Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ తెలుగు ఆఫర్స్ కోసం ట్రై చేస్తున్న మహేష్ హీరోయిన్..!

By:  Tupaki Desk   |   4 Nov 2020 6:00 PM IST
మ‌ళ్లీ తెలుగు ఆఫర్స్ కోసం ట్రై చేస్తున్న మహేష్ హీరోయిన్..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన '1-నేనొక్కడినే' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది పొడుగుకాళ్ల సుందరి కృతి సనన్. ఫస్ట్ సినిమాకే స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసినప్పటికీ, ఆ చిత్రం నిరాశపరించింది. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య సరసన నటించిన 'దోచెయ్' కూడా పరాజయం పాలైంది. రెండు వరుస ప్లాప్స్ రావడంతో టాలీవుడ్ లో ఈ బ్యూటీకి అవకాశాలు లేకుండా పోయాయి. అదే సమయంలో బాలీవుడ్ లో మాత్రం వరుస ఆఫర్స్ అందుకుని క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అక్షయ్ కుమార్ - వరుణ్ ధావన్ - టైగర్ ష్రాఫ్ - సుశాంత్ సింగ్ రాజ్ పుత్ - రాజ్ కుమార్ రావ్ - ఆయుష్మాన్ ఖురానా - అర్జున్ కపూర్ - కార్తీక్ ఆర్యన్ వంటి హీరోల సరసన నటించింది. ఈ క్రమంలో 'హీరోపంటి' 'దిల్ వాలే' 'లూకా చుప్పి' 'బరేలీకి బర్ఫీ' 'పానిపట్' 'హౌస్ ఫుల్ 4' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అయితే టాలీవుడ్ ద్వారా హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన కృతి సనన్.. మళ్ళీ తెలుగు సినిమాల్లో ఆఫర్స్ కోసం ట్రై చేస్తోందని తెలుస్తోంది. ఇప్పుడు తెలుగు సినిమాలు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. అందుకే స్టార్ హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సైతం తెలుగు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్య శ్రద్ధా కపూర్ - కియారా అద్వానీ - దీపికా పదుకునే - అలియా భట్ - అనన్య పాండే వంటి హీరోయిన్స్ తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కృతి సనన్ కూడా తెలుగు ఆఫ‌ర్స్ కోసం పూరీ క‌నెక్ట్స్ తో లింక్ పెట్టుకుందని టాక్ నడుస్తోంది. మరి అమ్మడికి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ అక్షయ్ కుమార్ సరసన 'బ‌చ్చ‌న్ పాండే' సినిమాలో నటించనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ సినిమాలో కృతి జ‌ర్న‌లిస్ట్ గా న‌టిస్తోంద‌ని స‌మాచారం. అలానే వరుణ్ ధావన్ తో మరో సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది. ఇక కృతి ప్రధాన పాత్రలో నటించిన 'మిమి' ఇటీవలే విడుదలైంది.