Begin typing your search above and press return to search.

మణిరత్నంతో నాగ్‌, మహేష్‌.. ఆశలున్నాయి

By:  Tupaki Desk   |   27 May 2015 7:00 AM IST
మణిరత్నంతో నాగ్‌, మహేష్‌.. ఆశలున్నాయి
X
విలన్‌, కడలి సినిమాలతో దారుణమైన ఫ్లాపులు ఎదుర్కొన్న లెజెండరీ డైరెక్టర్‌ మణిరత్నం.. నాగార్జున, మహేష్‌బాబు, ఐశ్వర్యా రాయ్‌లతో ఓ చారిత్రక కథాంశాన్ని తెరకెక్కించడానికి గత ఏడాది చాలా ప్రయత్నాలు చేశారు. ఈ ప్రాజెక్టు ఇక సెట్స్‌ మీదికి వెళ్లడమే ఆలస్యం అనుకున్న తరుణంలో ఏవో కారణాలతో ఆగిపోయింది. మణి సినిమాలో నటించాల్సిన వాళ్లంతా వేరే ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయారు. ఆయన కూడా 'ఓకే కణ్మణి' మొదలుపెట్టేశారు. ఇప్పుడా సినిమా పూర్తయి విడుదలైంది. మణిరత్నం ఈజ్‌ బ్యాక్‌ అని అంతా అంగీకరించారు.

ఇప్పుడు మళ్లీ తన కలల ప్రాజెక్టును తిరిగి మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట మణిరత్నం. రెండు వరుస ఫ్లాపుల నేపథ్యంలో రిస్కీ ప్రాజెక్టు చేయడం సరికాదన్న భావనతోనే అప్పుడా సినిమాను పక్కనపెట్టారని.. 'ఓకే బంగారం'తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిన నేపథ్యంలో తాను తెరకెక్కించాలనుకున్న చారిత్రక కథాంశాన్ని తాను ముందు అనుకున్న నటీనటులతోనే చేయాలని మణిరత్నం సంకల్పించినట్లు సమాచారం. ముందుగా ఐశ్వర్యారాయ్‌తో సంప్రదింపులు మొదలయ్యాయట. మణిరత్నం తనతో గత ఏడాది చేయాలనుకున్న సినిమా గురించి మాట్లాడారని.. ఆయనతో చేయడానికి ఎప్పుడూ సిద్ధమేనని ఐశ్వర్యారాయ్‌ అన్నట్లు బాలీవుడ్‌ మీడియాలో వార్తలొచ్చాయి. మరి మన నాగార్జున, మహేష్‌ల మాటేంటో చూడాలి.