Begin typing your search above and press return to search.

మాస్ మహారాజా ఆఫర్ తిరస్కరించిన 'మాస్టర్' హీరోయిన్..?

By:  Tupaki Desk   |   7 Jun 2020 10:38 AM GMT
మాస్ మహారాజా ఆఫర్ తిరస్కరించిన మాస్టర్ హీరోయిన్..?
X
మలయాళ బ్యూటీ మాళవిక మోహన్ ప్రస్తుతం 'ఇళయదళపతి' విజయ్ - 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'మాస్టర్' సినిమాలో నటిస్తోంది. షారుఖ్ ఖాన్ 'డాన్' - మహేష్ బాబు 'మహర్షి' సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించిన కేయూ మోహనన్ కూతురే ఈ మాళవిక మోహనన్. 2013లో వచ్చిన 'పెట్టం పోలె అనే మలయాళీ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మాళవిక మోహన్. ఆ తర్వాత తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కన్నడ హిందీ ఇండస్ట్రీలలో కాలుమోపింది. అంతేకాకుండా రజనీకాంత్‌ హీరోగా నటించిన 'పేట' చిత్రంతో కోలీవుడ్‌ కు ఎంట్రీ ఇచ్చింది. అందులో రజనీకాంత్‌ స్నేహితుడు శశికుమార్‌ కి జోడీగా నటించింది. టాలెంట్ ఎంత ఉన్నా అప్పుడప్పుడు లక్ కూడా కలిసి రావాలి అంటుంటారు. మాళవిక విషయంలో మాత్రం అలా జరగలేదు. అమ్మడు కెరీర్ స్టార్ట్ చేసిన ఏడేళ్లలో కేవలం ఏడు చిత్రాల్లో మాత్రమే నటించిందంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో తెలుగు తెరపై కూడా అందాలతో కనువిందు చేయడానికి రెడీ అయింది మాళవిక మోహన్. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో 'హీరో' అనే చిత్రంలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. అయితే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఓవర్ బడ్జెట్ అవుతుందని ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని పక్కన పెట్టేసారు. అయితే ఇటీవల మాళవిక దగ్గరికి మరొక క్రేజీ టాలీవుడ్ ఆఫర్ ఆమెను వెతుక్కుంటూ వెళ్లిందట.

వివరాల్లోకి వెళ్తే మాస్ మహారాజా రవితేజ 'రాక్షసుడు'లాంటి సూపర్ హిట్ సినిమాకి డైరెక్షన్ చేసిన రమేష్ వర్మతో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని కోనేరు సత్యనారాయణ తనయుడు యువ హీరో హవీష్ నిర్మించనున్నాడు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న 'క్రాక్' సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ని ఇంకా ఫైనలైజ్ చేయలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా మాళవిక మోహన్ ని నటింపజేయాలని చిత్ర యూనిట్ అమ్మడిని సంప్రదించారట. అయితే మాళవిక ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించిందట. ఇప్పట్లో తెలుగు సినిమాల్లో నటించే ఉద్దేశ్యం లేదని చెప్పుకొచ్చిందట. మాళవిక ప్రస్తుతం అంత బిజీగా ఏమీ లేదు. ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక్క ప్రాజెక్టు 'మాస్టర్' కూడా ఇప్పటికే పూర్తయిపోయింది. ఈ నేపథ్యంలో క్రేజీ ఆఫర్ ఎందుకు వదులుకుంది అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి టాలీవుడ్ లో స్టార్ట్ అయిన మూవీ ఆగిపోవడంతో అమ్మడు తెలుగు ఇండస్ట్రీ మీద అలకబూనిందేమో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.