Begin typing your search above and press return to search.

యేలేటి ఓకే చేశాడు..కొరటాలకు లైన్ క్లియర్

By:  Tupaki Desk   |   23 July 2016 10:50 AM IST
యేలేటి ఓకే చేశాడు..కొరటాలకు లైన్ క్లియర్
X
విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కొత్త సినిమా ‘మనమంతా’ విడుదలకు సిద్ధమైపోయింది. ఇంకో రెండు వారాల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే టీజర్ తో తన ముద్ర చూపించిన యేలేటి.. లేటెస్టుగా ట్రైలర్ కూడా వదిలాడు. యేలేటి నుంచి మరో వైవిధ్యమైన మంచి సినిమా రాబోతున్నట్లుగా ట్రైలర్ హింట్ ఇస్తోంది. ఒక సినిమా తర్వాత ఇంకో సినిమాకు సంబంధం లేకుండా చూసుకునే యేలేటి.. ఈసారి కొత్తగా మధ్యతరగతి జీవితాల్లోని లోతుల్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే తనదైన శైలి థ్రిల్లర్ అంశాలకూ ఇందులో చోటున్నట్లుంది. తెలుగు సినిమాల్లో మల్టీస్టోరీ స్క్రీన్ ప్లే అన్నది అరుదు. అలా వచ్చిన ఒకటీ అరా సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. ‘మనమంతా’ ఆ లోటు తీర్చేలా ఉంది. ట్రైలర్ ఆహ్లాదకరంగా.. ఆసక్తికరంగా ఉంది.

ఇంతకుముందు టీజర్లో మోహన్ లాల్ వాయిస్ వింటే జనాలకు అదోలా అనిపించింది. కానీ ట్రైలర్లో ఆయన వాయిస్ బెటర్ గా అనిపిస్తోంది. టీజర్లో మోహన్ లాల్ వాయిస్ విషయంలో నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో యేలేటి పునరాలోచనలో పడ్డట్లు వార్తలొచ్చాయి. ముందు చెప్పిన డబ్బింగ్ కంటెంట్ అంతా తీసేసి.. మరోసారి మోహన్ లాల్ తో కొత్తగా డబ్బింగ్ చెప్పించి.. అప్పటికీ సంతృప్తి లేకుంటే డబ్బింగ్ ఆర్టిస్టును ట్రై చేద్దామనుకున్నారు. కానీ ఆ అవసరం లేకుండా మోహన్ లాల్ రెండోసారి మంచి ఔట్ పుట్ ఇచ్చినట్లున్నాడు. దీంతో ‘జనతా గ్యారేజ్’ విషయంలో కొరటాల కూడా మోహన్ లాల్ వాయిస్ ట్రై చేయొచ్చన్నమాట. ‘మనమంతా’ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.