Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ శకుంత‌లకోసం.. త‌రలివ‌‌చ్చిన‌ మ‌ల‌యాళ‌ దుష్యంతుడు!

By:  Tupaki Desk   |   24 March 2021 5:38 AM GMT
టాలీవుడ్‌ శకుంత‌లకోసం.. త‌రలివ‌‌చ్చిన‌ మ‌ల‌యాళ‌ దుష్యంతుడు!
X
‘రుద్ర‌మ‌దేవి’ వంటి చారిత్రక చిత్రం తర్వాత.. మళ్లీ అదే జోనర్ ను ఎంచుకున్నారు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్‌. క‌మ‌ర్షియ‌ల్ మూవీస్ ‌తోపాటు చారిత్ర‌క సినిమాల‌‌ను అద్భుతంగా తెర‌కెక్కించ‌గ‌ల‌న‌ని నిరూపించుకున్న ఆయ‌న‌.. ఈ సారి అంద‌మైన ప్రేమ‌క‌థ‌ను సెల్యులాయిడ్ పై ఆవిష్క‌రించ‌బోతున్నారు.

శ‌కుంత‌ల‌-దుష్యంతుడి ల‌వ్ స్టోరీని సినిమాగా మ‌లిచేందుకు ఏనాడో సిద్ధ‌మ‌య్యారు గుణ‌శేఖ‌ర్‌. ‘శాకుంత‌లం’ పేరుతో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. అయితే.. ప్ర‌ధాన పాత్ర‌ధారుల ఎంపిక‌కు చాలా క‌స‌ర‌త్తు చేశారు. చివ‌ర‌కు.. ఇండ‌స్ట్రీ మొత్తాన్ని గాలించి శకుంతలను వెతికి పట్టుకున్న గుణశేఖర్ కు.. దుష్యంతుడిని సెలక్ట్ చేయడానికి మాత్రం మరింత సమయం పట్టింది.

ఈ సినిమాలో శకుంతలగా సమంత నటిస్తుండగా.. దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నారు. దేవ్ మోహన్ కు తెలుగులో ఇదే మొదటి చిత్రం. శ‌కుంత‌ల పాత్ర‌లో స‌మంత ఫైన‌ల్ అయిన నాటి నుంచి.. దుష్యంతుడి పాత్రకు గుణ‌శేఖ‌ర్ ఎవ‌రిని ఎంచుకుంటారోన‌నే క్యూరియాసిటీ నెల‌కొంది. ఫైన‌ల్ గా.. టాలీవుడ్ ను దాటి మ‌ల‌యాళం దుష్యంతున్ని ప‌ట్టుకొచ్చారు.

ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ఈ సినిమా షూట్‌లో పాల్గొంటున్నారు దేవ్ మోహ‌న్‌. మంగ‌ళ‌వారం ఆయ‌న సెట్స్ లో అడుగు పెట్టారు. హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో ఈ మూవీని షూట్ చేస్తున్నారు. దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని.. వ‌చ్చే ఏడాది విడుద‌ల చేయ‌నున్నారు.