Begin typing your search above and press return to search.

మహేశ్ ఆ సీన్లో మామూలుగా యాక్ట్ చేయలేదు!

By:  Tupaki Desk   |   27 Jan 2022 7:32 AM GMT
మహేశ్ ఆ సీన్లో మామూలుగా యాక్ట్ చేయలేదు!
X
తమిళ దర్శకులలో ఎస్.జె. సూర్యకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడుతూ ఆయన మెగాఫోన్ పట్టుకున్నారు. స్టార్ డైరెక్టర్ కావాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకున్నారు. డైరెక్టర్ సీట్లో కూర్చోవడానికి సూర్య ఎన్ని కష్టాలు పడ్డాడనేది తెలిస్తే, తాను అనుకున్నది సాధించడానికి ఆయన ఎంత పట్టుదలతో ముందువెళ్లాడనేది అర్థమవుతుంది. దర్శకుడిగా ఆయన కొన్ని సినిమాలను తెరకెక్కించాడు. వాటిలో 'వాలి' .. 'ఖుషీ' సినిమాలు ముందువరుసలో కనిపిస్తాయి. ఈ రెండు సినిమాలను గురించి ఈ రోజుకీ మాట్లాడుకుంటూ ఉండటం విశేషం.

దర్శకుడిగా ముందుకు వెళుతున్న సూర్య, ఆ తరువాత నటన పట్ల గల ఆసక్తి ఆ దిశగా అడుగులు వేశారు. మొదటి నుంచి తనకి నటన పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ ఎవరూ తనకి అవకాశం ఇవ్వలేదనీ, అందువల్లనే దర్శకుడి పేరు తెచ్చుకున్న తరువాత నటన వైపుకు వెళ్లాలని తాను అనుకున్నట్టుగా ఒక సందర్భంలో ఆయనే చెప్పారు. అందువలన ఆయన అలాంటి ఒక అవకాశం రాగానే నటనపై దృష్టిపెట్టారు. ఇప్పుడు తమిళనాట బిజీగా ఉన్న విలన్స్ లో ఆయన ఒకరు. 'స్పైడర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన విలన్ గా పరిచయమయ్యారు.

ఒక వైపున తమిళ సినిమాలు చేస్తూనే, తెలుగు హీరోలందరికీ సూర్య టచ్ లోనే ఉంటుంటారు. తెలుగు సినిమాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతూనే ఉంటారు. తాజాగా ఆయన మహేశ్ బాబును గురించి ప్రస్తావించారు. "ఈ మధ్య నేను మహేశ్ బాబు చేసిన 'మహర్షి' .. 'సరిలేరు నీకెవ్వరు' చూశాను. 'మహర్షి' సినిమాలో మహేశ్ బాబు అదరగొట్టేశారు. ఆ సినిమా స్క్రీన్ ప్లే .. మహేశ్ పెర్ఫార్మెన్స్ గొప్పగా అనిపించాయి. నిజంగా ఆ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఇక 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కూడా సూపర్ గా ఉంటుంది.

ఈ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ లో మహేశ్ బాబు ఒక రేంజ్ లో నవ్వించారు. ఆ ఎపిసోడ్ లో మహేశ్ యాక్ట్ చేయలేదు .. బయట ఆయన ఎలా ఉంటారో .. కెమెరా ముందు అలా చేశారంతే. అందువల్లనే ఆ సీన్ అంత బ్రహ్మాండంగా వచ్చింది. ఆయన మేనరిజమ్స్ తలచుకుంటే ఇప్పటికీ కూడా నవ్వొస్తూనే ఉంటుంది. ఆఫ్ స్క్రీన్ లో ఆయన మా దగ్గర ఎలా ఉంటారో .. పర్సనల్ లైఫ్ లో ఎలా ఉంటారో అలాగే యాక్ట్ చేశారు. ఆ సీన్ చూస్తూ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మహేశ్ బాబు యాక్టింగ్ ఎలా ఉంటుందని చెప్పడానికి ఆ ఒక్క సీన్ చాలు" అని చెప్పుకొచ్చారు.