Begin typing your search above and press return to search.

వివాదం చెలరేగడంతో సిరీస్ లో మార్పులు చేయడానికి సిద్ధమైన మేకర్స్..!

By:  Tupaki Desk   |   20 Jan 2021 1:30 PM IST
వివాదం చెలరేగడంతో సిరీస్ లో మార్పులు చేయడానికి సిద్ధమైన మేకర్స్..!
X
ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌ లో ప్రసారమవుతున్న 'తాండవ్' వెబ్ సిరీస్ పై వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ వెబ్ సిరీస్‌ లో హిందూ దేవతలను కించపరిచారని బీజేపీ నాయకులు.. హిందూవాదులు మండిపడుతున్నారు. దీంతో ఈ సిరీస్ కు వర్క్ చేసిన నటీనటులు, డైరెక్టర్ దీనిపై వివరణ ఇస్తూ బేషరతుగా క్షమాపణ చెప్పారు. సైఫ్ లీఖాన్ - డింపుల్ కపాడియా - జేషన్ ఆయూబ్ వంటి వారు క్షమాపనలు కోరినా ఈ వివాదం సద్దుమణగలేదు. యూపీ - మహారాష్ట్ర లోని పలు స్టేషన్లలో దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్, రచయిత గౌరవ్ సోలంకిపై లక్నోలోని హజరత్‌ గంజ్ పోలీస్ స్టేషన్‌ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతకు ముందే పౌరసమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అమెజాన్ ప్రైమ్ వీడియోకు సమన్లు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎవరినో కించపరచాలన్నది తమ ఉద్దేశ్యం కాదని.. ఈ సిరీస్ లో మార్పులు చేస్తామని 'తాండవ్' మేకర్స్ ప్రకటించారు.

‘తాండవ్’ వెబ్ సిరీస్‌ ద్వారా ఏ మతం, లేదా కులం వారిని గానీ, హిందూ దేవుళ్లను గానీ, దేవతలను గానీ కించపరచాలన్నది తమ ఉద్దేశం కాదని.. అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకొని వెబ్ సిరీస్ లో మార్పులు చేస్తామని మేకర్స్ స్పష్టం చేశారు. కాగా, నిన్న మంగళవారం మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో ఈ సిరీస్ పై కేసు నమోదయింది. దీని యూనిట్ సభ్యులపైనా నటీనటులపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కోరారు. ఇంతకు ముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సలహాదారు శలభ్ మణి త్రిపాఠీ మాట్లాడుతూ తాము ముంబైకి వచ్చి.. ఎలా ప్రతీకారం తీర్చుకుంటామో చూడాలని ఈ సిరీస్ యూనిట్ ని తీవ్రంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇటీవల గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్ కౌంటర్ గురించి ఆయన ప్రస్తావించారు.