Begin typing your search above and press return to search.

బాలీవుడ్‌ విలన్‌ను మళ్లీ పట్టుకొచ్చారు

By:  Tupaki Desk   |   14 July 2015 10:42 AM GMT
బాలీవుడ్‌ విలన్‌ను మళ్లీ పట్టుకొచ్చారు
X
1999లో వచ్చిన బాలీవుడ్ మూవీ వాస్తవ్.. అక్కడ పెను సంచలనం. తొలి సినిమాతోనే మహేష్ మంజ్రేకర్ స్టార్ డైరెక్టర్లలో ఒకడిగా మారిపోయాడు. ఆ తర్వాత దశాబ్ద కాలంలో మహేష్ చాలా సినిమాలు తీశాడు కానీ.. మళ్లీ తొలి సినిమా స్థాయిలో ఒక్క సినిమా కూడా తీయలేకపోయాడు. డైరెక్టర్‌గా బిజీగా ఉన్న సమయంలోనే నటుడి అవతారమెత్తి ఆశ్చర్యపరిచిన మంజ్రేకర్.. తెలుగు వాళ్లకు కూడా బాగానే పరిచయం. హోమం, ఒక్కడున్నాడు, అదుర్స్, డాన్ శీను లాంటి సినిమాల్లో డాన్ క్యారెక్టర్లతో తెలుగువాళ్లను బాగానే అలరించాడు. ఐతే డాన్ శీను తర్వాత ఆయన మళ్లీ టాలీవుడ్ వైపు చూడలేదు.

నాలుగేళ్ల విరామం తర్వాత ఆయన మళ్లీ ఓ తెలుగు సినిమాలో కనిపించబోతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ‘గుంటూరు టాకీస్‌’లో మహేష్ జాకీ అనే డాన్ పాత్రలో నటిస్తున్నాడు. ఎల్బీడబ్ల్యూ, రొటీన్ లవ్ స్టోరీ, చందమామ కథలు లాంటి సాఫ్ట్ సినిమాలు చేసిన ప్రవీణ్.. ఈసారి ట్రెండుకు తగ్గ మసాలా సినిమా చేస్తున్నాడు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో అతను తీస్తున్న గుంటూరు టాకీస్‌కు ప్రమోషన్ కూడా బాగానే చేయిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఒక్కో క్యారెక్టర్‌ను పరిచయం చేస్తోంది గుంటూరు టాకీస్ టీమ్. సువర్ణగా రష్మి, రివాల్వర్ రాణిగా శ్రద్ధాదాస్ ఇప్పటికే మంచి కిక్కిచ్చారు. తాజాగా పరిచయం చేసిన మంజ్రేకర్ జాకీ పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది. మంజ్రేకర్ నటించాడంటే సినిమాలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. ‘గుంటూరు టాకీస్’ అయినా ప్రవీణ్ ఆశిస్తున్నట్లు కమర్షియల్ సక్సెస్ అవుతుందేమో చూడాలి.