Begin typing your search above and press return to search.

సంచలనంగా దేవరాజ్ ఆడియో క్లిప్.. మరీ సుద్దపూసేమీ కాదా?

By:  Tupaki Desk   |   10 Sept 2020 10:00 AM IST
సంచలనంగా దేవరాజ్ ఆడియో క్లిప్.. మరీ సుద్దపూసేమీ కాదా?
X
టీవీ నటి శ్రావణి ఆత్మహత్య పలు మలుపులు తిరుగుతోంది. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా వార్తలు వచ్చిన కొన్ని గంటలకే కొత్త కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. గంటలు గడుస్తున్న కొద్దీ.. కొత్త అంశాలు బయటకు రావటమే కాదు.. కొత్త పాత్రలు తెర మీదకు వస్తున్నాయి. శ్రావణి ఆత్మహత్య చేసుకున్న వెంటనే.. వారి కటుుంబ సభ్యులు ‘‘దేవరాజు రెడ్డి’’ పేరును ప్రస్తావిస్తూ.. అతడి వేధింపుల కారణంతోనే తమ కుమార్తె మరణించినట్లుగా ఆరోపించటం సంచలనంగా మారింది.

ఇది జరిగిన కొద్ది గంటలకే తెర మీదకు వచ్చిన దేవరాజు.. తాను అమాయకుడ్ని అని.. తాను.. శ్రావణి ప్రేమించుకున్నామని.. మరణానికి కాస్త ముందు తాము రెస్టారెంట్లో కలిసినట్లు చెప్పాడు. ఆ సమయంలో సాయి అనే వ్యక్తి తనపైనా.. శ్రావణిపైనా దాడి చేసినట్లు వెల్లడించాడు. తనను శ్రావణి వెళ్లిపొమ్మందని.. తాను హ్యాండిల్ చేస్తానని చెప్పినట్లు పేర్కొన్నాడు. షూటింగ్ అయిన మూడు రోజులకు కలుస్తానని చెప్పిందని.. అంతలోనే ఆత్మహత్య చేసుకుందన్నాడు. అంతేకాదు.. తాను శ్రావణికి ఫోన్ చేయనని.. తనే ఫోన్ చేస్తుందని.. తన దగ్గర ఎలాంటి ఫోటోలు లేవని చెబుతూ.. కావాలంటే పోలీసులు చెక్ చేసుకోవచ్చని చెప్పిన వైనం.. ఆత్మహత్య ఎపిసోడ్ వెనుక ఏదో ఉందన్న సందేహాలు కలిగేలా చేశాయి.

దేవరాజు మాటల్ని విన్నప్పుడు అతడు అమాయకుడా? అన్న సందేహం కలిగేలా ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే.. తాజాగా శ్రావణి - దేవరాజుకు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఒక ఆడియో తాజాగా బయటకు వచ్చింది. శ్రావణి సూసైడ్ ఉదంతంలో మరిన్ని అనుమానాలకు తావిచ్చేలా ఈ ఆడియో క్లిప్ ఉందంటున్నారు. అందులో శ్రావణిని దేవరాజ్ బెదిరింపులకు పాల్పడినట్లుగా స్పష్టమవుతోంది.

మర్యాదగా వచ్చి తనతో గంట టైం గడపాలని దేవరాజ్ బెదిరించినట్లుగా ఆ ఆడియోలో ఉంది. ఒకవేళ రాకుంటే.. జరిగే పరిణామాల గురించి తనను అడగొద్దన్న హెచ్చరిక ఉండటం గమనార్హం. అతగాడి మాటలకు స్పందించిన శ్రావణి.. ‘ఇంతటితో ఆపేయ్.. నీతో మాట్లాడను దేవా’ అంటూ ఆమె మాటలు ఉన్నాయి. ఈ ఆడియో క్లిప్ కొత్త సందేహాలకు తావిస్తోంది.

ఇదిలా ఉంటే.. సాయి అనే వ్యక్తి మీద దేవరాజ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో అతడు మీడియా ముందుకు వచ్చాడు. తాను శ్రావణి కుటుంబానికి స్నేహితుడినని.. ఆమె జీవితాన్ని కాపాడేందుకు ప్రయత్నించినట్లు చెప్పాడు. ఆమె ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి తాను ఆమె కుటుంబంతోనే ఉన్నట్లుగా చెప్పి.. తానెక్కడికి పారిపోలేదన్నారు. ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతున్న ఈ వ్యవహారాన్ని చూస్తే.. పోలీసుల విచారణలోనే అసలు విషయాలు బయటకు వస్తాయని చెప్పక తప్పదు.