Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ స్ఫూర్తి తో దాడి.. వీడియో వైరల్

By:  Tupaki Desk   |   7 Nov 2019 2:29 PM IST
కేజీఎఫ్ స్ఫూర్తి తో దాడి.. వీడియో వైరల్
X
కన్నడ సినిమా ‘కేజీఎఫ్’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి గొప్ప విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ సినిమా తెలుగు, హిందీలోనూ డబ్ అయ్యి కాసులు కురిపించింది. హీరో యష్ నటన, దర్శకుడు, మేకర్స్ పనితనానికి అందరూ ఫిదా అయ్యారు. ఈ సినిమాలోని అతి క్రూరయైన ఎమోషనల్ సన్నివేశాలు రక్తికట్టించాయి. కానీ వాటిని కొందరు చూసి ఫాలో అవ్వడం.. అలానే హత్యలు, దాడులు చేయడం కలకలం రేపుతోంది.

తాజాగా ఓ తండ్రి తన సొంత కూతురును కేజీఎఫ్ సినిమాలో చేసినట్టే సుత్తితో దాడి చేయడం కలకలం రేపింది. కేజీఎఫ్ సినిమాలో ఒక సుత్తితో విలన్ ను కొట్టినప్పుడు అప్పుడే హీరో యష్ తిరుగుబాటు మొదలయ్యే సీన్ ను అందరూ చూసే ఉంటారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ సీన్ ను అచ్చుగుద్దేలా కర్ణాటకలోని హసన్ కు చెందిన ఓ వ్యక్తి కూడా తన 12 ఏళ్ల కూతురును ఇలానే దాడి చేయడం విస్తుగొలిపింది. ఈ దాడిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

ఈ వీడియో పోలీసులకు చేరడంతో ఆ తండ్రిని అరెస్ట్ చేసి మైనర్ బాలికపై దాడి చేసినందుకు జైలుకు పంపారు. కూతురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం హసన్ కు చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు కూతుళ్లు. కొడుకులు లేరు. మగసంతానం కలుగలేదని భార్యతోపాటు కూతుళ్లను హింసిస్తున్నాడు. కేజీఎఫ్ సినిమాలోని సీన్లను చూసి అలాగే తన కూతురుపై దాడి చేశాడు ఆ తండ్రి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేజీఎఫ్ సినిమా ఎంత పనిచేస్తోందని అందరూ ఆశ్చర్యపోతున్నారు.