Begin typing your search above and press return to search.

సీఎంతో భేటీ అవుతున్నారు.. భోంచేసి వస్తున్నారు.. గుడ్ న్యూస్ మాత్రం రావడంలేదు..!

By:  Tupaki Desk   |   16 Feb 2022 9:00 AM IST
సీఎంతో భేటీ అవుతున్నారు.. భోంచేసి వస్తున్నారు.. గుడ్ న్యూస్ మాత్రం రావడంలేదు..!
X
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల వ్యవహారం గత నెలలుగా ఇండస్ట్రీలో నానుతూనే ఉంది. రేట్లు తగ్గిస్తూ ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయం మీద ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం అయినా.. సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేసినా.. విజ్ఞప్తులు అభ్యర్ధనలు చేసినా.. వరుసగా భేటీలు నిర్వహించినా ఇంకా దీనిపై స్పష్టమైన ప్రకటన మాత్రం వెలువడటం లేదు.

జనవరి నెలలో సంక్రాంతి సమయంలో చిరంజీవి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంట్లో సమావేశమై సినీ ఇండస్ట్రీలోని సమస్యలపై చర్చించారు. జగన్ తో కలిసి లంచ్ చేసి వచ్చిన చిరు.. టాలీవుడ్ కు త్వరలోనే మంచిరోజులొస్తాయని.. మరో పది రోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన జీవో వస్తుందని చెప్పారు. పది కాస్త ఇప్పుడు నెల రోజులు అయినా తీపి కబురు రాలేదు.

ఈసారి చిరంజీవి ఒక్కరే పోకుండా మహేష్ బాబు - ప్రభాస్ - రాజమౌళి - కొరటాల శివ - నిరంజన్ రెడ్డి వంటి టాలీవుడ్ ప్రముఖులను వెంటబెట్టుకుని వెళ్లారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని సమస్యలకు శుభం కార్డు పడబోతోందని.. మరో వారంలో శుభవార్త వింటారని ధన్యవాదాలు తెలిపారు. వాళ్ళు చెప్పిన సమయం కూడా దాటి పోయింది.

ఇప్పుడు 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు వంతు వచ్చింది. మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో జగన్ తో సమావేశం అయ్యారు. ఏపీ సీఎంతో చిరంజీవి భేటీ ఆయన వ్యక్తిగతమన్న విష్ణు.. ఇప్పుడు ఇది కూడా తన పర్సనల్ మీటింగ్ అని చెప్పారు. ఇదొక లంచ్ భేటీ మాత్రమేనని.. జగన్ అన్నతో మాట్లాడినవన్నీ వ్యక్తిగత విషయాలే అని తెలిపారు.

సినిమా ఇండస్ట్రీ గురించి కూడా చాలాసేపు మాట్లాడుకున్నామని అంటున్నాడు కానీ... ఈ వేదికగా మీద వాటి గురించి మాట్లాడానని పేర్కొన్నారు విష్ణు. ఆ మధ్య దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో సమావేశమై భోంచేసి వచ్చిన సంగతి తెలిసిందే.

ఇలా ఒకరి తర్వాత ఒకరు సినీ ఇండస్ట్రీ సమస్యల మీద ఏపీ సర్కారుతో భేటీలు నిర్వహిస్తున్నారు.. భోజనం చేసి వస్తున్నారు.. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఆశించిన ప్రకటన మాత్రం రావడం లేదు.

సినీ ప్రముఖులు సమావేశమైన ప్రతీసారి గుడ్ న్యూస్ వస్తుందని టాలీవుడ్ అంతా ఆశగా ఎదురు చూస్తూ వస్తోంది. భేటీ అనంతరం వాళ్ళు చెప్పే మాటలు విని అంతా పరిష్కారం అవుతుందని నమ్ముతున్నారు. కానీ జీవో మాత్రం రావడం లేదు.

టికెట్ రేట్లు ఏ మేరకు పెంచుతారో అనేది పక్కన పెడితే.. ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తే అంతో ఇంతో లాభం చేకూరుతుంది కదా అని సినిమా వాళ్ళు ఆలోచిస్తున్నారు. రోజులు గడుతున్నాయి.. వాళ్లకు ఎదురు చూపులు మిగులుతున్నాయి. ఇకపోతే కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఏపీలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి వస్తుందని అందరూ భావించారు. ఈ విషయంలో కూడా నిరాశే ఎదురైంది.

సీఎం జగన్ సైతం చిత్ర పరిశ్రమకు అన్ని విధాలుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. నిర్మాతలకు నష్టం కలగకుండా.. ప్రజలకు భారం కాకుండా సినిమా టికెట్ ధరలు ఉంటాయని చెప్పారు.

పెద్ద సినిమాలతో పాటుగా పెద్ద చిత్రాలకు కూడా ఐదో షోకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. దీనికి తగ్గట్లుగా సరికొత్త జీవో రిలీజ్ చేయనున్నారు. కాకపోతే ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తున్నారనేది ఎవరికీ అర్థంకాని విషయం. మరి ఈ నెలాఖరుకైనా దీనిపై ఏదొకటి తేల్చేస్తారేమో చూడాలి.