Begin typing your search above and press return to search.

'గులాబీ' బైక్ సాంగ్ షూటింగులో మా ప్రాణాలు పోయేవే: మహేశ్వరి

By:  Tupaki Desk   |   25 Jan 2022 9:37 AM GMT
గులాబీ బైక్ సాంగ్ షూటింగులో మా ప్రాణాలు పోయేవే: మహేశ్వరి
X
తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో శ్రీదేవి స్టార్ హీరోయిన్. అలాంటి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన కథానాయికలు ఎవరైనా, కొంచెం ఆ ఇది చూపించడం జరుగుతూ ఉంటుంది. కానీ అలాంటిదేం లేకుండా చాలా సింపుల్ గా ఉంటూ .. తనపనేదో తాను చూసుకుని వెళుతూ కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకున్న హీరోయిన్ గా మహేశ్వరి కనిపిస్తుంది. 'అమ్మాయి కాపురం' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన మహేశ్వరి, తెలుగులో మరి కొన్ని సినిమాలు చేసింది. ఆ సినిమాల్లో 'నీ కోసం' .. 'పెళ్లి' .. 'గులాబీ' సినిమాలు ఆమెకి మరింత క్రేజ్ ను తెచ్చిపెట్టాయి.

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మహేశ్వరి మాట్లాడుతూ, 'గులాబీ' సినిమాను గురించి ప్రస్తావించింది. 'గులాబీ' సినిమా చేసేటప్పుడు అది ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. కాకపోతే ఆ సినిమా వలన నాకు మంచి పేరు వస్తుందని మాత్రం అనుకున్నాను. కృష్ణవంశీ .. వర్మగారి మాట కాదనలేక నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పాను. ఆ సినిమాలో 'మేఘాలలో తేలిపొమ్మన్నది' పాట చేస్తున్నప్పుడు పెద్ద ఇష్యూ అయింది. నాకు అసలు మొదటి నుంచి కూడా బైక్స్ పై వెళ్లడం అలవాటు లేదు. పైగా ఆ పాటలో బైక్ పై స్పీడ్ గా వెళ్లాలి.

ఆ పాట షూట్ చేస్తున్నప్పుడు ఒక కెమెరా పెట్టుకుని మాకు ఎదురుగా మారుతీ వ్యాన్ వస్తోంది. అప్పుడు బైక్ స్కిడ్ అయింది .. ఆ పక్కనే ఉన్న లోయలోకి వెళ్లిపోయింది. ఇంకాస్త ముందుకు వెళితే మా పని అయిపోయేది. కానీ అక్కడ చెట్టు ఒకటి ఉండటంతో బతికి బయటపడ్డాం. ఆ తరువాత మమ్మల్ని .. బైక్ ని పైకి లాగారు" అని చెప్పుకొచ్చింది. ఇక ఇండస్ట్రీలో నాకు మంచి ఫ్రెండ్స్ ఎవరంటే మీనా .. సంగీత. అప్పుడప్పుడు మేమంతా కలుసుకుంటూనే ఉంటాము. మీనా చాలా సాఫ్ట్ .. సంగీత మాత్రం చాలా ఫాస్టు. తాను ఏదైతే మనసులో అనుకుంటుందో అది బయటికి అనేస్తుంది.

మీనా .. సంగీత ఇద్దరూ కూడా రీ ఎంట్రీ ఇచ్చారు. నేను చేయకూడదు అనే ఏమీ లేదు. ఇంతవరకూ నేను చేసిన సినిమాల ద్వారా నాకంటూ ఒక క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ దెబ్బ తినకుండా ఉండే పాత్రలు చేయాలనుకుంటున్నాను. ఈ పాత్ర చేస్తే మంచి పేరు .. గుర్తింపు వస్తాయని నాకు అనిపించాలి. అలాంటి పాత్రలు చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే అలాంటి పాత్రలు రాలేదు గనుకనే గ్యాప్ వచ్చేసింది. నా క్రేజ్ కి తగని పాత్రలు చేయడం కంటే ఊర్కోవడం మంచిదనిపించి చేయలేదంతే .. అంతకుమించి మరేం లేదు" అని చెప్పుకొచ్చింది.