Begin typing your search above and press return to search.

వైఎస్ జగన్ బయోపిక్ రాబోయేది అప్పుడేనా...?

By:  Tupaki Desk   |   26 April 2020 3:30 PM GMT
వైఎస్ జగన్ బయోపిక్ రాబోయేది అప్పుడేనా...?
X
సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. ఇప్పటి దాకా వచ్చిన అన్ని బయోపిక్ లు దాదాపు సక్సెస్ అయినవే. బాలీవుడ్ లో ఇప్పటికే చాలా బయోపిక్ సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక మన టాలీవుడ్ విషయానికొస్తే బ‌యోపిక్‌ల శ‌కానికి సావిత్రి బయోపిక్ 'మ‌హాన‌టి' చిత్రం నాందిప‌లికిందని చెప్పవచ్చు. అంతకముందు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అలాంటి నేపథ్యంలో కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకొని సినిమాలు రూపొందించినప్పటికీ వాటిని బయోపిక్ లుగా ట్రీట్ చేయలేము. ఆ త‌రువాత తెర‌పైకొచ్చిన ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. 'ఎన్టీఆర్ కధానాయకుడు' 'ఎన్టీఆర్ మహానాయకుడు' అని రెండు భాగాలుగా తెరకెక్కిన నందమూరి తారక రామారావు బయోపిక్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అంతేకాకుండా మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథలోని పాదయాత్రను ఆధారంగా చేసుకుని మహి వి రాఘవ ‘యాత్ర’ అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ బయోపిక్ బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్నందుకున్న నేపథ్యంలో మరో మాజీ ముఖ్యమంత్రి జీవిత కథ ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో అని చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు. కానీ ఆ సినిమా జనాలకు బాగానే అనిపించింది. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేయడానికి పురుగొల్పిన అంశాలు.. ఆయన చేసిన పాదయాత్ర.. చివరికి ఎలా ముగిసింది.. ఆయన ముఖ్యమంత్రి కావడం.. చనిపోవడం వంటి అంశాలు ఈ ‘యాత్ర’లో దర్శకుడు ప్రస్తావించారు. అప్పుడే రాజశేఖర్ రెడ్డి తనయుడు - వైసీపీ అధినేత - ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణం నేపథ్యంలో ‘యాత్ర 2’ సినిమాను తెరకెక్కిస్తానని ప్రకటించాడు మహి వి రాఘవ. ‘వైఎస్‌ రాజా రెడ్డి - వైఎస్‌ జగన్‌ గురించి చెప్పకుండా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కథ పూర్తి కాదు. ‘యాత్ర 2’ ఆయన కథను పరిపూర్ణం చేస్తుంది. వైఎస్సార్ యాత్ర తన తండ్రి సమాధి దగ్గర నుండి ప్రారంభమైంది. అలాగే జగన్‌ యాత్ర కూడా ప్రారంభమైంది’ అని రాఘవ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు మన మధ్య ఉన్న వ్యక్తి బయోపిక్ తీస్తే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నదే సందేహంగా మారింది. అంతేకాకుండా అసలు జగన్ జీవితంలో సినిమా తీసేంత స్టోరీ ఉందా అన్న సందేహాలు కూడా జనాల్లో ఉన్నాయి. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో మహిని అడిగితే సీఎం జగన్ కథలో ‘గాడ్ ఫాదర్’ రేంజ్ విషయం ఉందని కామెంట్ చేసాడట. వైఎస్ కథను సినిమాగా చేయడానికి కష్టపడాలేమో కానీ.. జగన్ విషయంలో ఆ ఇబ్బంది లేదని అన్నాడట. హీరోయిజంతో పాటు కష్టాలు.. దరిద్రం.. పోరాటం ఉన్నాయని.. జగన్ జీవిత కథతో సినిమా తీస్తే మంచి ఎమోషనల్ జర్నీ అవుతుందని మహి చెప్పాడట. ముందు రెండు వెబ్ సిరీస్‌లు, ఓ సినిమా చేసి ఆ తర్వాత అన్నీ కుదిరితే జగన్ బయోపిక్‌ పట్టాలెక్కిస్తానని మహి తెలిపాడత. మరి సీఎం జగన్ తన బయోపిక్ తీయడానికి ఒప్పుకుంటాడో లేదో.. దీనికి ప్రయత్నాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో చూడాలి.