Begin typing your search above and press return to search.

హీరోలు ద‌ర్శ‌కుల‌కే మెజారిటీ వాటాల‌ పంపిణీ..!

By:  Tupaki Desk   |   21 May 2021 4:00 PM IST
హీరోలు ద‌ర్శ‌కుల‌కే మెజారిటీ వాటాల‌ పంపిణీ..!
X
తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో ఇటీవ‌ల ట్రెండ్ అనూహ్యంగా మారింది. హీరోస్వామ్యం రాజ్య‌మేలుతున్న ఈ ట్రెండ్ లో నిర్మాత కేవ‌లం పెట్టుబ‌డిదారుడు మాత్ర‌మే. ఫైనాన్స్ లు తెచ్చి హీరో-ద‌ర్శ‌కుడు అడిగినంతా అందించ‌డం వ‌ర‌కే అత‌డి బాధ్య‌త‌. మిగ‌తావ‌న్నీ ఆ ఇద్ద‌రూ చూసుకుంటారు.

ఏదైనా సినిమా ప్రారంభోత్స‌వానికి ముందే ఎవ‌రి వాటా ఎంత అన్న‌ది? నిర్మాత తో మాట్లాడేసుకోవ‌డం అడ్వాన్స్ డ్ ట్రెండ్. త‌మ‌ను చూసి ఆడియెన్ థియేట‌ర్ కి వ‌స్తార‌ని హీరోలు భావిస్తారు. త‌మ ప్ర‌తిభ వ‌ల్ల‌నే సినిమా ఆడుతుంద‌ని ద‌ర్శ‌కులు భావిస్తారు. అందువ‌ల్ల ఆ ఇద్ద‌రూ ఎంత వాటా అడిగితే అంతా చెల్లించాల్సిందే. పారిషికంతో పాటు లాభాల్లో వాటా అద‌నంగా ముడుతుంది.

ప‌లువురు స్టార్ హీరోలు ఇప్ప‌టికే సొంత బ్యాన‌ర్ ప్రారంభించి భాగ‌స్వామ్య విధానంలో సినిమాలు నిర్మిస్తున్నారు. త‌ద్వారా లాభాల్లో వాటాలు అందుతున్నాయి. కొంద‌రు ద‌ర్శ‌కులు త‌మ స్నేహితుల పేరుతో బ్యాన‌ర్లు ర‌న్ చేస్తున్నారు. అందువ‌ల్ల వారికి లాభాల్లో వాటాలు అందుతాయి. హీరోలు.. ద‌ర్శ‌కులు తెలివిగా త‌మ పారితోషికాల‌నే సినిమాకి పెట్టుబ‌డిగా పెట్టి లాభాలార్జిస్తున్నారు. ఒక్కో అగ్ర హీరో 20-30 కోట్ల మేర పారితోషికం అందుకుంటున్నారు. అగ్ర ద‌ర్శ‌కులు అయితే 10-15 కోట్ల మేర పారితోషికాలు అందుకుంటున్నారు. ఈ మొత్తాల్ని సినిమాల్లో పెట్టుబ‌డిగా పెట్టినా లాభాల్లో వాటాలు ఇవ్వాల్సి ఉంటుంద‌న్న‌మాట‌. ఆ మేర‌కు నిర్మాత‌ల‌తో ఒప్పందాలు చేసుకుంటున్నారు.

మునుప‌టితో పోలిస్తే నేటి ట్రెండ్ పూర్తి విరుద్ధ‌మైన‌ది. ఇంత‌కుముందు నిర్మాతే అన్నిటికీ బాస్ గా ఉండేవారు. కానీ నిర్మాత కేవ‌లం నిమిత్త‌మాత్రుడిగా మారిపోయాడు. క‌థంతా హీరో- ద‌ర్శ‌కులే న‌డిపిస్తున్నారు. అదీ సంగ‌తి.