Begin typing your search above and press return to search.

దేవరకొండ.. అజయ్ భూపతి పేర్లతో యువతకు వల!!

By:  Tupaki Desk   |   3 July 2020 11:40 AM IST
దేవరకొండ.. అజయ్ భూపతి పేర్లతో యువతకు వల!!
X
సినిమా అవకాశం అంటే అందరికీ పిచ్చే. దాన్నే కొంతమంది మోసగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. సినిమాలు, టీవీ సీరియళ్లు, మోడలింగ్ లో శిక్షణ ఇప్పిస్తామంటూ సైబర్ నేరస్థులు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు.

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, ఆర్ఎస్100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి పేర్లతో సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పించి యువతను ఆకర్షిస్తున్న వైనం తాజాగా వెలుగుచూసింది.

ఆసక్తి ఉన్న వారు ఫొటోలు, వీడియో తీసి పంపించాలని.. తాము వాటిని ఎడిట్ చేసి సినిమాలు, టీవీ సీరియళ్లలో అవకాశాలు ఇప్పించేలా చేస్తామని.. ఇందు కోసం వేలకు వేలు చెల్లిస్తే సరి పోతుందని ప్రకటనలు గుప్పించారు. ఇక యాడ్స్ లోనూ అవకాశం ఇప్పిస్తామని రూ.25వేలు చెల్లించాలని ప్రకటనలు ఇచ్చారు.

తాజాగా దర్శకుడు అజయ్ భూపతి పేరుతో వాట్సాప్ నంబర్ ను సృష్టించి కథానాయకలు కావాలంటూ ప్రచారం చేస్తున్నారు. ముగ్గురు యువతులు డైరెక్టుగా అజయ్ భూపతిని సంప్రదించగా ఈ మోసం బయట పడింది. అజయ్ భూపతి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ నకిలీ రాయుళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇప్పటికే ఓ బాన్సువాడ కుర్రాడు విజయ్ దేవరకొండ పేరు తో యువతులకు వల వేసి పోలీసులకు చిక్కాడు. తాజా అజయ్ భూపతి ని కూడా మోసగాళ్లు వాడుకుంటున్నారు.