Begin typing your search above and press return to search.

తక్కువ టిక్కెట్ రేట్లతో అందరి దృష్టిని ఆకర్షించిన 'మేజర్'

By:  Tupaki Desk   |   31 May 2022 7:12 AM GMT
తక్కువ టిక్కెట్ రేట్లతో అందరి దృష్టిని ఆకర్షించిన మేజర్
X
టాలీవుడ్ లో సినిమా టిక్కెట్ ధరలు అనేవి ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. కరోనా పాండమిక్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్ధించడంతో టికెట్ రేట్లు పెంచుకోడానికి అనుమతిస్తూ జీవోలు జారీ చేశాయి. ఇప్పుడు వీటి ప్రకారమే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

కోవిడ్ థర్డ్ వేవ్ తర్వాత తెలంగాణలో అన్ని సినిమాలు రూ.295 టికెట్ ధరలతోనే విడుదలవుతున్నాయి. దీనికి ట్యాక్సులు అదనం. వీటితో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో రేట్లు కాస్త తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ రెండు రాష్ట్రాల్లో టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులో లేవనే చెప్పాలి. దీంతో చాలా వరకు ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు.

ఈ విషయాన్ని అంగీకరించిన అగ్ర నిర్మాత దిల్ రాజు తన 'ఎఫ్ 3' సినిమా టికెట్ లపై ఎలాంటి పెంపు లేదని.. సాధారణ ధరలే ఉంటాయని హామీ ఇచ్చారు. ఇటీవల వచ్చిన సినిమా మాదిరిగా అదనపు రేట్లు లేవు గానీ.. తెలంగాణాలో అన్ని మల్టీప్లెక్స్లలో టిక్కెట్ ధరలు రూ. 295 గా లాక్ చేయబడ్డాయి.

సాధారణ మల్టీప్లెక్స్లలో టిక్కెట్ల ధర రూ. 250 వరకే ఉంటుందని దిల్ రాజు చెప్పారు కానీ.. అది ప్రాక్టికల్ గా జరగలేదు. అయితే ఇప్పుడు ''మేజర్'' చిత్రాన్ని స్వల్ప టికెట్ రేట్లతో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నైజాం థియేట్రికల్ రైట్స్ తీసుకున్న ఏషియన్ సునీల్ నారంగ్ ఈ విషయంలో ప్రాక్టికల్ అప్రోచ్ తో వెళ్తున్నారు.

తెలంగాణ ప్రాంతంలోని మల్టీప్లెక్స్ లలో 'మేజర్' టిక్కెట్ ధరలు జీఎస్టీతో కలిపి 195 రూపాయలుగా ఫిక్స్ చేశారు. థర్డ్ వేవ్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన తెలుగు సినిమాల్లో ఇదే అతి తక్కువ టిక్కెట్ ధర అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అడివి శేష్ సినిమాకు ఆన్ లైన్ బుకింగ్స్ ఆశాజనకంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదని ప్రస్తుత పరిస్థితిని విశ్లేషించిన సీనియర్ నిర్మాత దిల్ రాజు.. సాధారణ ప్రేక్షకులపై భారం వేయకూడదని చెప్తూనే అధిక టిక్కెట్ ధరలతో సినిమాని రిలీజ్ చేశారు. 'ఎఫ్ 3' సినిమాని అమ్మకపు రేట్లు చూసుకుంటే.. బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకొని బయ్యర్లు సేఫ్ అవ్వాలంటే ఇంకా పెద్ద మొత్తంలో వసూలు చేయాల్సి ఉంది.

నిజానికి 'ఆర్.ఆర్.ఆర్' 'కేజీఎఫ్ 2' వంటి భారీ సినిమాలు తప్పితే.. మిగతా పెద్ద చిత్రాలకు అధిక మొత్తంలో డబ్బు చెల్లించడానికి ప్రేక్షకులు సిద్ధంగా లేరు. ఇవన్నీ ఆలోచించుకున్న ఏషియన్ సునీల్ తక్కువ రేట్లతో ప్రేక్షకుల దృష్టిని 'మేజర్' సినిమా వైపు మళ్లించారు.

ఇప్పటికే ప్రివ్యూలతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న 'మేజర్' చిత్రం.. అన్ని వర్గాల వారిని థియేటర్లకు రప్పించే అవకాశం ఉంది. ఈ స్ట్రాటజీ బిజినెస్ పరంగా వర్కవుట్ అయితే రాబోయే రోజుల్లో తక్కువ టికెట్ రేట్లతోనే మేకర్స్ తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ముందుకు వస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.