Begin typing your search above and press return to search.

'అల్లుడు గారు' రీమేక్ లో చేయాలనుందట!

By:  Tupaki Desk   |   26 Aug 2021 12:30 AM GMT
అల్లుడు గారు రీమేక్ లో చేయాలనుందట!
X
మంచు విష్ణు ఒక వైపున హీరోగా .. మరో వైపున నిర్మాతగా తన దూకుడు చూపుతున్నాడు. నటుడిగా .. నిర్మాతగా తండ్రి బాటలో అడుగులు వేస్తున్నాడు. అలాగే తండ్రి మాదిరిగానే యాక్షన్ కామెడీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. సొంత బ్యానర్లో భారీ బడ్జెట్ సినిమాలతో పాటు, ఓటీటీ సినిమాలు కూడా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమాల్లో మాట్లాడుతూ తనకి సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

"మా నాన్నగారికి మనోజ్ ను హీరోగా చేయాలని .. నన్ను ఐపీఎస్ ఆఫీసర్ ను చేయాలనుండేది. చిన్నప్పుడు నేను కాస్త రంగు తగ్గువగా ఉండేవాడిని .. మనోజ్ బాగుండేవాడు. అయితే నాకు మాత్రం హీరోను కావాలని ఉండేది. నన్ను హీరోను చేయమనే దేవుడిని కోరుకుంటూ ఉండేవాడిని. నేను మోహన్ బాబుగారి కొడుకుగా పుట్టడం .. ఒక నటుడిగా నాకు ఛాన్స్ రావడం ఎన్నో జన్మలనాటి పుణ్యంగా నేను భావిస్తూ ఉంటాను. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది నేను చేసుకున్న అదృష్టం. అమ్మానాన్నల ఆశీస్సులు .. దేవుడు ఇచ్చిన వరం వల్లనే నేను ఇంత గొప్పవాడినినయ్యానని అనుకుంటున్నాను.

ఆఫీసులలో కూర్చుని పనిచేసేటప్పటికంటే, కెమెరా ముందు ఉన్నప్పుడే నేను ఎక్కువ ఆనందాన్ని పొందుతూ ఉంటాను. మా సొంత బ్యానర్లో ఇంతవరకూ వచ్చిన సినిమాలలో నాకు 'అల్లుడు గారు' అంటే చాలా ఇష్టం. ఆ సినిమా నా ఆల్ టైమ్ ఫేవరేట్. చాలామందికి 'పెదరాయుడు' .. 'రామన్న చౌదరి' .. 'అసెంబ్లీ రౌడీ' సినిమాలు బాగా నచ్చేసి ఉండొచ్చు. కానీ ఆ సినిమాల్లో నాన్నగారిలా నేను నటించలేను .. ప్రయత్నించడం కూడా తప్పే అవుతుంది. 'అల్లుడు గారు' సినిమా మాత్రం నాకు బాగా నచ్చుతుంది. అసలు ఆ స్క్రిప్ట్ నా హార్ట్ కి చాలా దగ్గరగా ఉంటుంది. అందువలన నాకు 'అల్లుడు గారు' సినిమాలో చేయాలనుంటుంది.

నాన్నగారి సినిమాల్లో నేను చేయదగినవిగా నాకు రెండు సినిమాలు కనిపిస్తాయి. ఒకటి 'అల్లుడు గారు' అయితే, మరొకటి 'ఎమ్. ధర్మరాజు M.A.'. ఒక నటుడిగా నా స్థాయి ఎంత అనే విషయంపై నన్ను నేను చెక్ చేసుకోవాలంటే, అందుకు నేను చేయవలసిన సినిమా ఇది. ఈ సినిమాలో నాన్నగారు చేసిన పాత్రను చేసి నేను పాస్ మార్కులు తెచ్చుకుంటే చాలు. మంచి దర్శకుడు చెప్పి అలా చేయించుకోగలగాలి. అలాంటి దర్శకుడు దొరకాలి. అది ఎప్పుడు జరుగుతుందనేది చూడాలి" అంటూ చెప్పుకొచ్చాడు.