Begin typing your search above and press return to search.

మహేశ్ పై నెగిటివ్ ట్రెండ్ చేయడంలో ఫ్యాన్స్ తప్పేముంది..?

By:  Tupaki Desk   |   14 Nov 2022 5:30 PM GMT
మహేశ్ పై నెగిటివ్ ట్రెండ్ చేయడంలో ఫ్యాన్స్ తప్పేముంది..?
X
టాలీవుడ్ స్టార్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు టాప్ లో ఉంటారు. నటశేఖర కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. అయితే ఇప్పుడు ఆశ్చర్యకరంగా అభిమానులే ఆయనపై నెగిటివ్ ట్రెండ్ చేసి తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది.

మహేష్ బాబు గత కొన్నేళ్లుగా వరుస విజయాలు సాధిస్తున్నారు. 'భరత్ అనే నేను' 'మహర్షి' 'సరిలేరు నీకెవ్వరు' 'సర్కారు వారి పాట' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. అయితే ఈ విజయాల పట్ల సూపర్ ఫ్యాన్స్ సంతోషంగా లేరు. ఎందుకంటే ఇవన్నీ మహేష్ రేంజ్ సినిమాలు కాదనేది వారి అభిప్రాయం.

మహేశ్ గతంలో మురారి - ఒక్కడు - అతడు - పోకిరి - దూకుడు - బిజినెస్ మ్యాన్ - ఖలేజా వంటి వేటికవే ప్రత్యేకమైన సినిమాలు అందించాడు. అయితే 'శ్రీమంతుడు' తర్వాత ఒకే తరహా సందేశాత్మక కథలతో సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు సబ్టిల్ రోల్స్ కే పరిమితం అవుతున్నారు.

అందుకే సేఫ్ జోన్ నుంచి బయటకు వచ్చి సినిమాలు చేయాలని.. ట్రాక్ మార్చి కొత్త తరహా కంటెంట్ అందించాలని.. అలాంటి చిత్రాలతో తన స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు చూపించాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో క్రేజీ డైరక్టర్లతో తదుపరి రెండు ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టుకున్నారు మహేశ్.

త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ హై ఆక్టేన్ యాక్షన్ మూవీ.. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రాలను చేయటానికి మహేశ్ రెడీ అయ్యారు. అయితే SSMB28 ఒక షెడ్యూల్ పూర్తైన తర్వాత ఇప్పుడు పూర్తిగా కథ మారిందని రూమర్స్ వస్తున్నాయి.

ఫుల్ యాక్షన్ టచ్ తో ఉన్న సబ్జెక్ట్ ని.. ఇప్పుడు గత చిత్రాల మాదిరిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ టెంప్లేట్ లోకి మార్చినట్లుగా చెబుతున్నారు. మహేశ్ కోరిక మేరకే త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో చేంజెస్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో నిరాశ చెందిన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ ఫేవరెట్ హీరోపై ట్రెండ్ స్టార్ట్ చేశారు.

సందేశాలు ఇచ్చే సినిమాలు మాకొద్దని.. వింటేజ్ మహేశ్ ను గుర్తు చేసే కమర్షియల్ చిత్రాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రొటీన్ సినిమాలు ఆపేయాలని కోరుతూ ట్విట్టర్‌ లో StopDoingRoutineMoviesMahesh అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్టులు పెడుతూ ట్రెండ్ చేశారు. బాధ పడుతూనే ఈ ట్రెండ్ లో పాల్గొంటున్నామని పేర్కొంటున్నారు.

ఎన్నో గొప్ప సినిమాలు చేసావ్.. అద్భుతమైన సినిమాలు చేసావ్. బాక్సాఫీస్ రిజల్ట్ అనేది పట్టించుకోకుండా ఎన్నో ప్రయోగాలు చేసావ్. ఒక్క మంచి సినిమా ఇవ్వన్నా గుర్తుండిపోయేలాగా అంటూ మహేశ్ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఫలానా జోనర్‌ లో అలాంటి కథతో సినిమాలు చేయాలంటూ సలహాలు కూడా ఇస్తున్నారు.

అయితే మరికొందరు మాత్రం మహేష్ బాబుకు సపోర్టుగా నిలుస్తున్నారు. '1 నేనొక్కడినే' లాంటి ప్రయోగాత్మక సినిమా చేస్తే ఎలాంటి రిజల్ట్ వచ్చిందో మర్చిపోయారా అని ప్రశ్నిస్తున్నారు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది కాబట్టి సేఫ్ జోన్ లో తనకు హిట్లు ఇస్తున్న జోనర్ లో సినిమాలు చేసుకుంటున్నారని అంటున్నారు. ఏదేమైనా ఇన్నాళ్లూ మోసిన ఫ్యాన్స్ ఇలా బాధతో నెగిటివ్ ట్రెండ్ చేస్తున్నారంటే మహేశ్ తన స్క్రిప్టు సెలక్షన్ పై పునరాలోచించాల్సిన అవసరం వుంది.

నిజానికి ఓటీటీలలో విస్తృతమైన కంటెంట్ కు అలవాటు పడిపోయిన జనాలు.. ఇప్పుడు సరికొత్త వైవిధ్యమైన కంటెంట్ ను చూడటానికి ఇష్టపడుతున్నారు. '1 నేనొక్కడినే' లాంటి ఎక్స్పరిమెంట్స్ ను ఆదరించడానికి సిద్దంగా వున్నారు. రొటీన్ చిత్రాలను నిర్ధాక్షిణ్యంగా రిజెక్ట్ చేస్తున్నారు.

మహేశ్ బాబుతో పాటుగా ఇతర స్టార్ హీరోలు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో విభిన్నమైన సినిమాలు చేయాల్సిన అవసరం వుంది. వారి అభిమానులు సైతం అదే కోరుకుంటున్నారు కాబట్టి.. రొటీన్ చిత్రాలకు స్వస్తి చెప్పి సరికొత్త పంథాలో వెళ్లాలి. ఇప్పుడిప్పుడే పలువురు స్టార్స్ కొత్త తరహా సినిమాలు చేస్తున్నారు. మరి మున్ముందు మిగతా హీరోలు కూడా రోటీన్ ను పక్కన పెట్టి అదే బాటలో వెళ్తారేమో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.