Begin typing your search above and press return to search.

రాజమౌళి కోసం మహేష్ మరోసారి త్యాగం చేయబోతున్నారా..?

By:  Tupaki Desk   |   1 Oct 2021 5:00 AM IST
రాజమౌళి కోసం మహేష్ మరోసారి త్యాగం చేయబోతున్నారా..?
X
హ్యాట్రిక్ హిట్స్ తో దూకుడు మీదున్న సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం ''సర్కారు వారి పాట'' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనికి పోటీగా పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' - ప్రభాస్ 'రాధే శ్యామ్' చిత్రాలను వచ్చే పెద్ద పండక్కి రిలీజ్ చేస్తున్నారు. మరికొన్ని సినిమాలు సంక్రాంతి బరిలో దిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్న తరుణంలో ఇప్పుడు సర్కారు వారు వెనక్కి తగ్గనున్నారని రూమర్స్ వస్తున్నాయి.

వాస్తవానికి అందరి కంటే ముందు సంక్రాంతి బెర్త్ పై కర్చీఫ్ వేసిన సినిమా ''సర్కారు వారి పాట''. గతేడాది కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత అందరూ ఇబ్బడిముబ్బడిగా విడుదల తేదీలను ప్రకటిస్తున్న సమయంలోనే మహేష్ బాబు తన 27వ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేస్తానని ప్రకటించారు. దానికి కట్టుబడే విడుదల తేదీని కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు 'ఆర్ ఆర్ ఆర్' మూవీ మూలంగా మహేష్ చిత్రాన్ని రేసు నుండి తప్పించే ఆలోచనలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది.

దసరా సందర్భంగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని దేశవ్యాప్తంగా థియేటర్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని వాయిదా వేశారు. అయితే ఇప్పుడు తన చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలపాలని దర్శకధీరుడు రాజమౌళి అండ్ టీమ్ ఆలోచిస్తున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 22 నుండి థియేటర్లు తెరుచుకోడానికి అనుమతించిన నేపథ్యంలో RRR మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యే ఈ చిత్రానికి నార్త్ మార్కెట్ కీలకం కాబట్టి దర్శకనిర్మాతలు అనువైన తేదీ కోసం చూస్తున్నారు.

ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో జక్కన్న అండ్ టీమ్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మీడియాలో ఈ విషయం మీద కథనాలు ఇస్తోంది. ఈ మేరకు రాజమౌళి ఇప్పటికే 'రాధే శ్యామ్' చిత్రాన్ని వాయిదా వేసుకోమని హీరో నిర్మాతలను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే ఆలస్యం అవుతూ వస్తోన్న ప్రభాస్ పీరియాడికల్ డ్రామా విడుదల తేదీని మార్చడానికి ససేమిరా అన్నారని టాక్. ఈ నేపథ్యంలో ఇప్పుడు మహేష్ బాబు 'సర్కారు వారి పాట' చిత్రాన్ని వాయిదా వేసుకోమని ట్రిపుల్ ఆర్ బృందం కోరుతోందట.

మహేష్ బాబు గతంలో 'బాహుబలి' సినిమా కోసం ఒకసారి తన సినిమా విడుదల తేదీని రాజమౌళి కోసం వదులుకున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పే చిత్రానికి సపోర్ట్ ఇవ్వాలి అంటూ తన మూవీని పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మహేష్ మరోసారి జక్కన్న కోసం తన సినిమా రిలీజ్ డేట్ ని త్యాగం చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది. నిజానికి మహేష్ కు సంక్రాంతి బాగా కలిసొచ్చిన పండుగ. ఆ సీజన్ లో రిలీజ్ అయిన చిత్రాల్లో ఎక్కువ శాతం బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.

అదే సెంటిమెంట్ తో 'సర్కారు వారి పాట' చిత్రాన్ని సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు రాజమౌళి కోసం ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. జక్కన్న - మహేష్ మధ్య చాలా ఏళ్లుగా మంచి సాన్నిహిత్యం ఉంది. వీరిద్దరూ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయబోతున్నారు. అలానే RRR హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఇద్దరూ మహేష్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతుంటారు. ఇప్పుడు వీరందరూ కలిసి అడిగితే స్టార్ హీరో తన చిత్రాన్ని వాయిదా వేసుకునే అవకాశం లేకపోలేదని టాక్ వినిపిస్తోంది. కాకపోతే ఆ తేదీని వదులు కుంటే మహేష్ కు మరో మంచి సీజన్ దొరకడం కష్టం అవుతుంది. మరి సూపర్ స్టార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఇకపోతే 'ఆర్.ఆర్.ఆర్' సినిమా కోసం జనవరి 8వ తేదీని కూడా పరిశీలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా జక్కన్న మాత్రం 2022 జనవరి లోనే తన ప్రతిష్టాత్మక చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది. RRR చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. మరోవైపు 'సర్కారు వారి పాట' చిత్రాన్ని GMB ఎంటర్‌టైన్‌మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ - మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఇప్పుడు వీరందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని విడుదల తేదీలపై ఓ క్లారిటీకి వస్తారేమో చూడాలి.