Begin typing your search above and press return to search.

వెబ్ వరల్డ్ లో అడుగుపెట్టబోతున్న స్టార్ డైరెక్టర్...?

By:  Tupaki Desk   |   5 Jun 2020 4:30 AM GMT
వెబ్ వరల్డ్ లో అడుగుపెట్టబోతున్న స్టార్ డైరెక్టర్...?
X
ప్ర‌స్తుతం ఎక్కడ చూసిన వెబ్ సిరీస్ అనే మాటే వినిపిస్తుంది. ఆ సిరీస్ చూసావా.. ఈ సిరీస్ చూసావా.. నెక్స్ట్ సీజన్ ఎప్పుడు రాబోతోంది.. అంటూ తెగ చర్చించుకుంటునున్నారు. కంటెంట్ ఎలా ఉన్నా కూడా ఫ్యామిలీస్ అందరూ వెబ్ సిరీస్ లని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో కూడా వీటి హవా ఇలానే కొనసాగే అవకాశముంది. భవిష్యత్ లో వెబ్ కంటెంట్ దే రాజ్యం కాబోతోందని భావించిన నటీనటులు దర్శక నిర్మాతలు వెబ్ కంటెంట్ వైపు అడుగులు వేస్తున్నారు. వెబ్ సిరీస్ లు చేయడానికి చాలా మంది దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. స్టార్ హీరోలు సైతం వెబ్ సిరీస్ లు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి, తరుణ భాస్కర్ క్రిష్ శరత్ మరార్ స్వప్న దత్ లాంటి దర్శక నిర్మాతలు వెబ్ వరల్డ్ లో అడుగులు పెట్టేసారు. ఈ క్రమంలో ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ ఒకరు వెబ్ వరల్డ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే స్టార్ డైరెక్టర్ మణిరత్నం డిజిటల్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. మణిరత్నం ప్ర‌స్తుతం 'పొన్నియ‌న్ సెల్వ‌న్‌' అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా క‌రోనా ప్ర‌భావంతో చిత్రీక‌ర‌ణ ఆపేసుకుంది. కాగా ఈ సినిమా త‌ర్వాత మ‌ణిర‌త్నం డిజిట‌ల్ వరల్డ్ లో ఓ వెబ్ సిరీస్ ద్వారా ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌ని కోలీవుడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. దీని కోసం ఇప్ప‌టికే మ‌ణిర‌త్నం ఒక కాన్సెప్ట్‌ ను సిద్ధం చేశార‌ట‌. కాకపోతే ఈ వెబ్‌ సిరీస్‌ కు మ‌ణిర‌త్నం స్క్రిప్ట్ అందించడంతో పాటు నిర్మాత‌గా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రిస్తాడ‌ట‌. అయితే త‌న డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ప‌నిచేసే ఒక‌రికి దర్శకత్వ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.