Begin typing your search above and press return to search.

జాతీయ ఉత్తమ నటికి తిండి తిప్పలు

By:  Tupaki Desk   |   10 Sept 2017 10:39 AM IST
జాతీయ ఉత్తమ నటికి తిండి తిప్పలు
X
సెలబ్రిటీ హోదా వచ్చాక కచ్చితంగా వాళ్లు చేసే ప్రతిపనిని నిశితంగా గమనించే వాళ్లుంటారు. ఒక్కోసారి చిన్న విషయానికి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు వివరణ ఇచ్చుకోవాల్సిన సందర్భాలూ ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు అనుకోకుండా జరిగే సంఘటనలకు కూడా విమర్శలు ఎదురవుతుంటాయి. ప్రముఖ మళయాళ నటి సురభి లక్ష్మికి రీసెంట్ గా ఇలాంటి అనుభవం ఎదురైంది.

కేరళ వాసులు సంప్రదాయాలకు చాలా విలువిస్తారు. ఆ రాష్ట్రంలో ఘనంగా జరిగే పండగల్లో ఓనం ఒకటి. ఆ రోజున సాధారణంగా అంతా వెజిటేరియన్ ఫుడ్ నే తీసుకుంటారు. అసలు నాన్ వెజ్ ఫుడ్ తీసుకోరు. పండగల సందర్భంగా టీవీ ఛానళ్లు స్పెషల్ ప్రోగ్రాంలు చేయడం మామూలే. అందులో భాగంగా ఓనంను పురస్కరించుకుని ఓ టీవీ ఛానల్ షోలో సురభి లక్ష్మి పాల్గొంది. ఈ షోలో భాగంగా బీఫ్ తింది. అదే విషయం సోషల్ మీడియాలోనూ షేర్ చేసింది. అంతే.. ఒక్కసారిగా ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ట్విట్టర్ లో ఆమెపై బోలెడు నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. దీంతో సురభి లక్ష్మి స్పందించి తాను షేర్ చేసిన ఫొటో పండగ నాడు తీసింది కాదని వివరణ ఇచ్చింది. వారం రోజుల ముందు షూటింగ్ లో తీసిన ఫొటోను చూసి అనవసరంగా కామెంట్ చేస్తున్నారంటూ ఒకింత ఆవేదనగా రియాక్ట్ అయింది.

సురభిలక్ష్మి దాదాపు దశాబ్ద కాలంగా మళయాళ సినిమాల్లో నటిస్తోంది. లేటెస్ట్ గా మిన్నమినుంగు సినిమాలో నటనకు ఆమెకు జాతీయ - కేరళ రాష్ట్ర పురస్కరాలు రెండూ వచ్చాయి. మిడిల్ ఏజ్ లో ఓ మధ్యతరగతి తల్లి కష్టాలను ఎదుర్కొనే పాత్రలో ఆమె ప్రతిభకు అవార్డు దక్కింది.