒకప్పుడు తన గ్లామర్ తో - తన యాక్టింగ్ తో ప్రేక్షకులను కట్టిపడేసిన రకుల్ ఇప్పుడు అవకాశాల వెయిట్ చేయాల్సి వస్తోంది. రోజుకి ఒక కొత్త హీరోయిన్ పరిచయమవుతున్న సినీ ఇండస్ట్రీలో పూజాహెగ్డే - రష్మిక లాంటి న్యూ జనరేషన్ హీరోయిన్లను తట్టుకొని రకుల్ నిలబడలేకపోతోందనే చెప్పాలి. వాస్తవానికి టాలీవుడ్ లో ఆమె కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. దీంతో ఇక్కడ అవకాశాలు సన్నగిల్లాయి.

ఇదిలా ఉండగా ఆమె నటించిన ఒక సినిమా వల్ల ప్రస్తుతం ఈ పరిస్థితికి వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. కింగ్ నాగార్జునతో కలిసి నటించిన 'మన్మథుడు 2' సినిమా కారణంగా ఆమె ఇప్పుడు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోందని వారి అభిప్రాయం. ఈ సినిమాపై రకుల్ భారీ ఆశలే పెట్టుకుంది. దాని కోసం బోల్డ్ క్యారెక్టర్ అయినా అంగీకరించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకొని రకుల్ ఆశల మీద నీళ్లు చల్లింది. ఈ సినిమాలో రకుల్ పోషించిన బోల్డ్ పాత్రని మన తెలుగు ప్రేక్షకులు చాలా మంది అసహ్యించుకున్నారు. దానికి కారణాలు లేకపోలేదు. రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్ సిగరెట్ తాగడం - ఇంకో లేడీకి లిప్ లాక్ ఇవ్వడం లాంటివి ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. అందువల్ల ఈమెను రిజెక్ట్ చేసారని చెప్పవచ్చు. ఈ ఒక్క సినిమా చేసి ఉండకపోతే ఆమె కెరీర్ మరోలా ఉండేదని రకుల్ శ్రేయోభిలాషులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా రకుల్ అపజయాలతో క్రుంగి పోయే మనిషి కాదని ధైర్యంగా పోరాడే మనిషని త్వరలోనే పుంజుకొని మళ్ళీ ఫార్మ్ లోకి వస్తుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. రకుల్ ప్రస్తుతం నితిన్ సరసన ఒక సినిమాలో నటిస్తున్నది. ఈ సినిమాతో అయినా రకుల్ పూర్వవైభవాన్ని తెచ్చుకుంటుందేమో చూడాలి.