Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : మనమంతా

By:  Tupaki Desk   |   5 Aug 2016 9:32 AM GMT
మూవీ రివ్యూ : మనమంతా
X
చిత్రం : ‘మనమంతా’

నటీనటులు: మోహన్ లాల్ - గౌతమి - విశ్వాంత్ - బేబీ రైనా రావు - అనీషా ఆంబ్రోస్ - వెన్నెల కిషోర్ - తారకరత్న - కృష్ణచైతన్య - నాజర్ - ఊర్వశి - గొల్లపూడి మారుతీరావు - నరేష్ - పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు
ఛాయాగ్రహణం: రాహుల్ శ్రీవాత్సవ్
సంగీతం: మహేష్ శంకర్
మాటలు: రవిచంద్రతేజ
నిర్మాత: రజినీ కొర్రపాటి
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి

‘ఐతే’ దగ్గర్నుంచి ‘సాహసం’ వరకు వైవిధ్యమైన సినిమాలతో తెలుగు తెరపై తనదైన ముద్ర వేశాడు చంద్రశేఖర్ యేలేటి. అతను కమర్షియల్ సక్సెస్ లు అందుకోకపోయి ఉండొచ్చు కానీ.. యేలేటి సినిమా అంటే ఏదో ఉంటుందని ఆసక్తిగా థియేటర్లకు వస్తారు కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు. ‘సాహసం’ తర్వాత మూడేళ్లు విరామం తీసుకుని యేలేటి తీసిన సినిమా ‘మనమంతా’. జాతీయ స్థాయిలో గొప్ప నటుడిగా పేరున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జనాల్లో ఆసక్తి రేకెత్తించింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మనమంతా’ విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

సాయిరాం (మోహన్ లాల్) సూపర్ మార్కెట్లో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తూ.. మేనేజర్ గా ప్రమోషన్ ఆశిస్తున్న సగటు మధ్యతరగతి వ్యక్తి. గాయత్రి (గౌతమి) బొటాబొటి మధ్య తరగతి జీవితాన్ని అసంతృప్తితో వెళ్లదీస్తున్న ఇల్లాలు. అభిరామ్ (విశ్వాంత్) ఓ అమ్మాయి ప్రేమకోసం చక్కగా సాగుతున్న లైఫ్ పక్కనబెట్టి ఆమె కోసమే బతకడం మొదలుపెట్టిన కుర్రాడు. మహిత (బేబీ రైనా రావు) తన చుట్టూ ఉన్న వాళ్లందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే స్కూల్ స్టూడెంట్. నలుగురు వేర్వేరు వ్యక్తుల వల్ల ఈ నలుగురి జీవితాలు మలుపు తిరుగుతాయి. ఆ మలుపులేంటి.. చివరికి ఈ నలుగురూ తమకు ఎదురైన సవాళ్లను ఎలా ఛేదించారు.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

చంద్రశేఖర్ యేలేటి కొత్త సినిమా తీసిన ప్రతిసారీ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. అతడి గత సినిమా చూసి మనం ఒక అంచనాతో వెళ్తే.. అతను ఇంకో రకమైన సినిమాను అందిస్తాడు. ‘మనమంతా’ విషయంలోనూ అంతే. ఇప్పటిదాకా థ్రిల్లర్.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.. అడ్వెంచరస్ సినిమాలు ట్రై చేసిన యేలేటి.. ఈసారి తన గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఎమోషన్ తో కూడిన విలువల పాఠం చెప్పే ప్రయత్నం చేశాడు. ఇది మనిషి గురించి చెప్పే సినిమా. మనిషి ఎలా బతుకుతున్నాడో.. ఎలా బతకాలో చెప్పే సినిమా. యేలేటి మీద భారీ అంచనాలు పెట్టుకుంటే ‘మనమంతా’ నిరాశ పరచొచ్చు. మామూలుగా చూస్తే మాత్రం ఓకే అనిపిస్తుంది.

‘‘బ్రతకడం నేర్చుకున్నా అనుకున్నా.. మనిషిలా బ్రతకడం మరిచిపోయా’’ అంటూ ‘మనమంతా’లో ఓ డైలాగ్ ఉంటుంది. ఈ సినిమా ఎసెన్స్ అంతా ఆ డైలాగ్ లోనే ఉంటుంది. ఆధునిక జీవనంలో పడి కొట్టుకుపోతూ మానవతా విలువలు.. బంధాలు.. ఆప్యాయతానురాగాల్ని ఎలా మరిచిపోతున్నామో చెప్పే ప్రయత్నం చేశాడు యేలేటి. ఐతే మరింత ఈ ప్రయత్నంలో ఆరంభం అంత బాగా లేకున్నా ముగింపులో మాత్రం మెప్పించాడతను. చివరికి వచ్చేసరికి భావోద్వేగాల్ని పతాక స్థాయికి తీసుకెళ్లి.. మనసుల్ని కదిలించాడు కానీ.. అంతకుముందు కథనాన్ని మరీ నెమ్మదిగా మామూలుగా చెప్పడం నిరాశ కలిగిస్తుంది.

‘మనమంతా’ అనే భవనానికి నాలుగు బలమైన పాత్రల్ని పిల్లర్లుగా పెట్టాడు యేలేటి. మధ్య తరగతి జీవితాల్ని బాగా స్టడీ చేసి ఈ పాత్రల్ని తయారు చేశాడు యేలేటి. మనిషి స్వార్థంతో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల అవతలి వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి అలజడి రేగుతుందో చెప్పడానికి మోహన్ లాల్ పాత్ర సూచిక అయితే.. ఆశకు హద్దంటూ ఏమీ ఉండదని.. సంతృప్తి పడటంలోనే ఆనందం ఉందని గౌతమి పాత్ర ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు యేలేటి. ఇక అమ్మాయి ప్రేమ మైకంలో పడి జీవితాన్నే పణంగా పెట్టే అబ్బాయిల్ని రెప్రెజెంట్ చేస్తుంది విశ్వాంత్ పాత్ర. చిన్న పిల్లల్లో ఉండే కల్మషం లేని ప్రేమకు రైనా పాత్ర ఇండికేషన్.

ఈ నాలుగు పాత్రలతోనూ ఈజీగా కనెక్టయిపోతాడు ప్రేక్షకుడు. ఈ పాత్రల మధ్య బంధం ఏంటన్నది తెర మీద చూస్తేనే తెలుస్తుంది. ఇక్కడ స్క్రీన్ ప్లే విషయంలో చిన్న మ్యాజిక్ చేశాడు యేలేటి. ఓం శాంతి.. వేదం.. చందమామ కథలు తరహాలో వేర్వేరు వ్యక్తుల కథల్ని చూపించి.. చివరికి ఒకచోటికి చేర్చే మల్టిపుల్ స్టోరీ స్క్రీన్ ప్లేలో సాగుతుందీ సినిమా. నాలుగు పాత్రల ద్వారా యేలేటి చెప్పిన నాలుగు కథల్లో కుర్రాడి లవ్ స్టోరీ సాదాసీదాగా అనిపిస్తుంది. గౌతమి పాత్ర ఆరంభంలో మామూలుగా అనిపిస్తుంది కానీ.. చివరికి వచ్చేసరికి ఆ పాత్ర బలం పుంజుకుంటుంది. ఇక మోహన్ లాల్.. చిన్నపాప పాత్రల నేపథ్యంలో సాగే కథలు మాత్రం ఆరంభం నుంచి చివరి దాకా ఆసక్తికరంగా సాగుతాయి. ఈ రెండు పాత్రలతోనూ ఎమోషన్లు బాగా పండించాడు యేలేటి. వాళ్లిద్దరి నటన కూడా కట్టిపడేస్తుంది. ఈ పాత్రలతో ముడిపడ్డ ఎమోషనల్ సీన్స్ కన్నీళ్లు తెప్పిస్తాయి.

యేలేటి గత సినిమాలతో పోలిస్తే నరేషన్ స్లో అనిపిస్తుంది. కథనం నెమ్మదిగా సాగుతుంది. ఈ కథ స్వభావం దృష్ట్యా అలాగే చెప్పాలనుకున్నాడో ఎమో యేలేటి. ప్రథమార్ధం మామూలుగా అనిపిస్తుంది. గౌతమి.. విశ్వాంత్ పాత్రల చుట్టూ సాగే సన్నివేశాలు మరీ నెమ్మదిగా.. మామూలుగా కూడా అనిపిస్తాయి. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం మెరుగ్గా అనిపిస్తుంది. నెమ్మదిగా భావోద్వేగాలు పెంచుతూ.. తెరమీద పాత్రలు పడే సంఘర్షణను ప్రేక్షకులు కూడా ఫీలయ్యేలా చేస్తూ.. చివర్లో ప్రేక్షకుల్లో ఉద్వేగం తీసుకురావడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. పతాక సన్నివేశంలో ఎమోషన్లు బాగా పండాయి. సినిమాకు చివరి 20 నిమిషాలు కీలకం. అక్కడే సినిమా మరో స్థాయికి వెళ్లింది.

ఐతే ఓ పక్క మిగతా మూడు పాత్రలూ అంత సంఘర్షణలో ఉండగా వాళ్లతో సంబంధం ఉన్న మరో పాత్ర (గౌతమి) తన పాటికి తాను సింగపూర్ బయల్దేరడం లాజికల్ గా అనిపించదు. పాత్రల మధ్య బంధాన్ని రివీల్ చేయకుండా భిన్నమైన స్క్రీన్ ప్లే ద్వారా కథ చెప్పే ప్రయత్నంలో యేలేటి ఇక్కడ లాజిక్ మిస్సయ్యాడు. అవతల చాలా పెద్ద ఇబ్బందిలో ఉన్న భర్త.. భార్య ఉద్యోగం గురించి ఫోన్లో సంభాషించే తీరు కూడా అసహజంగా ఉంటుంది. ఇలాంటి కొన్ని ఇబ్బందికర సన్నివేశాల్ని.. నరేషన్ స్లో అన్న కంప్లైంట్ ను పక్కనబెడితే ‘మనమంతా’ మంచి అనుభూతినే మిగులుస్తుంది.

నటీనటులు:

మోహన్ లాల్ పోషించిన సాయిరాం పాత్ర తెరమీద చూస్తున్నంతసేపూ మామూలుగా అనిపిస్తుంది. బయటికి వచ్చాక మాత్రం వెంటాడుతుంది. ఈ పాత్రకు మోహన్ లాల్ ను యేలేటి ఏరికోరి ఎందుకు ఎంచుకున్నాడో సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎక్కడా అతి చేయకుండా కొలిచినట్లుగా.. పాత్రకు తగ్గట్లుగా సహజంగా నటించి మెప్పించాడు మోహన్ లాల్. తన ‘సింపుల్’ నటనతోనే పాత్రకు జీవం తీసుకొచ్చాడు మోహన్ లాల్. తాను చేసిన తప్పుకు ఓ కుటుంబం బలైపోతోందని తెలిసిన తర్వాత ఆ పాత్ర పడే సంఘర్షణను లాల్ అద్భుతంగా పలికించాడు. డబ్బింగ్ మొదట్లో కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది కానీ.. కాసేపు పోయాక అలవాటు పడిపోతాం. లాల్ తర్వాత ఎక్కువ మార్కులు బేబీ రైనా రావుకే ఇవ్వాలి. తొలి సన్నివేశంలోనే ఈ చిన్నారితో ప్రేమలో పడిపోతాం. అంత చక్కగా హావభావాలు పలికించింది. ఒకప్పుడు గౌతమిని అలా చూసి.. ఇప్పుడు ఇలా చూడ్డం కొంచెం ఇబ్బందే. జీర్ణించుకోవడానికి కొంచెం కష్టమవుతుంది. ఐతే నటన విషయంలో ఆమెకు వంకలు పెట్టడానికేం లేదు. జ్యువెలరీ షాప్ నేపథ్యంలో వచ్చే సన్నివేశంలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. విశ్వాంత్ కూడా బాగానే చేశాడు. అనీషా ఆంబ్రోస్ మాత్రం ఓవరాక్షన్ తో చంపేసింది. ఊర్వశి కనిపించినంతసేపూ ఎంటర్టైన్ చేస్తుంది. హర్షవర్ధన్.. గొల్లపూడి మారుతీరావు.. పరుచూరి వెంకటేశ్వరరావు.. నాజర్.. వెన్నెల కిషోర్.. వీళ్లందరూ పాత్రలకు తగ్గట్లుగా నటించారు. తారకరత్న ఓ చిన్న పాత్రలో తళుక్కుమన్నాడు.

సాంకేతిక వర్గం:

టెక్నీషియన్స్ అందరూ సినిమాకు బలంగా నిలిచారు. ఇందులో పాటలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. కొంచెం బోరింగ్ గా సాగే లవ్ స్టోరీ నేపథ్యంలో వచ్చే రెండు పాటలూ ఓ మోస్తరుగా అనిపిస్తాయి. ఐతే బ్యాగ్రౌండ్లో వచ్చే రెండు థీమ్ సాంగ్స్ మాత్రం బాగున్నాయి. వీటితో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలోనూ మహేష్ శంకర్ మెప్పించాడు. రాహుల్ శ్రీవాత్సవ్ ఛాయాగ్రహణం కనువిందు చేస్తుంది. నిర్మాణ విలువల విషయంలో వంక పెట్టడానికి లేదు. రవిచంద్రతేజ మాటలు చక్కగా కుదిరాయి. ఇక రచయితగా.. దర్శకుడిగా యేలేటి మరోసారి తన ముద్రను చూపించాడు. యేలేటి గత సినిమాల తరహాలో సినిమాలో అంత వేగం చూపించలేకపోయాడు. యేలేటి అభిమానులైతే ఈ సినిమాతో నిరాశ చెందుతారేమో. ఐతే స్క్రీన్ ప్లే విషయంలో.. కొన్ని పాత్రల్ని చక్కగా తీర్చిదిద్దడంలో.... పతాక సన్నివేశాల్లో ఎమోషన్లు రాబట్టడంలో యేలేటి విజయవంతమయ్యాడు.

చివరగా: మనమంతా.. మంచి సినిమానే కానీ..!

రేటింగ్: 3/5


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre