Begin typing your search above and press return to search.

ప్చ్.. విష్ణు సినిమా కూడా ఔట్

By:  Tupaki Desk   |   22 Jan 2018 10:05 AM GMT
ప్చ్.. విష్ణు సినిమా కూడా ఔట్
X
సంక్రాంతి సినిమాలు ఆశించిన స్థాయిలో తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచలేకపోయాయి. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ‘అజ్ఞాతవాసి’ దారుణమైన ఫలితాన్నందిస్తే.. ‘జై సింహా’.. ‘గ్యాంగ్’ ఏదో పర్వాలేదనిపించాయి. ‘రంగుల రాట్నం’ తుస్సుమంది. గత కొన్నేళ్లలో ఏ సంక్రాంతీ ఇంత పేలవంగా లేదు. సంక్రాంతి అలా అయితే అయ్యిందని.. ఇక రిపబ్లిక్ డే వీకెండ్ మీద దృష్టిపెట్టారు తెలుగు ప్రేక్షకులు. కానీ ఈ తేదీకి ముందు నాలుగైదు సినిమాలు రిలీజ్ కానున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ తర్వాత ఒక్కొక్కటే సైడ్ అయిపోయాయి. మూడు సినిమాలు రేసులో నిలిచాయి. ఇప్పుడు ఆ మూడింట్లో రెండు రేసు నుంచి తప్పుకోగా.. చివరికి ఒకే ఒక్క సినిమా మాత్రమే మిగిలింది.

కృష్ణ కూతురు మంజుల దర్శకురాలిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ‘మనసుకు నచ్చింది’ ఆల్రెడీ ఫిబ్రవరి 26కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సినిమా రిపబ్లిక్ డే వీకెండ్ నుంచి ఔట్ అయిపోయింది. అదే.. మంచు విష్ణు సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’. ‘మనసుకు నచ్చింది’ థియేటర్ల సమస్యతో పక్కకు తప్పుకోగా.. విష్ణు మూవీని ఏవో సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ వారంలో ‘భాగమతి’ సోలో బ్యాటింగ్ చేయబోతోందన్నమాట. ఇది ఆ సినిమాకు భలేగా కలిసొచ్చిన విషయమే. ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీని ఇలా పోటీ లేకుండా రిలీజ్ చేసే అవకాశం దక్కడం అరుదే. దీనికి పోటీగా డబ్బింగ్ సినిమా ‘పద్మావత్’ కూడా వస్తోంది కానీ.. దాన్ని మన జనాలు ఏమాత్రం పట్టించుకుంటారన్నది సందేహమే.