Begin typing your search above and press return to search.

'మా' బిల్డింగ్‌ కు ప్రతి పైసా నేనే ఇస్తా.. అలా చేస్తే పోటీ నుండి తప్పుకుంటా!

By:  Tupaki Desk   |   12 July 2021 3:20 PM GMT
మా బిల్డింగ్‌ కు ప్రతి పైసా నేనే ఇస్తా.. అలా చేస్తే పోటీ నుండి తప్పుకుంటా!
X
మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించిన వారు హడావుడి చేస్తున్నారు. ఇప్పటికే ప్రకాష్‌ రాజ్‌ సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడు మా ఎన్నికలకు సంబంధించి ట్వీట్స్‌ చేస్తున్నారు. ఇదే సమయంలో మురళి మోహన్‌ ఇటీవల మాట్లాడుతూ మా ఎన్నికలు ఈసారి జరగక పోవచ్చు.. ఏకగ్రీవం అవుతాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా బిల్డింగ్‌ ను ఈసారి ఖచ్చితంగా కట్టేస్తాం అంటూ ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే మంచు విష్ణు మా బిల్డింగ్ కు అయ్యే ఖర్చులో 25 శాతం వరకు తమ ఫ్యామిలీ తరపున చెల్లిస్తాం అంటూ ప్రకటించాడు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి మా బిల్డింగ్‌ కు ప్రతి ఒక్క పైసా తమ కుటుంబం చెల్లిస్తుందని.. ఇక మా బిల్డింగ్‌ నిర్మాణం గురించి ఎవరు మాట్లాడనక్కర్లేదు అంటూ ప్రకటించాడు.

మా బిల్డింగ్‌ కోసం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న చర్చకు ఇక ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని మంచు విష్ణు ప్రకటించాడు. బిల్డింగ్‌ కు కావాల్సిన మొత్తం డబ్బును తాము చెల్లిస్తామని ప్రకటించడంతో ఆసక్తికర చర్చ మొదలయ్యింది. ఇక అదే సమయంలో ఇండస్ట్రీ పెద్దలు అయిన కృష్ణ.. కృష్ణం రాజు.. చిరంజీవి.. బాలకృష్ణ.. నాగార్జున.. వెంకటేష్‌.. రాజేంద్ర ప్రసాద్‌.. జయసుధ మరియు బ్రహ్మానందం ఇతర పెద్దలు మా ఎన్నికలు ఏకగ్రీవంకు చర్చలు జరిపి ఎవరిని ఎంపిక చేస్తే వారికి పూర్తి మద్దతుగా ఉంటాను. వారి నిర్ణయంను పాటిస్తాను. ఏకగ్రీవం చేస్తే తాను పోటీ నుండి తప్పుకుంటాను. కాని వారు ఏకగ్రీవంకు విఫలం అయితే మాత్రం నేను పోటీలో నిలబడుతాను అంటూ మంచు విష్ణు ప్రకటించాడు.

2015 లోనే అప్పట్లో దాసరి గారు నన్ను మా ప్రెసిడెంట్‌ గా ఉండమని అన్నారు. కాని నాన్న గారు నాకు వయసుకు మించిన బాధ్యత అవుతుందని వారించారు. దాసరి గారితో ఆ సమయంలో చెప్పి నన్ను అధ్యక్షుడిగా వద్దన్నారు. సినిమా ఇండస్ట్రీలో యూనియన్‌ మెంబర్‌ అయిన వారు మాత్రమే వర్క్‌ చేయాల్సి ఉంటుంది. కాని నటీ నటుల విషయంలో మాత్రం యూనియన్‌ లో సభ్యత్వం లేకుండానే వర్క్‌ చేస్తున్నారు. చాలా మంది మా మెంబర్స్‌ కు వర్క్‌ లేకుండా ఉంది. ఇలాంటి సమయంలో మొదట మా మెంబర్స్ కు మాత్రమే అవకాశం ఇవ్వాలి. అదే సమయంలో కొత్త వారికి కూడా ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి. అందుకు గాను మా ఫ్యామిలీని పెంచాలి.

900 మంది ఉన్న మా ఫ్యామిలీని పెంచాలి. కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. నిర్మాతలకు ప్రతి ఒక్కరు సహకరించాలి. నిర్మాతలు లేకుండా మనము లేము. ప్రతి నటుడు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటూ మంచు విష్ణు సూచించాడు. కొత్త వాళ్లను ప్రోత్సహించాలి. ప్రస్తుతం అనేక ప్లాట్‌ ఫామ్‌ ల్లో అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరికి అవకాశం దక్కేలా చూడాలి అనేది తన ఉద్దేశ్యం అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.