Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా మోజులో బిగ్ మిస్టేక్ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   13 July 2021 5:00 AM IST
పాన్ ఇండియా మోజులో బిగ్ మిస్టేక్ చేస్తున్నారా?
X
స్టార్ హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేయ‌డానికి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇరుగు పొరుగు భాష‌ల్లోనూ త‌మ మార్కెట్ రేంజుని విస్త‌రించాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు హీరోలు ఇటీవ‌ల‌ పాన్ ఇండియా కానెప్ట్ ల‌ను ఎంపిక చేసుకుంటున్నారు. మాతృభాష‌లో త‌మ సినిమాలు కోట్లాది రూపాయ‌లు వ‌సూళ్లు తెస్తున్న‌ప్ప‌టికీ ప‌ర భాష‌ల్లో అలాంటి ఫ‌లితం నూటికి నూరు శాతం రావ‌డం లేదు.

టాలీవుడ్ హీరోలు చేస్తోన్నఈ ప్ర‌య‌త్నం మంచిదే. కానీ తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ఇది అంత మంచిది కాదేమో అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనివ‌ల్ల‌ ప‌ర‌భాషా హీరోల‌కి ఇక్క‌డా గ్రాండ్ గా వెల్క‌మ్ డోర్లు ఓపెన్ చేసిన‌ట్లే. తెలుగు హీరోలు పాన్ ఇండియా సినిమాల‌పై దృష్టి పెట్ట‌డంతో కోలీవుడ్ హీరోలు తెలుగు మార్కెట్ పై దండెత్తే ప్లాన్ లో ఉన్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇటీవ‌ల శాండ‌ల్వుడ్ నుంచి ప‌లువురు హీరోలు టాలీవుడ్ మార్కెట్ పై సీరియ‌స్ గా క‌న్నేశారు. మాలీవుడ్ నుంచి ప‌లువురు స్టార్లు ఇక్క‌డా త‌మ ప‌ర‌ప‌తి పెంచుకునే ప‌నిలో ఉన్నారు. ఒక ర‌కంగా ఇది ఇబ్బందిక‌ర స‌న్నివేశ‌మేన‌ని ఒక సెక్ష‌న్ విశ్లేషిస్తోంది.

త‌మిళ స్టార్ హీరోలు విజ‌య్- ధ‌నుష్- సూర్య‌- కార్తీ- శివ కార్తికేయ‌న్ లాంటి హీరోలు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేయ‌డానికి రెడీ అవుతుండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. వీళ్లంతా పాన్ ఇండియా పేరుతో నేరుగా టాలీవుడ్ ని టార్గెట్ చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. అలాగే టాలీవుడ్ నిర్మాత‌లు కోలీవుడ్ హీరోల‌తో సినిమాలు నిర్మించ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. మ‌రి తెలుగు హీరోలు కోలీవుడ్ లో ఆ ర‌క‌మైన ఆలోచ‌న చేస్తున్నారా? అంటే అలాంటిదేమీ క‌నిపించ‌డం లేదు. నేటివిటీని న‌మ్మే తంబీలు తెలుగు హీరోల్ని ఆద‌రించ‌డం అంటే అంత సులువేమీ కాదని విమ‌ర్శ‌లొస్తున్నాయి.

త‌మిళనాడు లో లోక‌ల్-నాన్ లోక‌ల్ ఫీలింగ్ తెర‌పైకి తీసుకొచ్చి రాజ‌కీయాలు చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. కార‌ణం ఏదైనా తెలుగు హీరోలు కోలీవుడ్ మార్కెట్ పై దృష్టి పెట్టే ఆలోచ‌నే చేయ‌ర‌న్న‌ది ఎప్ప‌టి నుంచో ఉన్న‌దే. కానీ అలాంటి భేష‌జం టాలీవుడ్ లో లేదు. ఇక్క‌డి హీరోలు ద‌ర్శ‌క‌ నిర్మాత‌లు ప్రేక్ష‌కులు అలాంటి ఆలోచ‌న చేయ‌రు. హీరో ఎవ‌రైనా ఆద‌రిస్తారు. అభిమానించారంటే నెత్తిన పెట్టుకుంటారు. ఇక్క‌డి హెల్దీ వాతావ‌ర‌ణం గురించి సూర్య‌-కార్తీ- విశాల్ లాంటి హీరోలు సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా చెబుతూనే ఉంటారు. ర‌జ‌నీకాంత్ - క‌మ‌ల్ హాస‌న్ లాంటి స్టార్లు నేరుగా తెలుగు లో సూప‌ర్ స్టార్లుగా ఓ వెలుగు వెలిగిన రోజుల‌ను ఎవ‌రూ మ‌ర్చిపోలేరు.

ప్ర‌స్తుత పాన్ ఇండియా ట్రెండ్ లో ఒక తెలుగు స్టార్ ఒక త‌మిళ‌స్టార్ హీరోని క‌లుపుకుని బ‌హుభాషా చిత్రాలు చేసే ప్ర‌య‌త్నం పెద్ద‌గానే వ‌ర్క‌వుట‌య్యేందుకు ఆస్కారం ఉంది. ఆ కోవ‌లో ఇప్ప‌టికే కొన్ని సినిమాలు వ‌చ్చి విజ‌య‌వంతం అయ్యాయి. అయితే తెలుగులో అగ్ర హీరో .. త‌మిళ అగ్ర హీరో క‌లిసి పెద్ద రేంజులో ప్ర‌య‌త్నించింది లేదు. ఒక‌వేళ అలాంటి ప్ర‌య‌త్నం చేస్తే ఇరువైపులా వ‌ర్క‌వుట‌య్యేందుకు ఆస్కారం ఉంటుందేమో!