Begin typing your search above and press return to search.

తెలుగు మార్కెట్ పై కన్నేసిన మలయాళ నేచురల్ స్టార్...!

By:  Tupaki Desk   |   26 Aug 2020 4:40 PM IST
తెలుగు మార్కెట్ పై కన్నేసిన మలయాళ నేచురల్ స్టార్...!
X
సౌత్ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ విల‌క్ష‌ణ నటుడిగా గుర్తింపు పొందాడు మలయాళ నేచురల్ స్టార్ ఫాహ‌ద్ ఫాజిల్. ఇతను లెజెండ‌రీ మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు ఫాజిల్ తనయుడు.. అలానే 'రాజా రాణి' హీరోయిన్ నజ్రియా నజీమ్ భర్త. కెరీర్ స్టార్టింగ్ లో మామూలు సినిమాలే చేస్తూ వచ్చిన ఫాహ‌ద్.. తర్వాత రోజుల్లో అద్భుత‌మైన సినిమాల్లో నటిస్తూ మాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో కోలీవుడ్ లో కూడా అడుగుపెట్టిన ఫాహ‌ద్ ఫాజిల్.. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ వల్ల తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ నేపథ్యంలో ఇటీవల తన భార్య నజ్రియాతో కలిసి ''ట్రాన్స్'' అనే సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు.

కాగా 'ట్రాన్స్' సినిమాలో ఫాహ‌ద్ ఫాజిల్ అద్భుతమైన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ తో పాటు 'ఆహా' లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి వ్యూయ‌ర్ షిప్ బాగుందని ఓటీటీ వర్గాల సమాచారం. ఈ సినిమాతో ఫాహ‌ద్ కి తెలుగులో కూడా బాగానే ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఈ నేప‌థ్యంలో ఫాహిద్ ఫాజిల్ అప్ క‌మింగ్ మూవీ ''సీ యూ సూన్'' చిత్రాన్ని కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఫాహద్‌ - రోషన్‌ మాథ్యూస్ - దర్శనా రాజేంద్రన్‌ ప్రధాన పాత్రల్లో మహేష్ సి. నారాయణ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. లాక్‌ డౌన్‌ సమయంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ 70 నిమిషాల నిడివి ఉండే ఈ సినిమాను పూర్తిగా ఐ ఫోన్‌ లో చిత్రీకరించడం విశేషం. అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 1న 'సీ యూ సూన్' చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఫాహిద్ ఫాజిల్ తెలుగు మార్కెట్ మీద క‌న్నేసాడని తెలుస్తోంది. ఇప్పటికే 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమా కారణంగా ఫాహిద్ నటించిన మాతృక ''మహేషింతే ప్రతీకారమ్'' మూవీని తెలుగు ప్రేక్షకులు చేసేశారు. ఈ నేపథ్యంలో తన యాక్టింగ్ తో తెలుగు ఆడియన్స్ ని మెస్మ‌రైజ్ చేసిన ఫాహిద్ నటించిన గత చిత్రాల్ని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. థియేటర్స్ రీ ఓపెన్ అయిన వెంట‌నే ఫాహిద్ మలయాళ హిట్ సినిమాల్ని తెలుగులో విడుద‌ల చేయ‌డానికి రంగం సిద్ధం అవుతుంద‌ని స‌మాచారం. ఇప్పటికే మలయాళ స్టార్ హీరోలు మమ్ముట్టి - మోహన్ లాల్ - దుల్కర్ సల్మాన్ నటించిన సినిమాలకి ఇక్కడ ఆదరణ లభిస్తోంది. మరి ఫాహ‌ద్ ఫాజిల్ కూడా తన తెలుగులో మార్కెట్ క్రియేట్ చేసుకుంటాడేమో చూడాలి