Begin typing your search above and press return to search.

నాని సినిమాకు మ్యూజిక్ ఎవరో తెలుసా?

By:  Tupaki Desk   |   24 Feb 2016 9:30 AM GMT
నాని సినిమాకు మ్యూజిక్ ఎవరో తెలుసా?
X
మణిశర్మ.. ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమను ఏలిన సంగీత దర్శకుడు. చిరంజీవి - బాలకృష్ణ - నాగార్జున - వెంకటేష్ - పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు.. ఇలా అగ్ర హీరోలతో వరుసగా సినిమాలు చేసిన ఈ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్.. గత దశాబ్దంలో బాగా డల్ అయిపోయాడు. పెద్ద హీరోలు ఆయన్ని పట్టించుకోవడం మానేయగా.. మిగతా సినిమాల్లో కూడా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో దాదాపుగా ఖాళీ అయిపోయాడు మణి. గత ఏడాది బాలయ్య సినిమా ‘లయన్’కు అవకాశం వచ్చింది కానీ.. దాన్ని ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆడియోకు పేలవమైన రెస్పాన్స్ వచ్చింది. చివరగా ‘అఖిల్’ సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ అందించిన మణి.. అప్పట్నుంచి ఖాళీగా ఉన్నాడు.

ఐతే ఎవ్వరూ ఊహించని ఓ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడిప్పుడు. నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ మూవీకి మణిశర్మనే సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. అసలు నాని ఉన్న ఊపులో ఇంద్రగంటితో సినిమా చేయడమే ఆశ్చర్యమంటే.. ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకుడు కావడం ఇంకా చిత్రం. ఈ సినిమాకు నిర్మాత ఎవరో తెలిసినా ఆశ్చర్యపోవాల్సిందే. బాలయ్యతో ఆదిత్య 369 - వంశానికొక్కడు లాంటి సినిమాలు తీసి.. చాలా గ్యాప్ తర్వాత ‘మిత్రుడు’ అనే మరో చిత్రం నిర్మించిన శివలెంక కృష్ణప్రసాద్ తన ‘శ్రీదేవి’ మూవీస్ బేనర్ మీద నాని-ఇంద్రగంటి సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మొత్తానికి ఈ సినిమాకు చాలా చిత్రమైన కాంబినేషనే కుదిరినట్లుంది. నాని మినహాయిస్తే మిగతా అందరూ స్ట్రగుల్లో ఉన్నవాళ్లే. వాళ్లందరి రాతను నేచురల్ స్టార్ మార్చేస్తాడేమో చూడాలి.