Begin typing your search above and press return to search.

మనస్సుకి నచ్చినా మాస్ కూ నచ్చాలి

By:  Tupaki Desk   |   21 Jan 2018 11:25 AM IST
మనస్సుకి నచ్చినా మాస్ కూ నచ్చాలి
X
ఈ మధ్యకాలంలో కొన్నిసినిమాలు క్లాసుకు నచ్చినా కూడా మాసుకు నచ్చకపోతే మాత్రం పెద్దగా కలక్షన్లను తేవట్లేదు. ఉదాహరణకు 'ఒక్క క్షణం' వంటి సినిమాలు.. క్లాస్ ధియేటర్లలో పరవాలేదు అనిపించినా కూడా.. మాస్ దగ్గర మాత్రం బోల్తా పడ్డాయ్. వాటి కలక్షన్లే అందుకు నిదర్శనం. అలాగే పూర్తి స్థాయి మాస్ అంటూ వచ్చిన సినిమాలు క్లాస్ ను కూడా ఆకట్టుకున్నాయి. 'అర్జున్ రెడ్డి' వంటి సినిమాయే అందుకు ఉదాహరణ. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నాం అనేనా మీ ఆశ్చర్యం? అక్కడికే వస్తున్నాం.

చాలా క్యూట్ లవ్ స్టోరీగా సీనియర్ హీరో కృష్ణ కూతురు మంజుల తొలిసారి డైరక్షన్ పగ్గాలు పట్టేసి రూపొందించిన సినిమా 'మనస్సుకు నచ్చింది'. అసలే సందీప్ కిషన్ కు ఈ మధ్యకాలంలో హిట్లు లేవు కాబట్టి.. ఈ సినిమాపై అంచనాలు తక్కువగానే ఉన్నాయి. అందుకే మన లేడీ డైరక్టర్.. హీరోయిన్ అమైరా దస్తూర్ గ్లామర్ తో.. త్రిధా చౌదరి బికినీలతో చాలా గట్టిగా ప్రయత్నం చేసింది. అక్కడివరకు బాగానే ఉన్నా కూడా.. అసలు జనవరి 26న ఈ సినిమా వస్తున్నా కూడా ఎక్కువమందికి ఆ విషయం తెలియదు. మాస్ లో అసలు ఈ సినిమా ఊసే లేదు. ఇక్కడ సదరు మేకర్లు అర్దంచేసుకోవాల్సిన విషయం ఏంటంటే.. సినిమాకంటే కూడా ప్రమోషన్లకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వాటిని సరిగ్గా టేకాఫ్‌ చేయకపోతే.. సినిమా అనే విమానం సరిగా ఎగరదు.

కంటెంట్ విషయంలో ఎంత నమ్మకం ఉన్నా కూడా.. జనాల్లోకి దానిని తీసుకెళ్లకపోతే.. పాజిటివ్ టాక్ వ్యాప్తి చెందేలోపే సినిమా ధియేటర్ల నుండి ఎగిరిపోతుంది. మరి ఇప్పటికైనా ఈ సినిమాకు కాస్త బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే బెటర్. కేవలం డైరక్టర్ మంజుల అనే కాదు.. ఎన్నో సినిమాలను చేసిన సందీప్ కిషన్ కూడా సినిమా రిలీజ్ ను ఇలా డల్ గా ప్లాన్ చేస్తుంటే.. అసలు సినిమా రిజల్టు మీదే డౌట్లు వచ్చేస్తున్నాయి సుమీ!!